‘The Legend’ movie ది లెజెండ్ రిపోర్ట్

అసలు సినిమా ఎలా తీయకూడదో చెప్పే కళాఖండాలు రెగ్యులర్ గా వస్తూనే ఉంటాయి ఎలా ఆలోచించకూడదో, బడ్జెట్ ని ఎలా వృధా చేయకూడదో చెప్పే మాస్టర్ పీసెస్ మాత్రం అరుదు. అందులో ఒకటి నిన్న విడుదలైన ది లెజెండ్. తమిళనాడు సుప్రసిద్ధ శవరణ స్టోర్స్ అధినేత శరవణన్ తన 51 ఏళ్ళ వయసులో హీరోగా మేకప్ వేసుకుని నటించిన ఈ ప్యాన్ ఇండియా మూవీ తెలుగుతో సహా పలుభాషల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ట్రైలర్ చూసే ఇందులో ఎలాంటి స్టఫ్ ఉంటుందో ప్రేక్షకులకు అర్థమైపోయింది కాబట్టి థియేటర్లకు దూరంగా ఉండిపోయారు. అయినా కూడా నవ్వుకోవడానికి సరిపడా కంటెంట్ ఉంటుందనే నమ్మకంతో టికెట్ కొన్న వాళ్ళు లేకపోలేదు.

అలాంటప్పుడు దీని రిపోర్ట్ తెలుసుకోవడం సబబే. రజినీకాంత్ శివాజీ కథను తిరగేసి మరగేసి దీన్ని రాసుకున్నారు. దర్శకుడు జెర్రీ ఎంత మేధావంటే అందులో విలన్ సుమన్ నే దీనికే తీసుకొచ్చి ఓ పిల్లి గెడ్డం పెట్టి మేనేజ్ చేశాడు. ఓ ప్రాణాంతక వ్యాధికి మందు కనిపెట్టిన డాక్టర్ శరవణన్ ఎలాగైనా దాన్ని పేదలకు అందజేయాలనే లక్ష్యం పెట్టుకుంటాడు. ఈ క్రమంలోనే ఎన్నో ప్రమాదాలు అడ్డంకులు చుట్టుముడతాయి. వాటిని ఎలా దాటుకుని ఎలా విజేత అయ్యాడనేది గుండె దిటవు చేసుకుని వెండితెర మీదే చూసి తరించాలి. ముక్క ఎక్స్ ప్రెషన్ లేకుండా ప్లాస్టిక్ ఫేస్ పెట్టుకుని శరవణన్ లోపాన్ని మేకప్ తో కప్పేయడానికి ఎన్ని లక్షలు ఖర్చు పెట్టారో చెప్పడం కష్టం.

ప్రతి ఫ్రేమ్ చాలా రిచ్ గా ఉంటుంది. విజువల్స్ ఆమ్మో అనిపిస్తాయి. డెబ్భై కోట్లు అన్నారు కానీ అంతకన్నా ఎక్కువ ఖర్చే అయ్యుంటుందనే ఫీలింగ్ కలుగుతుంది. హీరోయిజంని ఎలివేట్ చేయడానికి వాడిన యాక్షన్ ఎపిసోడ్స్ శరవణ స్టోర్స్ ఉద్యోగులకే అతి అనిపించే స్థాయిలో ఉన్నాయి. రొటీన్ పదమే సిగ్గుపడేలా టేకింగ్ తో విసిగించాడు జెర్రీ. హరీష్ జైరాజ్ మ్యూజిక్ ఎంత కష్టపడినా మేజిక్ చేయలేకపోయింది. కెమెరా పనితనం, ఆర్ట్ వర్క్ ఇలాంటి వాటిలో రాజీపడలేదు కానీ ఇలాంటి ఓవర్ బిల్డప్ ప్లాట్ ని శరవణన్ ఎందుకు ఎంచుకున్నాడో అర్థం కాదు. నూటా అరవై సినిమాలకు పైగా చేసిన రజనికి ఒక్క మూవీతోనే దాటేయాలనే అత్యాశ కాబోలు

Show comments