iDreamPost
android-app
ios-app

పోలియో నిర్మూలనకు కృషి చేసిన సాబిన్

పోలియో నిర్మూలనకు కృషి చేసిన సాబిన్

కొన్ని సంవత్సరాల వరకూ పోలియో వ్యాధి బారిన పడి, చచ్చుబడి, సన్నగా పుల్లల్లాంటి కాళ్ళకు బరువైన ఇనుప కాలిపర్లు తగిలించుకుని నడుస్తూ కనిపించిన పిల్లలు ఇప్పుడు కనిపించడం లేదంటే అది పోలియో చుక్కల మహిమే. మారుమూల ప్రాంతాల్లో సైతం పిల్లలు ఎవరినీ వదలకుండా పోలియో డ్రాప్స్ ఒక ఉద్యమం లాగా వేయడం వలన ఇప్పుడు ప్రపంచంలో పోలియో వైరస్ దాదాపు మాయమైపోయింది.

2009 వరకూ ప్రపంచంలో నమోదయిన పోలియో కేసుల్లో 60% ఒక్క ఇండియాలోనే నమోదయ్యేవి. పోలియో నిర్మూలన పథకంలో భాగంగా పోలియో చుక్కలు వేయడం మొదలు పెట్టాక 2011 తరువాత దేశంలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. వరుసగా మూడు సంవత్సరాల పాటు ఒక్క కొత్త పోలియో కేసు కూడా నమోదు కాకపోవడంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ టట2014లో భారతదేశాన్ని పోలియో రహిత దేశంగా గుర్తించింది.

ఆ మూడు దేశాల్లోనే పోలియో వైరస్

ఇప్పుడు ప్రపంచం మొత్తం మీద పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, నైజీరియా దేశాల్లోనే పోలియో వైరస్ సజీవంగా ఉంది. వాక్సీన్ తీసుకున్న వారికి సంతానం కలగదు అని కొందరు మతపెద్దల అర్థం లేని భయాల వల్ల ఆ దేశాల్లో పోలియో వాక్సీన్ కొందరు వేసుకోకపోవడం వలన ఆ దేశాల్లో ఇప్పటికీ పోలియో కేసులు నమోదు అవుతూనే ఉన్నాయి.

పోలియో డ్రాప్స్ సృష్టికర్త

పేద దేశాలు కూడా తమ దేశాల్లోని పిల్లలందరికీ పోలియో వాక్సీన్ వేయించి వారిని కాపాడుకున్నాయంటే అందుకు కారణం చవకైన పోలియో వాక్సీన్ రూపొందించిన శాస్త్రవేత్త ఆల్బర్ట్ బ్రూస్ సాబిన్.

పోలండులో ఆగస్టు 26,1906 న జన్మించిన ఈయన అసలు పేరు అబ్రామ్ సాపర్ స్టెయిన్. తన పదిహేనవ ఏట కుటుంబంతో కలిసి అమెరికాకి వలస వచ్చి, అక్కడ పౌరసత్వం పొందినప్పుడు తన పేరుని ఆల్బర్ట్ బ్రూస్ సాబిన్ గా మార్చుకున్నాడు. న్యూ యార్క్ విశ్వవిద్యాలయం నుంచి వైద్య శాస్త్రంలో పట్టా పొంది, రెండవ ప్రపంచ యుద్ధంలో అమెరికా సైన్యం వైద్య విభాగంలో లెఫ్టినెంట్ కల్నల్ గా పని చేస్తున్నప్పుడు మెదడు వాపు వ్యాధికి టీకా కనిపెట్టాడు.

పోలియో వాక్సీన్

రెండవ ప్రపంచ యుద్ధం అనంతరం ప్రతి ఏటా పెరుగుతున్న పోలియో బాధితుల కోసం వాక్సీన్ కనిపెట్టే ప్రయత్నంలో తనూ భాగమయ్యాడు సాబిన్. ఫిలడెల్ఫియా పరిశోధకుడు జోనాస్ సాల్క్ రూపొందించిన పోలియో ఇంజెక్షన్ 1955లో అందుబాటులోకి వచ్చింది. ఈ టీకా పోలియో వల్ల కలిగే దుష్పరిమాణాలను నివారిస్తుంది కానీ జీర్ణవ్యవస్థలో ఏర్పడే పోలియో ఇన్ఫెక్షన్ ని నివారించడం లేదని సాబిన్ తెలుసుకున్నాడు.

అందరికీ అందుబాటులో ఉండాలన్న ఆశయంతో తను కనిపెట్టిన టీకా మీద సాల్క్ పేటెంట్ హక్కులు తీసుకోకపోయినా, వైరస్ ను నిర్జీవం చేసి ఇంజెక్షన్ రూపంలో ఇచ్చే ఆ వాక్సీన్ కోసం వైరస్ ను నిర్జీవం చేసే ప్రక్రియ వల్ల ధర అధికం కావడంతో పేద వర్గాల, పేద దేశాల పిల్లలకు అందుబాటులో లేకుండా పోయింది.

నోటి ద్వారా ఇవ్వగలిగే వాక్సీన్ పోలియో వైరస్ ను మరింత సమర్ధవంతంగా ఎదుర్కొని, మరింత రక్షణ ఇవ్వగలుగుతుందని, ఆ దిశగా ప్రయత్నించిన సాబిన్, నిర్వీర్య పరచిన, జీవించి ఉన్న వైరస్ చుక్కల రూపంలో నోటి ద్వారా ఇచ్చే వాక్సీన్ రూపొందించాడు. అయితే అప్పటికే సాల్క్ రూపొందించిన ఇంజెక్షన్ వాక్సీన్ ప్రచారంలో ఉండడంతో అమెరికా ప్రభుత్వం కానీ, స్వచ్ఛంద సంస్థలు కానీ సాబిన్ రూపొందించిన టీకా పట్ల ఆసక్తి చూపించలేదు.

అయితే చుక్కల రూపంలో ఉన్న ఈ వాక్సీన్ శక్తి గుర్తించిన రష్యా శాస్త్రవేత్తలు దీనిని పరీక్షించడానికి ముందుకు రావడంతో 1955- 1961 మధ్య కాలంలో రష్యా, తూర్పు యూరోప్, మెక్సికో, నెదర్లాండ్స్ దేశాల్లో పది కోట్ల మంది మీద పరీక్షించి, సంతృప్తి చెందిన రష్యా ప్రభుత్వం దీని ఉత్పత్తి మొదలుపెట్టి లక్షలాది డోసులు పోలియో జబ్బు తీవ్రంగా ఉన్న అనేక దేశాలకు ఉచితంగా పంపిణీ చేసింది.

అప్పుడు మేల్కొన్న అమెరికా ప్రభుత్వం 1960 ఏప్రిల్ నెలలో సిన్సిన్నాటి రాష్ట్రంలో లక్షా ఎనభై వేల మంది స్కూలు పిల్లల మీద పరీక్షించి 1961లో టైప్-1 పోలియో వైరస్ మీద పనిచేసే టీకాకి, 1962లో టైప్-2,3 పోలియో టీకాకి లైసెన్సు ఇచ్చింది. 1964 లో మూడు రకాల వైరసుల మీద పనిచేసేలా ట్రైవాలెంట్ వాక్సీన్ రూపొందించాడు సాబిన్. ఆ తరువాత పోలియో మీద పోరాటంలో సాబిన్ రూపొందించిన టీకా ప్రధాన అస్త్రం అయింది.

టీకా తీసుకోనివారికి కూడా రక్షణ

సాబిన్ రూపొందించిన టీకాలో ఉన్నది సజీవంగా ఉన్న (నిర్వీర్యం చేయబడిన) వైరస్ కావడం వలన ఇది కూడా పోలియో కారక వైరస్ లాగానే ఒకరినుంచి మరొకరికి సంక్రమించి వారికి కూడా రక్షణ కలిగిస్తుంది. ఈ లక్షణం కారణంగా ఒక లొకాలిటిలో అరవై, డెబై శాతం మందికి వాక్సీన్ ఇచ్చినా మిగిలిన వారందరికీ రక్షణ లభిస్తుంది. పోలియోని సమూలంగా నిర్మూలించడంలో సాబిన్ రూపొందించిన వాక్సీన్ సమర్ధవంతంగా పనిచేయడానికి ఇది కూడా ఒక కారణం.

సాల్క్ లాగా సాబిన్ కూడా తను కనిపెట్టిన వాక్సీన్ కి పేటెంట్ హక్కులు తీసుకోలేదు. తన వాక్సీన్ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉండాలని కోట్లాది డాలర్ల ఆదాయం వదులుకున్నారు ఈ ఇద్దరు శాస్త్రవేత్తలు. సాబిన్ సేవలకు గుర్తుగా రష్యా ప్రభుత్వం పౌరులకిచ్ఛే అత్యున్నత పురస్కారం సాబిన్ కి అందజేసింది. అమెరికా ప్రభుత్వం కూడా అనేక అవార్డులు ఇచ్చింది. కొన్ని రకాల కేన్సర్లకూ, వైరసులకు ఉన్న సంబంధం గుర్తించి ఆ దిశగా ప్రయోగాలు చేస్తూ 1993లో మరణించాడు సాబిన్.

(ఆగస్టు 26 సాబిన్ జన్మదినం సందర్భంగా)

Jojobet GirişmeritbetmeritbetholiganbetHoliganbet girişcasibomJojobet GirişcasibomjojobetjojobetcasibomholiganbetPokerklasMadridbetJojobet GirişcasibomHoliganbet GirişOnwin Girişdeneme bonusu veren sitelerCasibom Girişhttps://www.hoteltarobafoz.com.br/superbetincasibomholiganbet giriş