iDreamPost
iDreamPost
ఒక చారిత్రక అవసరం నుంచి ఆవిర్భవించిన తెలుగుదేశం తన నాలుగు దశాబ్దాల ప్రస్థానంలో ఎన్నడూ లేనంత పతనావస్థకు దిగజారిపోయింది. రాష్ట్రంలో నాడు నెలకొన్న రాజకీయ అస్థిరత, ఆరునెలలకో ముఖ్యమంత్రి మారిపోవడం, రాష్ట్రాలపై ఢిల్లీ పెత్తనం, ప్రజా సమస్యలను పట్టించుకునేవారు
లేకపోవడం వంటి పరిస్థితులు నందమూరి తారకరామారావును తెలుగుదేశం పేరుతో ప్రాంతీయ పార్టీ ఏర్పాటుకు పురిగొల్పాయి. ఆంధ్రుల అభిమాన నటుడిగా ఆయనకున్న చరిష్మా, రాజకీయ శూన్యత ఆ పార్టీని అందలమెక్కిస్తే.. సిద్ధాంతాలకు నీళ్లొదలడం, అవకాశవాద రాజకీయాలు నేడు అదే పార్టీని అవశాన దశకు చేర్చాయి.
ఢిల్లీ పెత్తనంపై తిరుగుబాటు
1982 వరకు రాష్ట్రంలో కాంగ్రెసుదే రాజకీయ పెత్తనం. దాన్ని ఎదిరించి నిలబడే మరో బలమైన పార్టీ లేని పరిస్థితుల్లో రాష్ట్రంలో ఆ పార్టీ ప్రభుత్వాలపై పార్టీ ఢిల్లీ పెద్దలు స్వారీ చేయడం ప్రారంభించారు. రకరకాల కారణాలతో ఆరు నెలలకి, సంవత్సరానికి ముఖ్యమంత్రులను టోలుబొమ్మల్లా మార్చేసేవారు. దీంతో సీఎం కుర్చీలో కూర్చున్నవారు ఢిల్లీ ప్రభువులను సంతృప్తి పరచడం, కుర్చీని కాపాడుకోవడంలో మ్యూనిడితేలుతూ పాలనను గాలికొదిలేయడంతో ప్రజల్లో తీవ్ర అశాంతి, అసంతృప్తి గూడుకట్టుకున్నాయి. అప్పటికే సినీదేవుడిగా లక్షలాది తెలుగు ప్రజల గుండెల్లో కొలువైన ఎన్టీ రామారావును ఆంధ్ర సమాజంలో నెలకొన్న పరిస్థితులు చలింపజేశాయి. దశాబ్దాలుగా తనను ఆదరిస్తున్న ప్రజల కోసం ఏదైనా చేయాలన్న ఆలోచన రేకెత్తించాయి. ఆయన ఆలోచనలకు, ఆశయాలకు ప్రతిరూపమే తెలుగుదేశం. ఢిల్లీ పెత్తనం పై తిరుగుబాటు ప్రకటించారు. తెలుగువారి పౌరుషాగ్ని రగిలించారు. చైతన్యరథంపై ఊరూరా నిర్విరామంగా తిరిగి ప్రజల కష్టాలు తెలుసుకున్నారు. కాంగ్రెస్ కు ఘోరీ కట్టాలని పిలుపునిచ్చారు. ప్రజలు ఆయన్ను విశ్వసించారు. ఓట్ల వర్షం కురిపించారు. ఫలితంగా పార్టీ పెట్టిన 9 నెలల్లోనే అధికారంలోకి వచ్చి రికార్డు సృష్టించింది. 1983 జనవరిలో రాష్ట్రంలో తొలి కాంగ్రెసేతర ప్రభుత్వం ఏర్పడింది. ఎన్టీఆర్ రాష్ట్రానికి పదో ముఖ్యమంత్రి అయ్యారు.
విప్లవాత్మక పథకాలు
రైతులు, బీసీలు, మధ్యతరగతి ప్రజల సంక్షేమాన్ని కాంక్షిస్తూ ఎన్టీఆర్ ఎన్నో విప్లవాత్మక పథకాలు ప్రారంభించారు. పాలనలోనూ సంస్కరణలకు పెద్దపీట వేశారు. కరణాలు, మునసబు వ్యవస్థ రద్దు, మాండలిక వ్యవస్థ ఏర్పాటు, లోకాయుక్త వ్యవస్థ, సంపూర్ణ మద్యనిషేధం, ఆస్తిలో మహిళలకు సమాన హక్కు, మెడికల్ ఇంజినీరింగ్ ప్రవేశాలకు కాపీటేషన్ ఫీజు రద్దు చేసి ఎంట్రన్స్ పరీక్ష విధానం ప్రవేశపెట్టారు. పేదలకు రెండు రూపాయలకే కిలో బియ్యం, జనతా హోటళ్లు, పేదలకు ఒక బల్బుకు ఉచిత విద్యుత్, పూరి గుడిసెల స్థానంలో పక్క ఇళ్లు, తదితర సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారు. విద్యా వ్యవస్థలో మార్పులు చేస్తూ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం, ఉచిత రెసిడెన్షియల్ విద్య అమల్లోకి తెచ్చారు. ఆరోగ్య, మహిళ, వ్యవసాయ విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేశారు. తెలుగుగంగ వంటి భారీ నీటిపారుదల ప్రాజెక్టులు నిర్మించారు.
నాదెండ్ల, నారా వెన్నుపోట్లు
ప్రజారంజక పాలకుడిగా పేరొందిన నందమూరి రెండు వెన్నుపోట్లకు గురయ్యారు. టీడీపీ తొలిసారి అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నరకే 1984 ఆగస్టులో అప్పటి ఆర్థిక మంత్రి నాదెండ్ల భాస్కరరావు కాంగ్రెస్ సహకారంతో ఎన్టీఆర్ ను పడవీచ్యుతుడిని చేసి సీఎం అయ్యారు. దాంతో ఎన్టీఆర్ కాంగ్రెసేతర పార్టీలతో కలిసి ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమం చేపట్టి నెల రోజుల్లోనే మళ్లీ అధికారంలోకి వచ్చారు. 1989 ఎన్నికల్లో ఓటమి ఎదుర్కొన్నా.. నేలకు కొట్టిన బంతిలా మళ్లీ 1994లో 220 సీట్ల అఖండ మెజార్టీతో మళ్లీ అధికారంలోకి వచ్చారు. అయితే ఏడాది తిరగకుండానే చంద్రబాబు రూపంలో మరో వెన్నుపోటు ఎదుర్కొన్నారు. లక్ష్మీపార్వతి ఎన్టీఆర్ జీవితంలోకి, టీడీపీలోకి రావడాన్ని జీర్ణించుకోలేని అప్పటి రెవిన్యూ మంత్రి చంద్రబాబు నాయుడు వైస్రాయ్ హోటల్ వేదికగా 1995లో అధికార మార్పిడి కుట్రకు తెర లేపారు. నందమూరి కుటుంబం సభ్యుల అండతో మెజార్టీ ఎమ్మెల్యేలను తన వైపు తిప్పుకుని ఎన్టీఆర్ ను టీడీపీ అధ్యక్ష పదవి నుంచి, సీఎం పీఠం నుంచి దించేశారు. అల్లుడి చేతిలో వెన్నుపోటుకు గురైన మనోవేదనతోనే ఎన్టీ 1996 జనవరి 18న తుది శ్వాస విడిచారు.
అదే టీడీపీ పతనానికి తొలిమెట్టు
ఎన్టీఆర్ మరణం, చంద్రబాబు అవకాశవాద రాజకీయాలు తెలుగుదేశం ప్రభను మసకబార్చాయి. 1995లో పార్టీ అధ్యక్ష పదవిని, సీఎం పీఠాన్ని చేజిక్కించుకున్న చంద్రబాబు సొంత ఇమేజ్ లేక ఇతర పార్టీలపై ఆధారపడటం ప్రారంభించారు. ఎన్టీఆర్ చేపట్టిన పలు పథకాలకు తిలోదాకాలిచారు. ఒక్కో ఎన్నికల్లో ఒక్కో పార్టీతో జతకట్టడం ప్రారంభించారు. ఈ పరిణామాలతో విలువలున్న నేతలు ఒక్కొక్కరిగా పార్టీని విడిపోయారు. 2004, 2009 ఎన్నికల్లో వైఎస్ ప్రభంజనం, ఆ తర్వాత తెలంగాణ ఉద్యమం టీడీపీని కుంగదీశాయి. సమైక్యాంధ్ర ఉద్యమ సమయంలో టీడీపీ అధినేతగా చంద్రబాబు అనుసరించిన రెండు కళ్ళ సిద్ధాంతం ఆంధ్రప్రదేశ్ ను రెండు ముక్కలు చేసేందుకు దోహదపడ్డాయి. అదే సమయంలో ఆవిర్భవించిన వైఎస్సార్సీపీ జోరుతో 2014 ఎన్నికల్లో ఎన్డీఏ తో జతకట్టి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు రాజధాని పేరిట చేసిన భూకుంభకోణాలు, జన్మభూమి కమిటీల ఆగడాలు, జగన్ ప్రజా సంకల్పయాత్ర అన్నీ కలిసి తెలుగుదేశానికి తొలిసారి ఘోర పరాజయం రుచి చూపించాయి. 23 సీట్లనే దక్కించుకున్న ఆ పార్టీకి ఇటీవలి పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లోనూ చావుదెబ్బ తగిలింది. ఫలితంగా 40వ పడిలో అడుగిడుతున్న తరుణంలో పతనం అంచుకు చేరింది.