Idream media
Idream media
మహమ్మరి కరోనా వైరస్‌కు వ్యాక్సిన్ రూపాందించే పనిలో పరిశోధనా సంస్థలు ఉండగా.. వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన తర్వాత పంపిణీలో ఎలాంటి విధానం అమలు చేయాలి..? ప్రాధాన్యతాక్రమంలో వ్యాక్సిన్ పంపిణీ తదితర అంశాలపై ప్రధాని నరేంద్ర మోదీ ఈ రోజు ముఖ్యమంత్రులతో సమీక్షించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన ఈ సమావేశంలో 8 రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొన్నారు. వ్యాక్సిన్ పంపిణీపై ఎలాంటి వైఖరి అవలంభించాలో ప్రధాని మోదీ ముఖ్యమంత్రులకు దిశానిర్ధేశం చేశారు. వ్యాక్సిన్ పంపిణీకి అవసరమైన ప్రణాళికను సిద్ధం చేసుకోవాలని సూచించారు.
ప్రధాని మోదీతో సమావేశం అనంతరం సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి వైద్య, ఆరోగ్యశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. వ్యాక్సిన్ పంపిణీకి కార్యాచరణ సిద్ధం చేయాలని ఆదేశించారు. రాష్ట్రంలో వ్యాక్సిన్ పంపిణీ చేయాల్సిన విధానం, ఎవరికి ముందుగా ఇవ్వాలి..? అనుసరించాల్సిన ప్రాధాన్యత క్రమం, నిల్వ తదితర అంశాలపై అధికారులతో సీఎం వైఎస్ జగన్ చర్చించారు. వ్యాక్సిన్ పంపిణీలో ఎలాంటి విధానం అనుసరించాలన్న అంశంపై అధికారుల అభిప్రాయాలను సీఎం జగన్ అడిగి తెలుసుకున్నారు. మారుమూల ప్రాంతాలలోని ప్రజలకు వ్యాక్సిన్ అందేలా ఏర్పాట్లు చేయాలని సీఎం ఆదేశించారు.
కరోనా వైరస్‌ను ఎదుర్కొనే విషయంలో ప్రారంభంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సరైన విధానం అవలంభించలేకపోయాయి. వైరస్ వ్యాప్తి, దాని ప్రభావంపై సరైన అంచనాలు లేక విధించిన లాక్‌డౌన్ వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వలస కూలీలు, పల్లెల నుంచి నగరాలకు ఉపాది కోసం వెళ్లిన వారు తిరిగి ఇళ్లకు వచ్చేందుకు అష్టకష్టాలు పడ్డారు. కరోనా వైరస్‌కు వచ్చిన ఔషధం కూడా సామాన్య ప్రజలకు అందుబాటులో లేకుండా పోయింది. కోవాగ్జిన్ ఔష«ధం బ్లాక్ మార్కెట్‌కు వెళ్లిపోయింది. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో వ్యాక్సిన్ పంపిణీపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ముందస్తుగానే సిద్ధం అవుతున్నాయి. జనవరి, ఫిబ్రవరిలలో వ్యాక్సిన్ వచ్చే అవకాశాలు కన్పిస్తుండడంతో ఆ లోపు పంపిణీపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సన్నద్ధమవుతున్నాయి.