స్టీల్ ప్లాంట్ ఏళ్ల నాటి కల: సీఎం జగన్

జిల్లాలోని సున్నపురాళ్లపల్లెలో స్టీల్‌ప్లాంట్‌కు సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. అనంతరం కార్యక్రమంలో మాట్లాడిన ఆయన.. ఉక్కు పరిశ్రమకు శంకుస్థాపన చేయడం సంతోషంగా ఉందని.. తన జీవితంలో ఇది మరిచిపోలేని రోజని జగన్ వ్యాఖ్యానించారు. జిల్లాకు స్టీల్ ఫ్యాక్టరీ రావాలని ఎన్నో సంవత్సరాలుగా కలలు కన్నామని.. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ హయాంలో ముందడుగులు పడ్డాయని జగన్ ఈ సందర్భంగా గుర్తు చేశారు.

అధికారంలోకి వచ్చిన 6 నెలల్లో స్టీల్‌ప్లాంట్‌కు శంకుస్థాపన చేశామన్నారు. ఎన్నికలకు ఆరు నెలల ముందు చంద్రబాబు స్టీల్‌ప్లాంట్‌కు టెంకాయ కొట్టడం మోసం కాదా? అని ఈ సందర్భంగా  సీఎం వైఎస్ జగన్ ప్రశ్నించారు. గత ప్రభుత్వానికి.. ఈ ప్రభుత్వానికి పాలనలో తేడాకు ఇదే నిదర్శనమని వ్యాఖ్యానించారు.

రూ.15వేల కోట్లతో స్టీల్‌ప్లాంట్ నిర్మిస్తున్నట్లు ఆయన తెలిపారు. మూడేళ్లలో స్టీల్‌ప్లాంట్‌ నిర్మాణం పూర్తి చేస్తామని ఈ సందర్భంగా జగన్ స్పష్టం చేశారు. 30లక్షల టన్నుల సామర్థ్యంతో స్టీల్ ప్లాంట్ నిర్మించబోతున్నట్లు చెప్పారు. స్టీల్‌ప్లాంట్‌కు అవసరమైన ఐరన్‌ వోర్ కోసం ఎన్‌ఎండీసీతో ఒప్పందం చేసుకున్నామన్నారు. స్టీల్‌ప్లాంట్‌ ఏర్పాటుతో నిరుద్యోగులకు ఉపాధి లభిస్తుందని సీఎం తెలిపారు. ఉక్కు పరిశ్రమతో జిల్లా వాసుల బతుకులు మారిపోతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

Show comments