iDreamPost
android-app
ios-app

“బర్డ్‌ ఫ్లూ” – తెలుగు రాష్ట్రాలు అప్రమత్తం..

  • Published Jan 06, 2021 | 10:51 PM Updated Updated Jan 06, 2021 | 10:51 PM
“బర్డ్‌ ఫ్లూ” – తెలుగు రాష్ట్రాలు అప్రమత్తం..

సరిహద్దు రాష్ట్రాల్లో బర్డ్‌ఫ్లూను గుర్తించిన నేపథ్యంలో ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ పశు సంవర్ధక, అటవీ శాఖలు అప్రమత్తమయ్యాయి. తమతమ పరిధిలో ఎక్కడై పక్షులు సామూహికంగా మృతి చెందాయా? అని ఆరా తీస్తున్నారు. ఇప్పటి వరకు అందిన సమాచారాన్ని బట్టి ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ అటువంటి వాటిని గుర్తించిన దాఖలాల్లేవని పశు సంవర్ధక శాఖాధికారులు స్పష్టం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి అందిన ఆదేశాలను అనుసరించి దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు ఇప్పటికే అప్రమత్తమయ్యాయి. అందులో భాగంగా పౌల్ట్రీలు, ఇతర పక్షి పెంపకం కేంద్రాల సిబ్బందికి ఈ మేరకు అప్రతమత్తతో కూడిన ఆదేశాలను ఆయా శాఖల అధికారుల జారీ చేసారు.

గుంటూరు ప్రాంతంలో కాకులు మృతి చెందినట్లు వార్తలు వెలువడినప్పటికీ దీనికి సంబంధించి బర్డ్‌ ఫ్లూ ను ఇంకా ఖరారు చేయలేదు. వాటి శాంపిల్స్‌ను పరీక్షలకు పంపిస్తున్నట్లు సంబంధిత అధికారులు ప్రకటించారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ బర్డ్‌ఫ్లూ జాడలు ఇప్పటి వరకు గుర్తించలేదని, నిరభ్యంతరంగా చికెన్, గుడ్లు తినొచ్చని అధికారులు వెల్లడిస్తున్నారు.

నిజానికి బర్డ్‌ఫ్లూ మనిషి నుంచి మనిషికి వ్యాపించదని వైద్య నిపుణులు చెబుతున్నారు. వ్యాధి భారిన పడ్డ పక్షులను నేరుగా గానీ, వాటి వ్యర్ధాలను గానీ తాకితే దీని భారిన పడతారని చెబుతున్నారు. అయితే ఇప్పటి వరకు మనుషులు బర్డ్‌ఫ్లూ భారిన పడ్డట్టు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా బైటపడలేదంటున్నారు. బర్డ్‌ఫ్లూ (ఏవియన్‌ ఇన్‌ఫ్లూయెంజా)ను ఎన్, హెచ్‌గా వర్గీకరిస్తారు. జలుబు, జ్వరం, గొంతు నొప్పి, న్యూమోనియా, శ్వాసకు సంబంధించిన లక్షణాలే ఇందులో కూడా కన్పిస్తాయని వివరిస్తున్నారు. కోళ్ళ ఫారాల్లో పనిచేసేవారు మాస్క్, గ్గౌజ్‌లు తదితర రక్షణ విధానాలను అనుసరించాలని నిపుణులు సూచిస్తున్నారు.

సామూహికంగా ఎక్కడైనా పక్షలు మృతి చెందితే సమీపంలో పశువైద్యులకు సమాచారం అందించాల్సిందిగా కోరుతున్నారు. బర్డ్‌ఫ్లూ వ్యాధి ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడి వలస వచ్చే పక్షుల ద్వారా వ్యాపిస్తున్నట్లుగా చెబుతున్నారు.

ఇదిలా ఉండగా 2015 నుంచి ప్రతి సీజన్‌లోనూ మన దేశంలో ఏదో ఒక మూల బర్డ్‌ఫ్లూ జాడలు కన్పిస్తున్నాయి. వలస పక్షులు, అటవీ పక్షుల్లో మాత్రమే ఇప్పటి వరకు బర్డ్‌ఫ్లూ వైరస్‌జాడను గుర్తించారు. కేవలం కేరళ, హర్యానా రాష్ట్రాల్లో మాత్రమే ఫౌల్ట్రీల్లో మృతిచెందిన పక్షుల్లో కూడా ఉందని చెబుతున్నారు.

కాగా బర్డ్‌ఫ్లూ వార్తల నేపథ్యంలో చికెన్, గుడ్లు అమ్మకాలపై దాని ప్రభావం పడినట్లుగా మార్కెట్‌వర్గాలు చెబుతున్నాయి. అమ్మకాలు మందగించాయని వివరిస్తున్నారు. కానీ మన దేశంలో ఆహార పదార్ధాలను పూర్తిగా ఉడికించిన తరువాత మాత్రమే తింటారు. ఈ విధానంలో వంట చేయడం వల్ల బర్డ్‌ఫ్లూ గురించి ఏ మాత్రం అందోళన చెందాల్సిన అవసరం లేదంటున్నారు.