iDreamPost
android-app
ios-app

యనమల.. ఇక ఆ ఛాన్స్‌ లేదు..!

యనమల.. ఇక ఆ ఛాన్స్‌ లేదు..!

తిమ్మిని బమ్మిని చేయడంలో టీడీపీ నేతలు ఆరితేరారు. ఆ పార్టీకి ఉన్న మీడియా బలంతో తాము పంది అంటే పంది.. నంది అంటే నంది.. అనేలా ఏ విషయాన్నయినా ప్రజలపై నిన్నమొన్నటి వరకూ రుద్దారు. ఈ తరహా విధానాన్నే తాజాగా టీడీపీ, దాని అనుకూల మీడియా సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి.. సుప్రిం న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌వీ రమణ అమరావతిలో చేసిన భూ దందా, ఇతర అక్రమాలపై సుప్రిం ప్రధాన న్యాయమూర్తికి రాసిన లేఖపై కూడా ప్రయోగించాలని విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి తన లేఖలో ఎన్‌వీ రమణపై పేర్కొన్న అంశాలను పక్కదారి పట్టించేలా.. ఒక వ్యక్తిపై చేసిన అభియోగాలను మొత్తం వ్యవస్థకు ఆపాదించేలా టీడీపీ నేతలు, ఎల్లో మీడియా ప్రయత్నాలు ముమ్మరం చేసింది.

ఎన్‌వీ రమణపై ఫిర్యాదు చేస్తూ సుప్రిం ప్రధాన న్యాయమూర్తికి సీఎం జగన్‌ లేఖ రాశాడనే విషయాన్ని కనీసం సింగల్‌ కాలంలో కూడా ప్రచురించని టీడీపీ అనుకూల మీడియా.. ఆ మరుసటి రోజు నుంచి ఆ లేఖలోని అంశాలను పక్కదారి పట్టించేందుకు కథనాలు వండివారుస్తోంది. న్యాయకోవిదులతో ప్రత్యేక ఇంటర్వ్యూలు చేస్తోంది. ఎల్లో మీడియాకు సమాంతరంగా మరో వైపు టీడీపీ నేతలు మొదటి రోజు మౌనంగా ఉండి ఆ తర్వాత నోరు విప్పారు. జగన్‌ రాసి లేఖలోని అంశాలను న్యాయవ్యవస్థకు ఆపాదించేందుకు మైకులందుకుంటున్నారు.

ఈ రోజు శుక్రవారం టీడీపీ సీనియర్‌ నేత, ఆ పార్టీ నేతలు మేధావిగా భావించే యనమల రామకృష్ణుడు మీడియా ముందుకు వచ్చారు. సీఎం జగన్‌ రాసిన లేఖపై విమర్శలు, విసుర్లు విసిరారు. న్యాయవ్యవస్థపై పగపట్టిన పాలకుడిని ఇప్పుడే చూస్తున్నామంటూ వ్యాఖ్యానించారు. ఇంత విధ్వంస మనస్తత్వం ఉన్న వారు పరిపాలనకు తగరని సెలవిచ్చారు. జగన్‌రెడ్డి బెదిరింపులు తారా స్థాయికి చేరాయని మండిపడ్డారు. న్యాయవ్యవస్థను బెదిరించే స్థాయికి జగన్‌ చేరడం.. బరితెగింపు రాజకీయాలకు పరాకాష్ట అని విమర్శించారు. ఈ పెడధోరణలను ఇలాగే వదిలేస్తే రేపు ఎంతకైనా తెగిస్తారంటూ భవిష్యవాణి వినిపించే ప్రయత్నం చేశారు.

యనమల చేసిన వ్యాఖ్యలతోనే టీడీపీ నేతల లక్ష్యం ఏమిటో అర్థం అవుతోంది.

సుప్రిం న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌వీ రమణ అక్రమాలకు, అవినీతికి పాల్పడ్డారని సీఎం జగన్‌ ఫిర్యాదు చేస్తే.. న్యాయవ్యవస్థపై దాడి అంటూ టీడీపీ నేతలు గగ్గొలు పెడుతున్న విషయాన్ని ఇప్పటికే ప్రజలు గమనించారు. అందుకే అసలు విషయాన్ని పక్కదారి పట్టించాలని టీడీపీ, ఎల్లో మీడియా చేస్తున్న ప్రయత్నాలు సఫలం కావడం లేదు. జాతీయ మీడియాతో పాటు సోషల్‌ మీడియా అసలు భాగోతాన్ని ప్రజల ముందు ఉంచుతోంది. పైగా టీడీపీ,ఎల్లో మీడియా చేస్తున్న డైవర్ట్‌ కార్యక్రమాన్ని ఎప్పటికప్పుడు సోషల్‌ మీడియా ధీటుగా తిప్పికొడుతోంది. సోషల్‌ మీడియా యుగంలో ఇకపై తిమ్మిని బమ్మిని చేసే అవకాశం టీడీపీ, దాని అనుకూల మీడియాకు లేవనే చెప్పాలి.