Idream media
Idream media
నా హత్యకు కుట్ర.. రెక్కీ కూడా నిర్వహించారు.. అంటూ వంగవీటి రాధా ఇటీవల ఓ స్టేట్ మెంట్ ఇచ్చారు. వెంటనే స్పందించిన ప్రభుత్వం గన్ మెన్లను పంపింది. రాధా వెనక్కి పంపారు. అది ఆయన వ్యక్తిగతం. కానీ.. రాధా ఆ స్టేట్ మెంట్ ఇచ్చినప్పటి నుంచీ టీడీపీ పెద్దలు మాత్రం తెగ కంగారు పడుతున్నారు. వంగవీటి రంగా హత్య వెనుక చంద్రబాబు హస్తం ఉందంటూ.. మొదటి నుంచీ ఆరోపణలు వస్తూనే ఉన్నాయి. తాజాగా మంత్రి బాలినేని మరోసారి ఆ విషయాన్ని తెరపైకి తెచ్చారు. అలాంటి చంద్రబాబు ఇప్పుడు.. రాధాపై ప్రేమ కురిపించడం, డీజీపీకి లేఖ రాయడం, ఆయనతో పాటూ పలువురు టీడీపీ నేతలు తందానా అందుకోవడం చూస్తుంటే.. కేవలం జగన్ ను, ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే రాజకీయాలు తప్పా.. టీడీపీ ప్రజా రాజకీయాలను మరచిపోయిందా అనే అనుమానాలు కలగకమానవు.
ఆ లింక్ బుద్దా వెంకన్నకు తెలుసా..?
రాధా పై కుట్ర గురించి ముందే తెలుసు అన్నట్లుగా తెలుగుదేశం పార్టీ నేత బుద్దా వెంకన్న మాటలు ఉన్నాయి. ‘‘బెజవాడలో మళ్లీ పాత రోజులు పునరావృతమయ్యేలా కనిపిస్తున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు ఇల్లు, టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడికి పాల్పడ్డ రోజే వంగవీటి రాధా ఇంటి వద్ద రెక్కీ నిర్వహించారు. ఈ ఘటనలన్నింటికీ ఏదో లింక్ ఉంది’’ అంటూ వెంకన్న పేర్కొంటున్నారు. ఈ విషయం అప్పుడే తెలిస్తే.. ఇన్నాళ్లూ ఎందుకు బయటపడలేదో.. ఆయనకే తెలియాలి. ‘‘ఎవరి జోలికీ వెళ్లని వ్యక్తి వంగవీటి రాధా. ఆయనపై రెక్కీ నిర్వహించడం దారుణం. ఇది మామూలు విషయం కాదు. దీని వెనుక వైసీపీ పెద్దల హస్తం ఉంది. నిజాలు బయటకు రావాలంటే ఏకంగా కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణ జరిపించాలి.’’ అని కూడా డిమాండ్ చేశారు.
రంగంలోకి చంద్రబాబు..
రెండేళ్లుగా డీజీపీ కి లేఖలు రాయడమే పనిగా పెట్టుకున్న చంద్రబాబు మరో లేఖ రాశారు. వంగవీటి రాధాకృష్ణ హత్యకు రెక్కీ నిర్వహించిన ఘటనపై నిష్పక్షపాత విచారణ జరపాలని కోరారు. ఎవరి ప్రభావమూ లేకుండా త్వరగా ఈ విచారణ జరిగితేనే అసలు నిందితులు బయటకు వస్తారన్నారు. అలాంటి వారికి కఠిన శిక్షలు పడితేనే ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయని పేర్కొన్నారు. ఇంత వరకూ బాగానే ఉంది కానీ.. ఆ తర్వాత ఏకంగా రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి దిగజారిపోతోందని, రాష్ట్రంలో ఆటవిక, గూండా రాజ్యం వేళ్లూనుకుందని, రాధాకు ఏదైనా హాని జరిగితే దానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని.. ఇలా పెద్ద పెద్ద వ్యాఖ్యలను కూడా రాసేశారు. ‘‘గన్‌మెన్లను తిరస్కరించడం సరికాదు. కుట్ర రాజకీయాలకు వ్యతిరేకంగా పోరాటం చేద్దాం’’ అంటూ రాధాకు ఫోన్ కూడా చేశారు.
చినరాజప్ప లాజిక్కులు..
వంగవీటి రాధాపై రెక్కీ వ్యవహారంలో టీడీపీ సీనియర్ నేత చినరాజప్ప కూడా సీరియస్‌గా స్పందించారు. ఆయన రాధాను వైసీపీలో చేర్చేశారు. ‘రాధాను పార్టీలో చేర్చుకోవడం కాదు.. రెక్కీ నిర్వహించిన.. కుట్ర పన్నిన వైసీపీ నేతలపై చర్యలు తీసుకోవాలి’ అని డిమాండ్ చేశారు. అంతేకాదు.. రాధాను హత్య చేసి.. దాన్ని రాజకీయంగా వాడుకోవాలని జగన్ కుట్ర చేస్తున్నారంటూ సంచలన ఆరోపణలు కూడా చేశారు. ఇప్పటికైనా జగన్ కుల రాజకీయాలు, కుట్ర రాజకీయాలు మానుకోవాలని హితవుపలికారు చినరాజప్ప. హోం మంత్రిగా ఉన్న సమయంలో కూడా అస్సలు నోరుమెదపని చినరాజప్ప.. లోకేశ్ ఓడిపోయినా.. తాను ఎమ్మెల్యేగా గెలవడంతో కొద్ది కాలంగా లాజిక్కులతో మరీ మాట్లాడేస్తున్నారు.
Also Read : చంద్రబాబుపై అచ్చెన్న సంచలన వ్యాఖ్యలు.. టీడీపీలో కలకలం