వదంతులే పెద్ద ప్రమాదం..

సాధారణగా అంతుచిక్కన పరిస్థితులు ఏర్పడినప్పుడు సమన్వయంతో దానిని ఎదుర్కొవాల్సి ఉంటుంది. మహమ్మారులు సంభవించినప్పుడు వాటి కారణంగా ఏర్పడే సమస్యలు ఒక ఎత్తుయితే.. పుకార్ల కారణంగా ఏర్పడే ముప్పు మరొక ఎత్తవుతుంటుంది. ఇటీవలే కోవిడ్‌ 19 కారణంగా ఏర్పడిన పరిస్థితులను ప్రజలందరూ చూసారు. అదిగో వ్యాధి అంటే.. ఇదిగో ప్రమాదం అనేస్తూ.. రకరకాలైన ఇబ్బందులకు లోను కావడంతో పాటు, తోటి వారిని కూడా ఇబ్బందులు పెట్టిన పరిస్థితులు నెలకొన్నాయి. కనీసం పాజిటివ్‌ వచ్చిన వ్యక్తి మనకు ఎంత ఆప్తుడైనా అతడిని చూసేందుకు కూడా భయపడేవారు. ఇదంతా సదరు వ్యాధి పట్ల అసరైన అవగాహన లేకపోవడమే కారణం.

ఈ నేపథ్యంలోనే సీయం వైఎస్‌ జగన్‌ స్వయంగా మీడియా ముందుకు వచ్చి కోవిడ్‌ను గురించి భయపడొద్దని, జాగ్రత్తగా ఉందామంటూ ప్రజలను చైతన్యపరిచేందుకు నాంది పలికారు. దీంతో పరిస్థితిలో నెమ్మదిగా మార్పు ప్రారంభమైంది. ఆ తరువాత జగన్‌ చెప్పిన అంశాలనే అంతర్జాతీయ స్థాయిలో వైద్య నిపుణులు కూడా చెబుతుండడంతో నమ్మకం పెరిగింది. ప్రభుత్వం అందిస్తున్న వైద్య సహాయానికి మద్దతుగా ప్రజలు నిలిచారు. ప్రభుత్వం, ప్రజలు, యంత్రాంగం సమన్వయంతో కృషి చేయడంలో కోవిడ్‌ నియంత్రణలోకొచ్చింది. రోజుకు వేల సంఖ్యలో పాజిటివ్‌లు నమోదయ్యే పరిస్థితి నుంచి వందల సంఖ్యకు పడిపోయింది.

సరిగ్గా ఇదే పరిస్థితిని ఏలూరులో గుర్తు తెలియని అస్వస్థత విషయంలో కూడా ఇప్పుడు అంతా గుర్తు చేసుకుంటున్నారు. ఏదో జరిగిపోతుందన్న ఆందోళనతో ఒక దశలో ఏలూరు పట్టణ ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి. స్థానికంగా లభించే మంచినీటిని తాగేందుకు కూడా భయపడిపోయారు. దీంతో ఫిల్టర్‌ వాటర్‌ కోసం క్యూలు కట్టేసారు. కానీ ప్రభుత్వం అప్రమత్తమై నీటిశాంపిల్స్‌ పరీక్షించి అన్నీ నార్మల్‌గానే ఉన్నట్లు తేల్చడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.

పశ్చిమగోదావరి జిల్లాలో ప్రదాన పట్టణమైన ఏలూరు నుంచి ప్రతి నిత్యం వేలాది మంది జిల్లా నలుమూలలకు రాకపోకలు సాగిస్తుంటారు. పట్టణంలో ఇలా జరుగుతోందన్న వార్త దావానలంలా వ్యాపించడంతో జిల్లా వ్యాప్తంగానే కాకుండా ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ ఆందోళనలు పెరిగాయి. ఆ తరువాత ప్రభుత్వం చేపట్టిన చర్యలు, రోగుల సంఖ్య తగ్గడంతో సాధారణ పరిస్థితుల నెలకొంటున్నాయి.

మరో వైపు ఇంటింటా వైద్య బృందాలు, వాలంటీర్లు, సిబ్బంది సర్వేలు నిర్వహిస్తూ ప్రజల్లో భయాందోలను పోగొట్టే ప్రయత్నాల్లో నిమగ్నమయ్యారు. జాతీయ స్థాయి నిపుణుల బృందాలు కూడా ఏలూరుకు వచ్చాయి. మొదటి రెండు రోజులు వందల సంఖ్యలో ఆసుపత్రులకు వచ్చిన రోగులు, ఆ తరువాత గణనీయంగా తగ్గిపోయారు. దీంతో నెమ్మది నెమ్మదిగా ఏలూరులో సాధారణ పరిస్థితులు నెలకొనడానికి అవకాశం కలిగింది. ఈ లోపు స్వయంగా సీయం పర్యటనకు సమాయత్త మయ్యారు. తద్వారా ప్రజల్లో నైతిక సై్థర్యాన్ని నింపడానికి తోడ్పడినట్టయింది.

పరిస్థితి అదుపులోనే ఉందని, ఎటువంటి వందతులు నమ్మవద్దని/ ప్రచారం చేయొద్దని, వైద్య పరంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రులు, వైద్య ఉన్నతాధికారులు కూడా ఏలూరు ప్రజలకు భరోసా కల్పించేందుకు సిద్ధమయ్యారు.

Show comments