రాష్ట్ర అసెంబ్లీలో రాజాధాని మార్పునకు ఉద్దేశించిన “ఆంధ్రపరదేశ్ పరిపాలనా వికేంధ్రీకరణ, సమతుల అభివృద్ధి బిల్లు” ని సోమవారం ఆమోదించడం, వెంటనే దానిని శాసనమండలి ఆమోదానికి పంపడం చక చకా జరిగిపోయింది. అసెంబ్లీలో తెలుగుదేశం పార్టీ ఈ బిల్లుని తీవ్రంగా వ్యతిరేకించినప్పటికీ, అసెంబ్లీలో వైసిపికి మంచి మెజారిటీ ఉండడంతో బిల్లు ఆమోదానికి ఎటువంటి ఇబ్బంది ఎదురుకాలేదు.
అయితే ఆ బిల్లుని శాసన మండలి ఆమోదానికి పంపడంతో, స్వతహాగా ఆ బిల్లుని వ్యతిరేకిస్తున్న తెలుగుదేశం పార్టీకి శాసన మండలిలో ఆధిక్యత ఉండడంతో ఈ పరిపాలన వికేంధ్రీకరణ బిల్లుని మండలిలో ఎలాగైనా అడ్డుకోవాలని పట్టుదలతో ఉంది. నిన్నటి నుండి బిల్లు చర్చకి రాకుండా రూల్ 71 అస్త్రాన్ని ఉపయోగించడం, అదే సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ మండలిలో బిల్లు పై చర్చకు అనుమతించాల్సిందేనని అధికార పక్షం పట్టుపట్టడంతో శాసన మండలిలో తీవ్ర గందరగోళం నెలకొన్న సంగతి తెలిసిందే. ఒక దశలో రాష్ట్ర పరభుత్వం మండలిని రద్దు చేసే యోచనలో ఉన్నట్టు కూడా వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో గత రాత్రి మండలి వాయిదా పడడం వంటి పరిణామాలలో ఈ ఉదయం నుండి మండలిలో ఈరోజు ఏమి జరగబోతుందోనన్న ఉత్కంఠ రాజకీయ వర్గాల్లో నెలకొంది.
ఉదయం శాసనమండలి ప్రారంభమయిన వెంటనే అసెంబ్లీ ఆమోదించిన బిల్లుని సెలెక్షన్ కమిటీ కి సిఫార్స్ చెయ్యాలని, రూల్-71 పై పార్టీ విప్ ని ధిక్కరించిన పోతుల సునీత, శివ నాధ రెడ్డి పై అనర్హత వేటు వెయ్యాలని డిమాండు చేస్తూ మండలిలో విపక్ష పార్టీ తెలుగుదేశం ఆందోళన మొదలు పెట్టింది.
ఈరోజు ఉదయం సాంకేతిక కారణాల వల్ల కొద్దిసేపు ఆంధ్రప్రదేశ్ శాసన మండలి సమావేశాలు లైవ్ ప్రసారం కాలేదు. ఈ విషయంపై ప్రభుత్వం కూడా అధికారికంగా ప్రకటన చేసింది. అయితే మండలిలో జరుగుతున్న ప్రొసీడింగ్స్ తాలూకు ప్రత్యక్ష ప్రసారాలని హౌస్ లోపల ఉన్న టివి స్క్రీన్ లోను, మండలి చైర్మన్, అధికార, విపక్ష నేతల చాంబర్లలో ఉన్న టివి స్క్రీన్ లతో పాటు మండలి లాబీల్లో ఉన్న ఒకటి రెండు టివి స్క్రీన్ల లో మాత్రమే చూడగలం. నిన్న సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి ఈ సమస్య నెలకొంది. సమస్యను పరిష్కరించేందుకు ఆదేశాలు జారీ చేశామని మంత్రి బొత్సా సత్యనారాయణ కూడా ప్రకటించారు.
ఇక్కడే తెలుగుదేశం పార్టీ ఒక డ్రామాకి తెర తీసింది. మండలి లాబీల్లో ప్రతిపక్ష నేత చాంబర్ లో ఉన్న టివి స్క్రీన్ నుండి సెల్ ఫోన్ ద్వారా అజ్ఞాత వ్యక్తులెవరో వీడియో తీస్తూ, ఆ వీడియోని ఫెస్ బుక్ లైవ్ ద్వారా తెలుగుదేశం అధికారిక ఫేస్ బుక్ పేజీతో పాటు ఆంధ్రజ్యోతి ABN ఛానెల్ లో ప్రత్యక్ష ప్రసారాన్ని షేర్ చెయ్యడం మొదలుపెట్టారు. అయితే ఎలాంటి అధికారిక అనుమతులు లేకుండా చట్ట సభల ప్రాంగణం నుంచి ఇలా అజ్ఞాత వ్యక్తులు సెల్ ఫోన్ ద్వారా ప్రసారాలను అక్రమంగా బయటకి షేర్ చెయ్యడం ఎంత వరకు సబబు అనే మౌలిక ప్రశ్న ఇక్కడ ఉత్పన్నమౌతుంది.
అధికారికంగా శాసనసభ వ్యవహారాలకు సంబంధించి నియమాలను అతిక్రమించకుండా కొన్ని పద్ధతులు, కఠినమైన నిబంధనలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఏది ఏమైనా చట్టసభలకు ఉన్న గౌరవమర్యాదలను దృష్టిలో ఉంచుకొని ఇలా అనుమతి లేకుండా సభా వ్యవహారాలను అక్రమంగా పార్టీ అధికారిక వెబ్సైట్లలో ప్రసారం చెయ్యడం పై సమగ్ర విచారణ జరగవలసి వుంది. ఒకవేళ విచారణలో సదరు వ్యక్తులు ఎవరైనా నిబంధనలు ఉల్లంఘించినట్లు ఋజువైతే అటువంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకొని, ఇకపై ఇటువంటి దుశ్చర్యకు ఎవరు పాల్పడకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.