అసలు పుస్తకాలు ఎందుకు చదవాలి.. మనకు తెలియనిది తెలుసుకోవడానికి అది విజ్ఞానం కావొచ్చు, ప్రేమ కావొచ్చు, పురాణం కావొచ్చు, కష్టాలు కావొచ్చు మరేదైనా కావొచ్చు. ఒక్కో రచయితదీ ఒక్కో విధానం, ఒక్కో శైలి.
కొందరు రచయితలు అందమైన అమ్మాయి గురించి అత్యద్భుతంగా వర్ణిస్తే, కొందరు హీరోకి ప్రపంచంలో సకల ఉత్తమమైన గుణాలను ఆపాదించి వారికి ఎన్ని కష్టాలున్నా చిటికెలో మాయమైపోయాలా రాస్తారు. కానీ రియాలిటీ అలా ఉండదు తరిచి చూస్తే ఒక్కొక్కరిదీ ఒక్కో కన్నీటి వ్యథ, ఆ కష్టాల కడలిలోంచి బయటపడే మార్గమే కనిపించదు. అదే నిజం అదే యదార్థం. ఆ యదార్థంలోకి పాఠకున్ని తీసుకెళ్లగల అతి కొద్ది మంది రచయితల్లో ‘సింగమనేని నారాయణ’ గారు ఒకరు.
ఎనభై తొంభైలకాలం నాటి అనంతపురం రైతు బతుకును, సామాజక జీవనాన్ని కళ్ళకు కట్టినట్టు చూపించారు. రాయలసీమ యాస మరీ ముఖ్యంగా అనంతపురం భాషతో అడుగడుగునా పల్లె జీవితానికి కట్టుబడి సాగుతాయి ఈ ‘సింగమనేని నారాయణ కథలు’.
అడుసు, జూదం, ఊబి మరియు విముక్తి కథల్లో వర్షం కోసం ఎదురు చూసి చూసి అదునుకు అవి పడకపోతే అప్పులు చేసి బోరు వేసి పురుగు మందులు కొని కంటికి రెప్పలా కాచుకున్న చీనీ తోటలు, పైరు అమ్మకానికి పెడితే ఆ దళార్లు చెప్పే ధరలకు కనీసం పెట్టుబడి కూడా రాక రేపటి కోసం ఆశగా ఎదురుచూసే అనంతపురం రైతుల ధైన్య స్థితిని చూసి వద్దురా సామీ ఈ రైతు బతుకు అనిపించక మానదు.
ఆరో తరగతిలోనే రైతింట్లో జీతగాడుగా పనిచేస్తున్న నాన్న చనిపోతే కూలీ నాలీ చేసి, ఆడదైనా చెప్పులు కుట్టి అమ్మ చదివిస్తే ఎన్నో కష్టాలకోర్చి టీచర్ ఉద్యోగం సాధించిన ఒక దళిత కుర్రాడు పోస్టింగ్ కోసం ఊరెళ్తే కేవలం దళితుడనే ఉద్దేశ్యంతో పిల్లల్ని స్కూల్లో కూర్చోబెట్టి టీచర్ను ఎండలో నిలబెట్టి పాఠాలు చెప్పడం చూసి విస్తుపోవడం ‘మకరముఖం’ లో చూడొచ్చు.
వాళ్లనూ ఈళ్లనూ కాళ్లు పట్టుకుని కరణం గారింట్లో వెట్టి చాకిరీ చేసి రెండెకరాల పొలం రాపిచ్చుకుంటే దాని మీద కళ్ళు పడ్డ అగ్ర కులాల పెద్ద మనుషులు ఉచ్చు పన్ని దాన్ని లాక్కునే హృదయ విదారక దృశ్యం ‘ఉచ్చు’ లో చదవొచ్చు.
నలుగురు పిల్లలున్న పేద కుటుంబంలో పుట్టి కష్టపడి టీచర్ ఉద్యోగం సంపాదించిన పెద్ద కొడుకు వచ్చే చాలీ చాలనీ జీతంతో తన కుటుంబాన్నీ, తల్లిదండ్రలనూ సాకుతున్నా కూడా మా పెద్దోడు మాకేమీ పెట్టట్లేదని ప్రచారం చేసే తల్లిదండ్రుల మానసిక హింసను ‘హింస’ లో చూడొచ్చు.
ఇరుకింట్లోంచి కొత్త విశాలమైన అద్దెంట్లోకి మారిన తర్వాత ఇళ్లు బోసిగా ఉందని కొంత ఫర్నిచర్ చుట్టుపక్కల అమ్మలక్కలు చిన్నబుచ్చారని కొంత ఫర్నిచర్ కొంటూ ఇదేంటి ముందున్న చిన్నింట్లో ఇవేమీ లేకున్నా బాగానే ఉన్నాం కదా అంటే ఆమె చెప్పిన సమాధానం విని అతను ఆశ్చర్యపోవడం ‘ప్రమాదవీణ’ లో చూడొచ్చు.
రిటైరైన తర్వాత వచ్చిన డబ్బుతో విశాలమైన ఇళ్లు కట్టుకుని వాడెవుడో చెప్పాడని వాస్తు ప్రకారం తుది మెరుగులు దిద్దుతూ ఇంటి గోడనే కూల్చుకున్న వాస్తు పిచ్చిని ‘అవాస్తువికత’ లో చూడొచ్చు.
స్త్రీ స్నేహమెరని ఒక డాక్టర్ ఢిల్లీ ప్రయాణంలో చలాకీతనం కలగలిసిన తన జూనియర్ని కలవడం ఆ ప్రయాణంలో ఆమెతో ప్రేమలో పడటం ప్రపోజ్ చేసినపుడు ప్రాక్టికల్గా ఆలోచించు నీకూ నాకూ సెట్టవుద్దా అని వేసిన ప్రశ్నలకు ఉడాయించడం ‘నీకూ నాకూ మధ్య నిశీధి’ లో చదవొచ్చు.
దృశ్యమూ – అదృశ్యమూ, జ్ఞాతమూ – అఙ్ఞాతమూ, పరీక్షిత్తు, విముక్తి, ఒక గతి – ఒక శ్రుతి, వాసంత తుషారం, యక్ష ప్రశ్నలు ఇలా ప్రతి కథలోనూ ఒక్కో వ్యథనూ స్పృశిస్తూ సాగే ఆయన రచనలు జీవిత చిత్రాన్ని కళ్ళకు కట్టినట్లు చూపిస్తాయి.