iDreamPost
android-app
ios-app

Somu Veerraju, PM Modi, YS Jagan – జగన్‌ వద్ద 9 రత్నాలే.. మోదీ వద్ద 90 రత్నాలున్నాయట..!

Somu Veerraju, PM Modi, YS Jagan – జగన్‌ వద్ద 9 రత్నాలే.. మోదీ వద్ద 90 రత్నాలున్నాయట..!

ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ప్రభావం కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి బలంగా తగులుతోందని ఈ రోజు విజయవాడలో ఆ పార్టీ నిర్వహించిన ప్రజాగ్రహ సభ ద్వారా తేటతెల్లమైంది. ఈ సభలో మాట్లాడిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు.. ప్రజా సంక్షేమ పథకాల అమలులో సీఎం వైఎస్‌ జగన్‌తో ప్రధాని మోదీని పోల్చారు.

వైఎస్‌ జగన్‌ కంటే.. మోదీనే ఎక్కువ సంక్షేమం చేస్తున్నారని సోము వీర్రాజు చెప్పుకొచ్చారు. జగన్‌ వద్ద నవ రత్నాలు ఉంటే.. మోదీ వద్ద 90 రత్నాలు ఉన్నాయని, వైసీపీ నేతలు వస్తే నిరూపిస్తానని ఛాలెంజ్‌ చేశారు. చేతగాక, దమ్ములేక అప్పులు చేస్తున్నారని సోము వీర్రాజు విమర్శించారు. కేంద్రం కరోనా వ్యాక్సిన్‌ తయారు చేయడంతో ప్రజలంతా సంక్షేమంతో ఉన్నారని, కరోనా వ్యాక్సిన్‌ను మీరు తయారు చేయగలరా..? అంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అంశంపై కూడా సోము వీర్రాజు మాట్లాడారు. బీజేపీకి అధికారం ఇస్తే.. మూడు సంవత్సరాలలో రాజధానిని విజయవాడలో నిర్మిస్తామని చెప్పారు. చంద్రబాబు రాజధాని కోసం 7200 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారని, ఆ మొత్తం ఎక్కడకు పోయిందో రైతులు వెళ్లి అడగాలని సలహా ఇచ్చారు. అద్భుతమైన, అవగాహన ఉన్న ముఖ్యమంత్రిని పెడతామని చెప్పారు. రాయలసీమలో హైకోర్టు ఉండాలని, వెనుకబడిన ఉత్తరాంధ్ర జిల్లాలను అభివృద్ధి చేస్తామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌ను ఎడ్యుకేషన్‌ హబ్‌గా మారుస్తామని హామీ ఇచ్చారు.

రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి అంతా కేంద్ర ప్రభుత్వమే చేస్తోందని సోము వీర్రాజు చెప్పారు. ఆ అభివృద్ధిని తట్టుకోలేక ప్రత్యేక హోదా, స్టీల్‌ ప్లాంట్‌.. అంటూ మాట్లాడుతున్నారన్నారు. ప్రత్యేక హోదా అడిగే వారు.. చంద్రబాబు వద్దకు వెళ్లి ప్రత్యేక హోదా బదులు ప్యాకేజీ ఎందుకు తీసుకున్నారో అడగాలని సోము వీర్రాజు సూచించారు. ఇతర రాష్ట్రాలకు ప్రత్యేక హోదాను నీతి ఆయోగ్‌ పరిశీలిస్తే.. ఏపీకి కూడా పరిశీలిస్తుందని సోము చెప్పారు. స్టీల్‌ ప్లాంట్‌ ను బీజేపీనే కాపాడుతోందని చెప్పుకొచ్చారు.

మందు తాగే వాళ్లు అందరూ బీజేపీకి ఓటేయండి..

మద్యాన్ని ఎక్కువ ధరకు విక్రయిస్తూ.. రాష్ట్ర ప్రభుత్వం ఖజానాను నింపుకుంటోందని సోము వీర్రాజు విమర్శించారు. మూడు రూపాయలకు తయారు అయ్యే చీఫ్‌ లిక్కర్‌ను 25 రూపాయలకు కొని, 250 రూపాయలకు అమ్ముతున్నారని, తాము ప్రశ్నిస్తే.. 30 రూపాయలు తగ్గించారని చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో కోటి మంది మద్యం తాగుతున్నారని, వారందరూ బీజేపీకి ఓట్లు వేస్తే చీఫ్‌ లిక్కర్‌ను 75 రూపాయలకే ఇస్తామన్నారు. ఇంకా ఆదాయం బాగా ఉంటే 50 రూపాయలకే ఇస్తామని హామీ ఇచ్చారు. పోలవరం ప్రాజెక్టుకు నిధులు ఇస్తున్నామన్నారు. నాయకత్వ లక్షణాలు ఉన్న పార్టీ, చైనాను ఢీకొట్టగలిగే పార్టీ బీజేపీనేనన్న సోము వీర్రాజు.. ఏపీలో బీజేపీకి అధికారాన్ని ఇవ్వాలని కోరారు.

Also Read : బీజేపీ అంటే.. భారతీయ జగన్‌ పార్టీ అంటున్న టీడీపీ నేత