iDreamPost
iDreamPost
పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ పనులకు సంబంధించి కేంద్రం చెల్లించాల్సిన బకాయిలకు, పోలవరం ప్రాజెక్టు అథారిటీ సిఫార్సులకు పొంతనలేకుండా పోతోంది. ప్రాజెక్టు నిర్మాణ వ్యయం విషయంలో కేంద్రానిదే బాధ్యత అయినప్పటికీ ఇప్పటికే పలు కొర్రీలు వేసింది. ఇప్పుడు చేసిన ఖర్చులకు కూడా పలు సాకులతో అడ్డంకులు పెడుతోంది. తాజాగా రాజ్యసభలో వైఎస్సార్సీపీ పార్లమెంటరీ విభాగం నేత విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు సమాధానం గమనిస్తే కేంద్రం తీరు స్పష్టమవుతోంది. అక్టోబర్ 21, 2021 నాటికి మొత్తం బకాయిలు రూ. 2,087 కోట్లుగా కేంద్రంగా నిర్ధారించింది. ఇప్పటికే ఆ బిల్లులను రాష్ట్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ (పీపీఏ)కి పంపించినట్టు తెలిపింది. అయితే అందులో దాదాపు మూడోవంతు రూ. 711 కోట్లను మాత్రమే పీపీఏ సిఫార్సు చేసినట్లు కేంద్ర జలశక్తి శాఖ సహాయ మంత్రి బిశ్వేశ్వర్ తుడు రాజ్యసభకు తెలిపారు.
పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ పనుల కోసం కేటాయించిన నిధులపై విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు ఈ సమాధానం చెప్పడం విశేషం. బిల్లుల స్క్రూటినీలో, రాష్ట్ర ప్రభుత్వం నుంచి అదనపు సమాచారం కోరవలసి రావడం, నియమ నిబంధనలను రాష్ట్ర ప్రభుత్వం పక్కాగా అనుసరిస్తోందా లేదా వంటి అంశాల నిర్ధారణ వంటి పలు కారణాల వలన బకాయిల చెల్లింపులలో జాప్యం జరుగుతున్నట్లు మంత్రి వివరించారు. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణంలో ఇరిగేషన్ విభాగం పనులకు సంబంధించిన ఖర్చును 2014 ఏప్రిల్ నుంచి తిరిగి చెల్లిస్తున్నట్లు ఆయన తెలిపారు.
పోలవరం పనుల బిల్లులను పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ (పీపీఏ), కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) పరిశీలించిన అనంతరం చెల్లింపుల కోసం సిఫార్సు చేస్తుంది. వాటిని ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆమోదానికి పంపిస్తారు. కానీ పీపీఏ, సీడబ్ల్యూసీ స్థాయిలో పలు అభ్యంతరాలు తెలుపుతుండడంతో ఏపీ ప్రభుత్వానికి ఇదో పెద్ద సమస్యగా మారుతోంది. పోలవరం ప్రాజెక్టు సకాలంలో పూర్తి చేయాలని జగన్ ఆశిస్తుంటే కేంద్రం మాత్రం నిధుల విడుదల విషయంలో పలు అడ్డంకులు సృష్టిస్తూ తాత్సార్యం చేయడం సమస్యగా మారుతోంది.
Also Read : Jagan, Chandrababu – ఏపీ రాజకీయాలు మారబోతున్నాయా..? ఇకపై సీఎం జగన్..
ఆర్ధిక శాఖ ఆమోదం పొందిన అనంతరం ఎంత మొత్తం బకాయిల చెల్లింపునకు ఆమోదం లభిస్తే ఆ మేరకు నిధులను నాబార్డ్ మార్కెట్ నుంచి ఆ మొత్తం సేకరిస్తుంది. మార్కెట్ నుంచి నిధుల సేకరణ ప్రక్రియ పూర్తి కావడానికి సాధారణంగా రెండు నుంచి మూడు వారాలు పడుతుంది. సేకరించిన నిధులను నాబార్డ్ నేషనల్ వాటర్ డెవలప్‌మెంట్ ఏజెన్సీకి అక్కడి నుంచి పీపీఏ ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి బదిలీ అవుతాయి. ప్రస్తుతం ఆమోదించిన రూ. 700 కోట్ల నిధుల బదిలీ ప్రక్రియ సాధారణంగా ఒకటి రెండు రోజుల్లో పూర్తవుతుందని మంత్రి తెలిపారు. అదే సమయంలో మిగిలిన నిధుల విషయాన్ని మాత్రం కేంద్రం స్పష్టత ఇవ్వకపోవడం గమనార్హం.
త్వరలో విజయవాడ-హైదరాబాద్ మధ్య సీప్లేన్ సర్వీసు ప్రారంభించడానికి సన్నాహాలు సాగుతున్నాయంటూ కేంద్రం మరో ప్రశ్నకు సమాధానంగా తెలిపింది. విజయవాడ ప్రకాశం బ్యారేజ్‌లో వాటర్ ఎయిరోడ్రోమ్ నిర్మాణాన్ని కేంద్ర పోర్టులు, షిప్పింగ్ వాటర్‌వేస్ మంత్రిత్వ శాఖ చేపడుతుందని వెల్లడించింది. ఈ మేరకు 2021 జూన్ 15న ఆ మంత్రిత్వ శాఖతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి వీకే సింగ్ రాజ్యసభలో ప్రకటించారు. ఇప్పటికి నాలుగు రౌండ్ల బిడ్డింగ్ అనంతరం విజయవాడ-హైదరాబాద్ మధ్య సీప్లేన్ సర్వీసుల నిర్వహణకు వాటర్ ఎయిరోడ్రోమ్ నిర్మాణానికి అనువైన ప్రదేశంగా విజయవాడలోని ప్రకాశం బ్యారేజ్‌ను గుర్తించినట్లు మంత్రి తెలిపారు. వాటర్ ఎయిర్‌డ్రోమ్ నిర్మాణం పూర్తయిన అనంతరం ఎంపిక చేసిన ఎయిర్‌లైన్స్ సంస్థ రెండు మాసాల్లో సీప్లేన్ సర్వీసులను ప్రారంభించాల్సి ఉంటుందని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్‌లోని 13 జిల్లాల్లో 2 లక్షల 56 వేల మంది వీధి వ్యాపారులు ఉన్నట్లుగా గుర్తించడం జరిగిందని కేంద్ర పట్టణ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి కౌశల్ కిషోర్ రాజ్యసభలో వెల్లడించారు .కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఎనిమిది సంక్షేమ పథకాల కింద పీఎం స్వానిధి పథకం కింద ఎంపిక చేసిన వీధి వ్యాపారులు వారి కుటుంబ సభ్యులకు ప్రయోజనం చేకూర్చుతున్నట్లు ఆయన వెల్లడించారు.
Also Read : Amravati, Kanakamedala, Rajya Sabha – రాజకీయం కోసమే వరద.. అజెండా మాత్రం అమరావతే.. నిరూపించిన టీడీపీ ఎంపీ