Idream media
Idream media
ప్రభుత్వంపై ప్రతిపక్ష పార్టీల నేతలు విమర్శలు చేస్తుంటారు. అయితే ఆయా విమర్శల్లో వాస్తవం ఉందా..? అనే అంశం కన్నా.. అసలు ఆ విమర్శలు చేసే అర్హత ఆయా రాజకీయ నేతలకు ఉందా..? అనేది చూడాలి. రైతులకు పంట బీమా సొమ్మును విడుదల చేసిన సందర్భంగా వ్యవసాయ శాఖ మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వైసీపీ ప్రభుత్వం పై విమర్శలు చేయడంతో ఈ విషయంపై మాట్లాడుకోవాల్సి వస్తోంది.
తుఫాన్ల వల్ల 37 లక్షల ఎకరాల్లో పంట నష్టపోతే.. పంట బీమా ఇస్తున్నది 15.15 లక్షల రైతులకేనంటూ సోమిరెడ్డి మండిపడ్డారు. రైతులను దగా చేసి కప్పిపుచ్చుకోవడానికే ప్రకటనలు ఇస్తున్నారంటూ సోమిరెడ్డి చెప్పుకొచ్చారు. ప్రభుత్వం ఇచ్చే ప్రకటనల్లో అన్నీ అబద్ధాలేనంటూ ఆరోపిస్తున్నారు. బూటకపు లెక్కలు చెబుతూ ప్రజలను పక్కదారి పట్టిస్తున్నారంటూ ప్రభుత్వంపై విమర్శలు ఎక్కుపెట్టారు సోమిరెడ్డి.
ఇలాంటి విమర్శలు చేసే అర్హత టీడీపీ నేత, గత ప్రభుత్వ హయాంలో వ్యవసాయ శాఖ మంత్రిగా పని చే సిన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి ఉందా..? అనే విషయం గురించి మాట్లాడే ముందు.. అసలు ఆయన చేసిన విమర్శల్లో పస ఉందా..? అనేది తెలుసుకోవాలి. 37 లక్షల ఎకరాల్లో పంట దెబ్బ తింటే.. 15.15 లక్షల రైతులకే పరిహారం ఇస్తున్నారంటున్నారు. అంటే సోమిరెడ్డి లెక్క ప్రకారం ఒక రైతుకు ఒక ఎకరా మాత్రమే ఉంటుందనుకోవాలా..? ఒక రైతుకు ఒక ఎకరా పొలం కన్నా.. ఎక్కువ ఉండదా..? పది ఎకరాల పొలం ఉన్న ప్రతి రైతులకు ప్రభుత్వం పథకాలను వర్తింపజేస్తోందన్న విషయం సోమిరెడ్డికి తెలియదనుకోవాలి. లాజిక్ లేకుండా విమర్శలు చేసిన సోమిరెడ్డి.. తన తెలివితేటలను బయటపెట్టుకున్నారు.
Also Read : టీడీపీ కి తలవంపులు, వారి శవరాజకీయాలకు షాక్ ఇచ్చిన డాక్టర్ సుధాకర్ కుటుంబం
ఇక అర్హత గురించి చూస్తే.. రైతులను దగా చేశారు.. అబద్ధాలు చెబుతున్నారు.. బూటకపు లెక్కలు చెబుతున్నారని కూడా సోమిరెడ్డి విమర్శలు చేశారు. రైతులను ఎవరు దగా చేశారు..? ఎలా చేశారో.. 2014 ఎన్నికల్లో 87,670 కోట్ల రూపాయల రైతు రుణాలను, బంగారు రుణాలను భేషరతుగా మాఫీ చేస్తామని చెప్పి.. చేయకుండా.. కోటయ్య కమిటీ వేసి.. ఆ రుణాలను 24 వేలకు కుదించి.. అవీ కూడా ఐదు దఫాలుగా ఇస్తామని చెప్పి.. చివరకు మూడు దశల్లో ఐదేళ్ల కాలంలో 12 వేల కోట్ల రూపాయలు ఇచ్చారు. ఆ డబ్బు వడ్డీకి కూడా సరిపోలేదు. చివరి రెండు దఫాలు వైసీపీ ప్రభుత్వం చెల్లించాలనే చారిత్రాత్మక, హాస్యాస్పదమైన డిమాండ్‌ను టీడీపీ నేతలు చేశారు.
టీడీపీ ప్రభుత్వం చేసిన దగా వల్ల.. బ్యాంకుల ముందు రైతులు తప్పు చేసిన వారిలా నిలబడ్డారు. వ్యవసాయం చేసి అప్పులపాలైనా.. ఉన్నదమ్మి అప్పులు కట్టి ఆత్మగౌరవంతో బతకడం, అప్పులు తీర్చలేకపోతే.. ప్రాణాలు సైతం తీసుకునే అన్నదాతలను బ్యాంకుల నుంచి నోటీసులు వచ్చే పరిస్థితి.. చంద్రబాబు ఇచ్చిన రైతు రుణామాఫీ హామీ అమలు చేయకపోవడం వల్ల ఏర్పడిందన్న విషయం సోమిరెడ్డి మరిచిపోయారేమో గానీ రైతులు మాత్రం ఇంకా మరచిపోలేదు. రైతును దగా చేసిన ఫలితం ఎలాంటిదో 2019 ఎన్నికల ఫలితాల్లో చూశాం.
మరి రైతులను ఇలా దగా చేసిన చంద్రబాబు ప్రభుత్వం.. వ్యవసాయ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి.. వైసీపీ సర్కార్ పథకాలను, రైతుల కోసం చేస్తున్న సంక్షేమ పథకాలను విమర్శించే అర్హత ఉందా..? అనేది వారే ఒక సారి ప్రశ్నించుకోవాలి. చేసిన పని చెప్పుకోవడానికి.. ఆ పనిలో నిజాయతీ ఉండాలి.. అది ఉంది కాబట్టే.. జగన్ సర్కార్.. రైతుల కోసం తాము చేస్తున్న పథకాలను, పనులను రాతపూర్వకంగా పత్రికల్లో ప్రకటనల ద్వారా తెలియజేస్తోంది. అందులో ఏమైనా అవాస్తవాలు, బూటకపు లెక్కలు ఉంటే.. నిరూపించేలా.. వాస్తవ గణాంకాలతో మాట్లాడాలి. మరి సోమిరెడ్డి వాస్తవ గణాంకాలను ప్రజల ముందు పెట్టగలరా..? కనీసం తాము ఇచ్చిన రైతు రుణామాఫీ హామీ.. దాని అమలుపై గణాంకాలనైనా చెప్పగలరా..? ఈ ఒక్క విషయం చెబితే.. రైతులను ఎవరు దగా చేశారు..? ఎవరు దగా పడ్డారో తెలుస్తుంది.
Also Read : రాజకీయంతో కాదు మనస్సుతో చూడిండి చినబాబు..!