ప్రశాంత్ కిషోర్ సంచలనం.. ‘వ్యూహ సన్యాసం’

అపర చాణక్యుడు, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇకపై ఎన్నికల వ్యూహకర్తగా ఉండబోనని ప్రకటించారు. ‘‘నేను ఇప్పుడు చేస్తున్నదాన్ని ఇకపై కొనసాగించడం నాకు ఇష్టం లేదు. ఇప్పటికే చేయాల్సినంత చేశాను. బ్రేక్ తీసుకోవాల్సిన టైం వచ్చింది. జీవితంలో ఇంకేమైనా చేయాల్సిన అవసరం ఉంది. నేను ఈ స్పేస్ (ఎన్నికల వ్యూహకర్తగా) విడిచిపెట్టాలనుకుంటున్నాను’’ అని ఓ ఇంటర్వ్యూలో అన్నారు. తాను ఫెయిల్ అయిన రాజకీయ నాయకుడిని అని అన్నారు. అయితే భవిష్యత్తులో ఏం చేస్తారనేది మాత్రం స్పష్టంగా చెప్పలేదు.

నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి జరిగిన ఎన్నికల ఫలితాలు వస్తున్న సమయంలోనే ఆయన ఈ ప్రకటన చేయడం హాట్ టాపిక్ గా మారింది. ఓ వైపు ప్రశాంత్ కిషోర్ వ్యూహాల సారథ్యంలో ఎన్నికలకు వెళ్లిన టీఎంసీ పార్టీ పశ్చిమ బెంగాల్ లో… డీఎంకే పార్టీ తమిళనాడులో గెలుపు దిశగా దూసుకుపోతుంటే.. ఇప్పుడు ఆయన తీసుకున్న నిర్ణయం చర్చనీయాంశమవుతోంది.

బెంగాల్ లో సవాల్ చేసి..

పశ్చిమ బెంగాల్ ఎన్నికల సమయంలో బీజేపీకి సవాల్ విసిరారు ప్రశాంత్ కిషోర్. బెంగాల్ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తే.. ఎన్నికల వ్యూహకర్త‌ బాధ్యతల నుంచి వైదొలిగి వేరే పని చూసుకుంటానని ప్రకటించారు. బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వస్తుందని.. మమతా బెనర్జీ సీఎం అవుతారని చెప్పారు. బెంగాల్లో బీజేపీ డబుల్ డిజిట్ దాటితే.. తాను అస్త్ర సన్యాసం చేస్తానని శపథం చేశారు. అన్నట్లుగానే ఆయన జోస్యం నిజమైంది. టీఎంసీ 200కు పైగా సీట్లతో విక్టరీ వైపు వెళ్తుంటే.. బీజేపీ 80 సీట్ల దగ్గరే ఆగిపోయింది.

2012 నుంచి..

అటు బీజేజీ, ఇటు కాంగ్రెస్.. రెండింటికి ఎన్నికల వ్యూహకర్తగా పనిచేశారు ప్రశాంత్ కిషోర్. 2012 గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో మూడో సారి ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యేందుకు నరేంద్ర మోడీకి సాయంగా తొలిసారి ప్రచారం చేశారు. ఎన్నికల వ్యూహకర్తగా 2014లో ప్రశాంత్ కిషోర్ పేరు మారుమోగింది. కేంద్రంలో బీజేపీని అధికారంలోకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారాయన. తర్వాత యూపీలో బీజేపీ వ్యతిరేక కూటమి కోసం పని చేశారు. కానీ అక్కడ బీజేపీనే గెలిచింది. తర్వాత జేడీయూతోనూ పీకే పని చేశారు. 2019లో వైఎస్సార్ సీపీతో కలిసి పని చేశారు. జగన్ కోసం ఎన్నికల వ్యూహాలను రచించారు. 2020లో ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీతో, ఇప్పుడు టీఎంసీ, డీఎంకే కోసం పని చేశారు. ఒక్క యూపీలో తప్ప దాదాపు అన్ని ఎన్నికల్లోనూ ఆయన వ్యూహాలు ఫలించాయి. ఆయా పార్టీలు అధికారంలోకి వచ్చాయి. మోస్ట్ సక్సెస్ ఫుల్ పర్సన్ అయిన ప్రశాంత్ కిషోర్.. ఉన్నట్టుండి ‘వ్యూహ సన్యాసం’ ఎందుకు తీసుకున్నట్టో మరి!!

Also Read : తిరుపతిలో బీజేపీకి డిపాజిట్ గల్లంతేనా?

Show comments