iDreamPost
iDreamPost
(పవన్ కళ్యాణ్ ఎవర్ గ్రీన్ లవ్ స్టోరీ సుస్వాగతం గురించి అప్పట్లో థియేటర్లో చూసిన ఓ అభిమాని మనోగతం)
1998 జనవరి 1 …..
ఇంటర్ మీడియట్ సెకండ్ ఇయర్ వెలగబెడుతున్న రోజులు. ఇష్టం లేని ఎంపిసి గ్రూప్ మీద పెద్దగా ఆసక్తి లేదు. అప్పటికే మెదడులో తిష్ట వేసుకుని కూర్చున్న సినిమా ప్రేమ పిచ్చిగా మారుతున్న కాలం. నాకు చిరంజీవి మీద అభిమానంలో షేర్ ఇతర హీరోలు ఎవరికీ ఇవ్వడం ఇష్టం ఉండేది కాదు. అయినా స్వంత తమ్ముడే కాబట్టి పర్లేదనుకుని పవన్ కళ్యాణ్ సినిమాలు కూడా ఫస్ట్ డే చూడాలని అంతకు ముందు సంవత్సరమే మా ఫ్రెండ్స్ బ్యాచ్ డిసైడ్ అయ్యాం. అప్పటికి చూసింది రెండు సినిమాలే. అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సోసోగా నచ్చింది. గోకులంలో సీత అంతగా ఎక్కలేదు. అందుకే మూడోది సుస్వాగతం మీద పెద్దగా అంచనాలు లేవు. కొత్త సంవత్సరం మొదటి రోజే వచ్చింది కాబట్టి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ హాలులోనే చేయాలని డిసైడ్ అయిపోయి ఉదయం 10 గంటలకే వెళ్లిపోయాం. బెనిఫిట్ షోలకు వెళ్లేంత పలుకుబడి, పర్సుతడి లేని వయసు కాబట్టి అటెండెన్స్ లేటుగానే ఇచ్చాం.
కర్నూలు జిల్లా ఆదోని. నిర్మల్ థియేటర్. దానికి చాలా చరిత్ర ఉందని నాన్న చెప్పేవారు. పార్కింగ్ కోసమే కాకుండా కనీసం ఓ ఐదు వందల మంది నిలబడేంత సువిశాలమైన గ్రౌండ్ గేటు లోపలికి అడుగుపెట్టగానే స్వాగతం చెప్పేది. మేము వెళ్ళే టైంకే జనంతో బాగా తొక్కిసలాటగా ఉంది. రెండు కౌంటర్ల దగ్గరా ఎగబడుతున్నారు. క్యు లేదు పాడూ లేదు . పెద్ద మందగా వాటి మీద పడుతున్నారు. ఆ కౌంటర్ పైన ఉండే బల్బు వెలిగితేనే టికెట్లిచ్చే వాడు వచ్చినట్టు లెక్క. ప్రాణాలతో పోరాడుతున్న పేషేంట్ కు ఆపరేషన్ జరుగుతున్నప్పుడు బయట నిలబడ్డవాళ్లకు ఎంత టెన్షన్ ఉంటుందో అంతకు రెట్టింపు కొట్టేసుకోవడం ఒక్కటే తక్కువ అనేలా ఉన్న అభిమానులకూ ఉంది.
మా బ్యాచ్ లో అంతో ఇంతో ఇలాంటి చోట్ల తన పలుకుబడి చూపించే బిల్డప్ రాజా గాడు ఏదోలా టికెట్లు పట్టుకొచ్చాడు. మనిషికి ఐదు రూపాయల కమీషన్ చొప్పున టికెట్ కు ఇరవై రూపాయల దక్షిణ సమర్పించుకుంటేనే ఎంట్రీ దొరికింది. ఇప్పట్లా డీసెంట్ గా పోవడం ఉండేది కాదు. పదండి ముందుకు పదండి తోసుకు పదండి పోదాం త్వరగా లోపలికి అంటూ శ్రీశ్రీ గారి స్ఫూర్తితో గ్రూప్ సాంగ్ వేసుకుని పొలోమని లోపలికి వెళ్ళిపోయాం. ఎంత లేట్ అయితే అంత సీట్లు మిస్సయ్యే రిస్క్ ఉంది కాబట్టి ఆ మాత్రం తోసుకోవడాలు తప్పవు.
విశాలమైన బాల్కనీ, కింద రెండు తరగతులు. సైడు గోడలపై తిరుగుతున్నాయా లేదాని వాటి కంపెనీ ఓనర్ కూడా చెప్పలేనంత వీక్ గా గాలి వీస్తున్న ఫ్యాన్లు. చైర్ల పట్ల అంత ధ్యాస ఉండేది కాదు. కూర్చోవడానికి ఉందా లేదా. ఇదొక్కటే చెక్ చేసుకోవడం అంతే. ఏదోలా అందరం ఒకే వరసలో కూలబడ్దాం. ఇంట్లో అప్పటికే ఓ యాభై సార్లు అరగదీసిన స్టార్ మ్యూజిక్ విడుదల చేసిన సుస్వాగతం ఆడియో క్యాసెట్లోని పాటలు గుర్తుకు వచ్చాయి. ఆ టైంలో మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎ రాజ్ కుమార్ ఫాం మాములుగా ఉండేది కాదు.
ఆఆఆఆఆఆఆఆ, లలలలలలలలలలలలలలా అంటూ మంచి ఎమోషనల్ హమ్మింగ్ తో అలా సెంటిమెంట్ సీన్లను మైండ్లో ప్రింట్ చేసేవాడు. ఇపుడు ఆ సాంగ్స్ ని స్క్రీన్ మీద చూడబోతున్నామన్న ఆనందం ఒకవైపు, దర్శకుడు భీమినేని ఎలాంటి స్టొరీలో పవన్ ని చూపిస్తాడో అనే ఉత్సుకత మరో వైపు ఇలా ఆలోచనల్లో ఉండగానే వెల్కమ్ అనే మసక స్లయిడ్ తో షో మొదలైంది. హౌస్ ప్యాక్ అయిపోయింది. అయినా జనం వస్తూనే ఉన్నారు. బయటవాడు టికెట్లు అమ్మడం ఆపడం లేదు. అదంతే. కిందకూర్చుని అయినా సరే ఫస్ట్ డే చూడాల్సిందే అని వచ్చే బ్యాచ్ భారిగా ఉండేవాళ్ళు
హీరో పేరు గణేష్. సంధ్య అనే అమ్మాయి చుట్టూ తిరుగుతూ ఆమె ప్రేమ కోసం తపించిపోయే క్యారెక్టర్. ఇంచుమించు మనలాగే. ఆమె చించి పారేసిన బస్సు టికెట్లు, విసిరేసిన వస్తువులు దాచుకుని మరీ ఆరాధిస్తూ ఉంటాడు . అబ్బో ప్రేమంటే ఇలా ఉంటుందన్న మాట. సో మనకు ఎవరన్న పోరీ పడితే ఇలా కలెక్షన్ ఏజెంట్ గా మారిపోయి దాచుకునే పని మొదలుపెట్టాలని ఫిక్స్ అయిపోయా. ప్రేమికుడులో ప్రభుదేవా చెప్పాడు కానీ స్కూల్ ఏజ్ లో లైట్ అనుకున్నాం. ఇప్పుడు మీసాలు మొలిచే కాలేజీ వయసు కాబట్టి సీరియస్ గా తీసుకోవాల్సిందే. సినిమాలో ఫ్రెండ్స్ అల్లరి బాగుంది. కథ ముందుకెళ్లే కొద్దీ సంధ్య మీద కోపం పెరుగుతోంది. ఎంతకీ ఒప్పుకోదే. ఎస్ అంటే గుండెల్లో పెట్టుకుంటాడు. అర్థం చేసుకోదు. ఈ గర్ల్స్ అంతా ఇంతేనేమో. గణేష్ మీద సింపతీ అంతకంతా పెరిగిపోతోంది. గణేష్ నాన్న ఎంత మంచివాడో. సినిమా ఫాదర్స్ అంతే గోల్డు. క్రైమ్ చేసినా కామెడీగా తీసుకుంటారు. మాకేమో చిన్న తప్పు చేసినా తుప్పు లేపుతారు. సినిమా అంతా ఒక ఫ్లోలో అలా వెళ్ళిపోతోంది.
ఇదంతా సరే కానీ అసలు మేమూహించని ఘట్టం వచ్చింది. క్లైమాక్స్ కు ముందు సంధ్య కోసం వేరే ఊరికి వెళ్లిన గణేష్ కు తెలిసే అవకాశం లేకుండా నాన్న చనిపోతాడు. స్నేహితులు ఎంత ప్రయత్నించినా వెంటనే పట్టుకోలేకపోతారు. బస్సుల మీద గోడలపైన పోస్టర్లు వేయిస్తారు. అయినా రెప్పపాటులో మిస్సవుతాడు. ఆఖరికి గణేష్ లేకుండానే అంత్యక్రియలు చేసే పరిస్థితి వస్తుంది. నాకేమో గొంతు ఎవరో నులిమినట్టు అనిపిస్తోంది. కళ్ళ వెంట తెలియకుండానే చెంపల వెంట ధారాళంగా నయాగరా ఫాల్స్ లా నీళ్ళు కారిపోతున్నాయి. ఎంత కంట్రోల్ చేసుకుందాం అనుకున్నా కావడం లేదు. అంత సెంటిమెంట్ తట్టుకోవడం నా వల్ల కావడం లేదు.
నేనొక్కడినే అనుకున్నా పక్కనే ఉన్న చందు, ప్రవీణ్ కళ్ళు కూడా మెయిన్ రోడ్ లో లీకైన మున్సిపాలిటీ వాటర్ పైప్ లా జలధారలు కురిపిస్తున్నాయి. గణేష్ పరిగెత్తుకుంటూ తిరిగి వచ్చి నాన్న బూడిదను మొహం మీద పూసుకుంటున్న సీన్లో ఇక మావల్ల కాలేదు. మూతికి కర్చీఫ్ అడ్డం పెట్టుకుని ఆడపిల్లల కన్నా ఘోరంగా ఏడవటం ఆ చీకట్లో ఎవరికీ కనిపించలేదు కానీ లేదంటే ఆమరుసటి రోజు పేపర్ లో మా ఫోటోలు వచ్చేవేమో సినిమా హాల్లో కుర్రాళ్ళ పెడబొబ్బలని. నిజంగా సినిమాలోని ఎమోషన్ ని మొదటిసారి సీరియస్ గా ఫీలైన సందర్భం అదే. ఆ తర్వాత సంధ్యని సముద్రం ఒడ్డున నిలబెట్టి గణేష్ చెప్పే డైలాగ్స్ కి కన్నీళ్ళు ఇంకిపోయి కొత్త జోష్ వచ్చేసింది. సంభాషణలు రాసిన చింతపల్లి రమణని మనసులో తలుచుకుని శెభాష్ బాసూ అనేశా.
షో అయ్యాక ఇంటికి సైకిల్ మీద వెళ్తున్నప్పుడు పదే పదే ‘ ఆలయన హారతిలో ఆఖరి చితి మంటలలో ‘ పాట పాడుకుంటూనే ఉన్నాను. సో మనం ప్రేమలో పడకూడదు. వద్దన్న అమ్మాయిలను అసలే పట్టించుకోకూడదు. కాదని వెంటపడితే ఎంత దారుణంగా ఉంటుందో అర్థమయ్యిందిగా. కాబట్టి ఒక మంత్రంలా సుస్వాగతంలోని చివరి పాటను బట్టి పట్టేసి రోజూ కాలేజీకి అదే పాడుకుంటూ వెళ్లాలని గట్టిగా నిశ్చయించుకున్నాను. మరుసటి రోజు లేవగానే గబగబా రెడీ అయిపోయి టిఫిన్ చేసేసి కాలేజీకి బయలుదేరుతుండగా వీధి మలుపులో మా కాలనీలో ఎప్పుడు చూడని ఓ కొత్త బ్యూటీ కనిపించింది. నిన్న చేసిన గణేష్ శపథం గుర్తుకురాలేదు. ఆలయాన హారతి, చితి మంటలు అన్నీ మర్చిపోయా. తననే చూస్తూ కనుచూపు మేర ఎక్కడ దాకా వెళ్లిందో అలా చూస్తూనే ఉండిపోయా. అప్పటికే మనసులో ఆటోమేటిక్ గా ఎస్ఎ రాజ్ కుమార్ పాట ప్లే అవుతోంది
“ఏ స్వప్నలోకాల సౌందర్యరాశి నాముందుకొచ్చింది కనువిందు చేసి, ఏ నీలి మేఘాల సౌధాలు విడిచి ఈ నేల నడిచింది ఆ మెరుపు వచ్చి”
వద్దనుకున్న గణేష్ మళ్ళీ వచ్చేశాడు. ప్రేమ గంటలు మ్రోగించేశాడు. ప్రేమ లేని జీవితానికి సుస్వాగతం అని చెప్పిన గణేష్ కొద్దినెలల్లోనే తొలిప్రేమలో పడమని చెప్పే బాలుగా వస్తాడని తెలియదుగా. దాని ముచ్చట్లు మరోసారి చెప్పుకుందాం . సెలవు …
Also Read : మాటేరాని చిన్నదాని ఎమోషన్ – Nostalgia