Idream media
Idream media
చిన్నప్పుడు శివరాత్రి కోసం ఎదురు చూసేవాళ్లం. ఎందుకంటే ఆ రోజు రాత్రి పెద్దవాళ్ల ఆంక్షలుండవు. రాత్రంతా సినిమాలు చూడొచ్చు. మా దురదృష్టం ఏమంటే ఊళ్లో ఉన్నది రెండే థియేటర్లు, రాత్రి ఆటలు నాలుగు. ఛాయస్ తక్కువ.
శివరాత్రి కానుకగా ఒక కొత్త సినిమా, పాత సినిమా వేసేవాళ్లు. పగలంతా మైక్‌లో ప్రచారం ఊదరగొట్టేవాళ్లు. పగలంతా చచ్చీచెడి ఉపవాసం ఉండేవాళ్లం. సాయంత్రం శివుడి గుడికి జట్కాలో ప్రయాణం. అక్కడ వడపప్పు, పానకం. ఆ తర్వాత రకరకాల పండ్లు. ఇదంతా ముగిసే సరికి ఫస్ట్ షో మిస్.
చాలా మంది రకరకాల ఆటలు ఆడుకునేవాళ్లు. ఆడపిల్లలతో కొంచెం ఫ్రీగా అడుకునే అవకాశం. కానీ మేమంతా సినిమా పిచ్చోళ్ల బ్యాచ్. కొంత డబ్బులు పోగు చేసుకుని థియేటర్‌కి పరుగో పరుగు.
దారి పొడవునా ఆరు బయట గుంపులు గుంపులుగా పేకాట రాయిళ్లు కనిపించే వాళ్లు. ఆ రోజు పోలీసులు కూడా ఏమీ అనేవాళ్లు కాదు. థియేటర్ దగ్గర ఒకటే జనం. ఆ రోజుల్లో టికెట్ కౌంటర్లు గుహల్లో ఉండేవి. చిన్నపిల్లలు లోపలికి వెళితే బయటికి రావడం కష్టం. మా బ్యాచ్‌లో నాగరాజు అనేవాడు ఎలుగ్గొడ్డులా ఉండేవాడు. వాడు వెళ్లి జనాల్ని తోసి , వాళ్ల భుజాల మీద ఎక్కి టికెట్లు తెచ్చేవాడు. చచ్చీ చెడి వెళితే సీట్లు దొరికేవి కావు.
అప్పుడప్పుడే ఎండ మొదలయ్యేది. ఫ్యాన్లు తిరిగేవి కావు. చెమట కంపు. పండగ కదా, పప్పు బ్యాచ్ ఫుల్‌గా ఉండేది. ఇష్టానుసారం బాంబింగ్ జరిగేది. చెమట కంపుకి , ఈ కంపు అదనం. సరే సినిమా కోసం అన్నీ భరించాల్సిందే.
స్క్రీన్ మీద బొమ్మ పడగానే బెంచీల్లో ఉన్న నల్లులు యాక్టివేట్ అయ్యేవి. ఏడుపు సీన్స్‌లో కూడా ప్రేక్షకులు ఉలిక్కిపడేవాళ్లు. స్వచ్ఛంద రక్తదాన కార్యక్రమం జరుగుతూ ఉండేది.
లోపల జాగా ఉందా లేదా అనేది అనవసరం. కౌంటర్‌లో చెయ్యి పెట్టిన ప్రతివాడికి టికెట్ ఇచ్చి లోపలికి తోసేసేవాళ్లు. సీట్ల కోసం బొబ్బిలి యుద్ధం జరిగేది. సగం సినిమా అయిపోయినా ఆడవాళ్లు అరుస్తూనే ఉండేవాళ్లు.
శుభం కార్డు పడేసరికి నిద్ర ముంచుకొచ్చేది. కానీ ఇంకా రెండు సినిమాలు చూడాల్సిన టార్గెట్ కళ్ల ముందు ఉండేది. టీ తాగితే నిద్రపోతుందని రెండు కప్‌లు లాగించేవాళ్లం. అక్కడ్నుంచి ఇంకో థియేటర్‌కి పరుగు.
థర్డ్ షోకి నిద్ర ఆపుకోవడం కష్టంగా ఉండేది. కానీ జాగరణ పుణ్యం పోతుందనే భయంతో బ్రేకులు వేసేవాళ్లం. కానీ కొందరు తూగుతూ అందరి మీద దొర్లేవాళ్లు. దాని తర్వాత నాల్గవ ఆట. ఇది చాలా కష్టం. సగం థియేటర్ పక్కవాడి ఒళ్లో ఉండేది.
మరుసటి రోజు స్కూల్ ఉండేది. నిద్రపోయినా అయ్యవార్లు తన్నకుండా ఉండే ఏకైక రోజు.
పెద్దవాళ్లు అయ్యేసరికి శివరాత్రి మీద ఇష్టం పోయింది. జర్నలిస్ట్ అయ్యేసరికి ప్రతిరోజూ నైట్ డ్యూటీ చేసి జీవితమే ఒక శివరాత్రిగా మిగిలిపోయింది.