Idream media
Idream media
స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు ప్రతిపక్ష టీడీపీ నుంచి అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వలసలు కొనసాగుతున్నాయి. వైఎస్సార్ కడప జిల్లాలో ఈ రోజు ప్రతిపక్ష పార్టీకి మరో షాక్ తగలబోతోంది. నిన్న మంగళవారం ఆ పార్టీకి పులివెందుల ఇన్‌ఛార్జి సతీష్‌రెడ్డి రాజీనామా చేయగా.. ఈ రోజు బుధవారం ఆయన, జమ్మలమడుగు టీడీపీ నేత రామసుబ్బారెడ్డి వేర్వేరుగా వైఎస్సార్‌సీపీలో చేరుతున్నారు. సాయంత్రం సతీష్‌రెడ్డి జగన్‌ను కలవబోతుండగా.. రామసుబ్బారెడ్డి తన అనుచరులతో కలసి జమ్మలమడుగు నుంచి తాడేపల్లి చేరుకున్నారు. వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిని కలిశారు. సీఎం వైఎస్ జగన్ సమక్షంలో రామసుబ్బారెడ్డి వైఎస్సార్‌సీపీ కండువా కప్పుకోనున్నారు.
రామసుబ్బారెడ్డి టీడీపీని వీడుతారని గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. గత ఎన్నికల్లో జమ్మలమడుగు నుంచి టీడీపీ అభ్యర్థిగా రామసుబ్బారెడ్డి పోటీ చేసి ఓడిపోయారు. టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో జమ్మలమడుగు నుంచి వైఎస్సార్‌సీపీ తరఫున గెలిచిన ఆదినారాయణ రెడ్డిని పార్టీలోకి చేర్చుకుని మంత్రి పదవి కూడా ఇచ్చారు. ఆదినారాయణ రెడ్డి రాకను రామసుబ్బారెడ్డి తీవ్రంగా వ్యతిరేకించారు. వారి మధ్య సఖ్యత కుదిర్చేందుకు చంద్రబాబు ఆర్థిక, రాజకీయ ప్రయోజనాల హామీ ఇచ్చారు. అందులో భాగంగానే గత ఎన్నికల్లో ఆదినారాయణ రెడ్డి కడప లోక్‌సభకు పోటీ చేయగా.. రామసుబ్బారెడ్డి జమ్మల మడుగు నుంచి శాసన సభకు పోటీ చేశారు.
Read Also : కడప టీడీపీ నేతల దారులన్నీ జగన్ ఇంటికే..!
ఎన్నికల్లో ఓటమి తర్వాత ఆదినారాయణ రెడ్డి బీజేపీలో చేరగా.. రామసుబ్బారెడ్డి వైఎస్సార్‌సీపీలో చేరుతున్నారు. దీంతో జమ్మలమడుగులో టీడీపీకి పెద్ద దిక్కులేకుండా పోయినట్లువుతుంది. కాగా, ఆదినారాయణ రెడ్డి బావ మరిది సూర్యనారాయణ రెడ్డి విజయవాడలో ఉన్నట్లు సమాచారం. ఆయన కూడా వైఎస్సార్‌సీపీలో చేరతారనే ప్రచారం జరుగుతోంది.