Idream media
Idream media
కరోనా సెంకడ్ వేవ్ దేశంలో కల్లోలం సృష్టిస్తున్న వేళ ప్రధాని నరేంద్ర మోదీ మరో సారి రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్‌కు సిద్దమయ్యారు. మరోమారు కరోనా వైరస్ విలయం సృష్టిస్తున్న సమయంలో మోదీ ఈ రోజు సాయంత్రం ఆరు గంటలకు నిర్వహిస్తున్న సమావేశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఓ పక్క కరోనాను కట్టడి చేస్తూ.. మరో వైపు కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమం వేగవంతం చేయడంపై ప్రధాని మోదీ ముఖ్యమంత్రులతో చర్చించే అవకాశం ఉంది.
అయితే ఈ రోజు మోదీ నిర్వహించే సమావేశంపై రెండు రోజుల నుంచే సోషల్ మీడియాలో ఓ ప్రకటన హల్‌చల్ చేస్తోంది. ప్రధాని మోదీ 8వ తేదీన కీలక ప్రకటన చేయబోతున్నారనే వార్త వైరల్ అయింది. అందుకే సీఎంలో మోదీ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది.
కరోనా సెకండ్ వేవ్‌లో మునుపటి కన్నా ఎక్కువ కేసులు నమోదవుతున్నాయి. 24 గంటల వ్యవధిలో లక్ష కేసులు సెకండ్ వేవ్‌లోనే నమోదు కావడం కరోనా ఉధృతికి అద్దం పడుతోంది. బుధవారం ఉదయం నుంచి గురువారు ఉదయం వరకు 24 గంటల వ్యవధిలో దేశంలో కొత్తగా 1,26,789 పాజిటివ్ కేసులు నమోదు కావడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. గత నాలుగు రోజుల నుంచి కోవిడ్ కేసులు రోజుకు లక్షకు పైగా నమోదవుతున్నాయి. రోజు రోజుకూ ఈ సంఖ్య పెరుగుతూనే ఉండడం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆందోళనకు గురి చేస్తోంది.
దేశంలో మళ్లీ గత ఏడాది పరిస్థితులు నెలకొనే పరిస్థితులు నెలకొంటున్నాయి. కరోనా నుంచి ప్రజలను కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు మళ్లీ వైద్య సదుపాయాలను సిద్ధం చేస్తున్నాయి. అదే సమయంలో వ్యాక్సిన్ వేసే పనిని వేగీరం చేసేందుకు సిద్ధమవుతున్నాయి. ఇప్పటి వరకు దేశంలో 9 కోట్ల మందికి వ్యాక్సిన్ అందించినట్లు ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. 130 కోట్లకుపైగా జనాభా ఉన్న మన దేశంలో ఇప్పటి వరకు వ్యాక్సిన్ తీసుకున్న వారి సంఖ్య 9 కోట్లే కావడం వ్యాక్సిన్ ప్రక్రియను వేగవంతం చేయాల్సిన పరిస్థితిని తెలియజేస్తోంది. మొత్తం జనాభాలో వ్యాక్సిన్ తీసుకున్న వారి శాతం 7 మాత్రమే కావడం గమనార్హం.
కరోనా కేసులు భారీగా నమోదవుతున్న తరుణంలో మహారాష్ట్ర, పంజాబ్ సహా పలు రాష్ట్రాలు పాక్షిక లాక్‌డౌన్‌ను అమలు చేస్తున్నాయి. వారాంతపు లాక్‌డౌన్‌లు, రాత్రి కర్ఫ్యూలు పలు నగరాలలో విధిస్తున్నాయి. మొత్తం నమోదయ్యే కేసులలో సగం మహారాష్ట్రలోనే వెలుగులోకి వస్తున్నాయి.
తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఏపీలలో మరోసారి లాక్‌డౌన్ ఉండబోదని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు చెబుతున్నాయి. వ్యాక్సినేషన్ ప్రక్రియను రెండు తెలుగు రాష్ట్రాలు వేగీరం చేస్తున్నాయి. ఏపీలో వార్డు సచివాలయాల ద్వారా ఈ నెల 1వ తేదీ నుంచి 45 ఏళ్లు దాటిని వారికి వ్యాక్సిన్ ఇస్తున్నారు. పరిషత్ ఎన్నికల తర్వాత గ్రామ సచివాలయాల్లోనూ వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభం కాబోతోంది.
వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేసేందుకు వయస్సు పరిమితిని ఎత్తివేయాలని మహారాష్ట్ర, ఢిల్లీ సహా పలు రాష్ట్రాలు కేంద్రానికి విన్నవిస్తున్నాయి. 18 సంవత్సరాలు దాటిని ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్ ఇచ్చేలా మర్గదర్శకాలు జారీ చేయాలని కేంద్రాన్ని కోరుతున్నాయి. కరోనా వ్యాప్తి, వ్యాక్సినేషన్, రాష్ట్ర ప్రభుత్వాల వినతుల నేపథ్యంలో.. ఈ రోజు సాయంత్రం ఆరు గంటలకు జరగబోయే సమావేశంలో ప్రధాని మోదీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి.
Also Read : మహారాష్ట్రలో రాజకీయ కల్లోలం!