రానున్న 30 గంటల్లో భారీ వర్షాలు!

రానున్న ముప్పై గంటల్లో ఏపీలో భారీ వర్షాలు కురవనున్నాయని వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉన్న అల్పపీడనం బలపడుతోందని చెబుతున్నారు. ఇది తీవ్ర వాయుగుండంగాను, తుఫానుకుగానే మారేందుకు అవకాశాలున్నాయని వివరిస్తున్నారు. ఈ తుఫానుకు బురేవి అని పేరు పెట్టారు. ఇది శ్రీలంక సమీపంలో తీరాన్నిదాటేందుకు అవకాశం ఉంటుందని వివరిస్తున్నారు. ముందుగా వాయువ్య దిశగా ప్రయాణిస్తుందని, ఆ తరువాత తీరం దాటి, 3వ తేదీ నాటికి పశ్చిమదిశగా మళ్ళుతుందని పేర్కొంది.

బురేవి తుఫాను ప్రభావంతో రానున్న ముప్పై గంటల్లో దక్షిణ కోస్తా ఆంధ్రలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయంటున్నారు. ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో మాత్రం భారీ వర్షాలు పడతాయన్నారు. చిత్తూరు జిల్లాకు కూడా వర్షాలు పడే అవకాశ ఉంటుందని వాతావరణ శాఖ నివేదిక స్పష్టం చేస్తోంది.

ఇదిలా ఉండగా శీతాకాలం, దీనికి తుఫాను కూడా తోడవ్వడంతో రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతున్నాయి. విపరీతమైన శీతగాలులకు ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు కోవిడ్‌ కూడా పొంచి ఉండడంతో ప్రజల్లో ఆందోళనలు నెలకొంటున్నాయి. శీతగాలుల ప్రభావంతో గ్రేటర్‌ ఎన్నికల్లో సైతం పోలింగ్‌ శాతం తగ్గడానికి ఒక కారణంగా చెబుతున్నారు.

Show comments