iDreamPost
iDreamPost
నిన్న ఓ న్యూస్ ఛానల్ కు గంటకు పైగా రాజమౌళి ఇచ్చిన సెల్ఫీ వీడియో ఇంటర్వ్యూలో ఎక్కువ శాతం కరోనా గురించే చర్చ జరిగినప్పటికీ ఆర్ఆర్ఆర్ విశేషాలు కూడా బాగానే చర్చకు వచ్చాయి. అసలు ఆర్ఆర్ఆర్ ఆలోచన ఎలా వచ్చిందన్న దానికి జక్కన్న ఓ ఆసక్తికరమైన సమాధానం చెప్పారు. ఎప్పుడో ఇరవై ముప్పై ఏళ్ళ క్రితం మధుబాబు, పానుగంటి, కొమ్మినేని లాంటి సుప్రసిద్ధ క్రైమ్ థ్రిల్లర్ నవలల్లో షాడో, బుల్లెట్ లాంటి పాత్రలు తనను విపరీతంగా ఆకట్టుకునేవని వాళ్ళు చేసే సాహసాలు ఆ నవలలను విపరీతంగా చదివించేలా చేశాయట.
విడిగా ఉంటేనే వీళ్ళు ఇలా ఉన్నారే మరి షాడో, బులెట్ ఇద్దరూ కలిస్తే ఇంకేమైనా ఉందా అనే ఆలోచన అప్పట్లోనే వచ్చేదట. అలా ఆలోచనకు అంకురం పడ్డాక చరిత్రలో వేర్వేరు కాలాలకు చెందిన అల్లూరి సీతారామరాజు, కొమరం భీం ఒకే లక్ష్యం కోసం కలిసి పోరాడితే ఎలా ఉండేదన్న కాన్సెప్ట్ ని నాన్న విజయేంద్ర ప్రసాద్ తో చర్చించి ఆపై ఆర్ఆర్ఆర్ స్టొరీని సిద్ధం చేయించారట. సో రాజమౌళి చెప్పినట్టుగా ఆర్ఆర్ఆర్ కు స్ఫూర్తి తెలుగులో ఒకప్పుడు వచ్చిన క్రేజీ బుక్స్ అంటే ఆశ్చర్యం వేయక మానదు. నిజానికి ఇప్పటికీ మధుబాబు షాడో నవలలను బాగా చదివే పాఠకులు చాలానే ఉన్నారు.
ఆన్ లైన్ లో డిజిటల్ ఎడిషన్స్ కు మంచి ఆదరణ ఉంది. అవి వచ్చిన సమయంలో అప్పుడు యూత్ గా ఉండేవాళ్ళు వీటిని విపరీతంగా చదివే వాళ్ళు. మూడు దశాబ్దాల తర్వాత కూడా వాటి ప్రభావం ఉందంటే అది చిన్న విషయం కాదుగా. ఆర్ఆర్ఆర్ రిలీజ్ డేట్ విషయంలో ఇప్పటికైతే ఎలాంటి అనుమానాలకు తావివ్వడం లేదు రాజమౌళి. చెప్పిన టైం జనవరి 8కి ఇప్పటికీ కట్టుబడి ఉన్నారు . జూనియర్ ఎన్టీఆర్ బర్త్ డే మే 20న వీడియో టీజర్ వదలడం అనుమానం అనే రీతిలో రాజమౌళి చెప్పడంతో తారక్ ఫ్యాన్స్ నిరాశలో ఉన్నారు. ఒకవేళ నిబంధనలు సడలించి తమను ఆఫీస్ దాకా వెళ్ళనిస్తే కానుక ఇస్తామని చెప్పారు కాని అది అంత సులభంగా కనిపించడం లేదు.