సంక్రాంతి తెలుగు సినిమాల హడావిడిలో హిందీ సినిమా “తనహాజీ”ని పెద్దగా పట్టించుకోలేదు మనవాళ్లు. అజయ్ దేవగన్ ఒక నిర్మాతగా ఉన్న ఈ సినిమా సంక్రాంతి టైములోనే వచ్చి దుమ్ము దులిపేస్తోంది. బాలీవుడ్డులో ఇది హిట్టు.
మొన్నీమధ్యనే “మణికర్ణిక”, “సై రా” చూసిన కళ్లకు ఈ “తనహాజీ” కూడా కంటెంట్ పరంగా పెద్ద తేడా ఏమీ ఉండదని ట్రైలర్లో తెలిసింది. ఆ సినిమాల్లో బ్రిటీష్ వారి మీద పోరాటమైతే, ఈ “తనహాజీ” లో శివాజీ వర్గానికి మొగల్ వర్గంతో పోరాటం. అలా చూసుకున్నా “పద్మావత్”, “బాజిరావు మస్తాని” సినిమాలు హిందూ రాజులు- ముస్లిం యోధుల మధ్య గొడవలతో తెరమీద భీభత్సం సృష్టించాయి.
అన్నింటిలోనూ కామన్ పాయింట్ ఏమిటంటే…
– హీరో గారి ఫ్యామిలీ సెంటిమెంటు
– హీరో వర్గంలో ఒకడు విలన్లతో కలిసి వెన్నుపోటు పొడవడం
– హీరో గారు ఫైనల్గా పోరాడి వీరమరణం చెందడం.
ఈ లెక్కన ఇప్పుడు కొత్తగా “తనహాజీ” ఏమంత కలెక్షన్స్ రాబెడుతుంది? అని కొదరు అనుకున్నారు. కానీ అంచనాలకు భిన్నంగా సాగుతోంది బిజినెస్.
అజయ్ దేవగన్ ఈ సినిమాకి నిర్మాతల్లో ఒకడు. భార్య కాజోల్ హీరోయిన్నుగా కనపడింది. అంటే ఫ్యామిలీ ప్యాకేజ్ అని అర్థం అవుతూనే ఉంది. ప్రతినాయకుడి పాత్రలో సయిఫ్ ఆలీ ఖాన్ తప్ప ఇతర పాత్రలేవీ భారీ క్యాస్టింగ్ కాదు. కానీ మేకింగులో ఎక్కడా రాజీ పడలేదు. అతి పోకడలు, సమంజసంగా అనిపించని గ్రాఫిక్ స్టంట్స్ అక్కడక్కడా ఉన్నా ఎమోషనల్గా ఈ సినిమా ప్రేక్షకుల్ని కట్టిపారేసింది.
పైన చెప్పుకున్నట్టు ఈ కథలో కొత్తదనం ఏమీ లేదు. కానీ సెయిఫ్ ఆలి ఖాన్ నెగటివ్ పాత్ర పోషించడం హిందీ ఆడియన్స్ కి ప్రధాన ఆకర్షణ అయ్యింది. పద్మావత్ లో రణ్వీర్ పాత్రమాదిరిగా చాలా క్రూయెల్ గా చూపించే ప్రయత్నం చేసారు ఈ పాత్రని.
మొత్తానికి బాక్సీఫీసు వద్ద కాసులు పండిస్తూ దూసుకుపోతోంది ఈ సినిమా. రెండో వారాంతంలో కూడా హైద్రాబాద్ మల్టీప్లెక్సుల్లో హౌస్ ఫుల్స్ నమోదు చేసుకుంది ఈ హిందీ చిత్రం.
భార్యాభర్తలైన కాజోల్-అజయ్ దేవగన్ లు భారీ డబ్బు మూటతో బయటపడ్డారన్నమాట.