కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ స్థానిక ఎన్నికల ప్రక్రియను ఆరువారాల పాటు వాయిదా వేస్తున్నట్టు ఆకస్మిక ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను వాయిదా వేస్తున్నట్టు రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఉత్తర్వులు జారీచేసింది. ఇదే సమయంలో ఇప్పటివరకు ఏకగ్రీవమైన స్థానాల్లో ఏకగ్రీవంగా ఎన్నికైన అభ్యర్థులు కొనసాగుతారని రాష్ట్ర ఎన్నికల సంఘం ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఎన్నికల కమిషన్ ఆదేశాలతో అన్ని జిల్లాల్లో మండల స్థాయిలో ఎంపీటీసీ ఎన్నికల రిటర్నింగ్ అధికారులు ఏకగ్రీవాలైన చోట అభ్యర్థులకు ధ్రువీకరణ పత్రాలు అందజేస్తున్నారు. ఈనేపధ్యంలో ఒకవేళ ఎన్నికల కమిషన్ ఎన్నికల ప్రక్రియను పూర్తిగా రద్దుచేసి మళ్లీ ప్రారంభిస్తే ఏకగ్రీవాల ధ్రువీకరణ పత్రాల సంగతి ఏంటనే సందేహం వ్యక్తమవడంతో ఏకగ్రీవంగా ఎన్నికైన అభ్యర్థులలో కొంత ఆందోళన నెలకొని వుంది.
అయితే రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోని మండల స్థాయి రిటర్నింగ్ అధికారులు ప్రభుత్వం నుంచి వచ్చిన డైరెక్షన్ మేరకు పరోక్షంగా అధికార పార్టీని సంతృప్తి పర్చడానికి, అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తూ ఏకగ్రీవంగా ఎన్నికైన అభ్యర్థులకు ధ్రువీకరణ పత్రాలు జారీచేస్తున్నారని, ఇలా ధ్రువీకరణ పత్రాలు జారీచేయడం ద్వారా ఆ పత్రాలు పొందిన వారు కోర్టుకు వెళ్ళడానికి కూడా అవకాశం ఉంటుందని తెలుగుదేశం తో పాటు ఇతర విపక్షాలు ఆరోపిస్తున్నారు.
అయితే ప్రభుత్వాధికారులు మాత్రం విపక్షాలు చేస్తున్న ఆరోపణలను కొట్టిపారేస్తున్నారు. తాము ప్రభుత్వ ఉద్యోగులుగా కేవలం ఎన్నికల సంఘం నుండి వచ్చిన ఆదేశాలను మాత్రమే పాటిస్తున్నామని స్పష్టం చేస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలను రద్దు చేస్తూ ఒకపక్క రాష్త్రపరభుత్వం సుప్రీం కోర్ట్ ని ఆశ్రయించడంతో బుధవారం విచారం జరగనుంది. ఈ నేపథ్యంలో సుప్రీం కోర్ట్ ఎలాంటి ఆదేశాలిస్తుందోనన్న ఆసక్తి సర్వత్రా నెలకొని వుంది.