iDreamPost
iDreamPost
కరోనా వైరస్ దేశంలోకి వచ్చిందని తెలియగానే లాక్ డౌన్ పెట్టారు. సమూహాల వారీగా పరీక్షలు నిర్వహించారు. చికిత్స ప్రారంభించి క్వారంటైన్, ఐసోలేషన్ అంటూ కరోనా వైరస్ వ్యాప్తి విస్తృతం కాకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విస్తృత చర్యలు చేపట్టాయి. ఇదంతా ప్రభుత్వ స్థాయిలో చేయదగ్గ పనులు. కానీ వ్యక్తిగతంగా ఆ వైరస్ బారిన పడకుండా ఎంతవరకు సన్నద్ధమయ్యారు అన్నదానిపై ప్రతి ఒక్కరూ దృష్టిపెట్టాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది.
తినే ముందు తప్పకుండా చేతులు కడుక్కోవడం అనే కాన్సెప్ట్ అంగనవాడి స్కూల్స్ స్థాయి నుంచి మొదలుపెడితే ఇప్పుడిప్పుడే జనబాహుళ్యంలో విస్తృతమౌతుంది. ఈ అంశాన్ని మనం గమనించవచ్చు. ఇంతవరకూ భోజనం చేసేటప్పుడు తప్పితే ఇంకా ఏదైనా తినేటప్పుడు చేతులు కడుక్కునే పరిస్థితులు తక్కువనే చెప్పాలి. కానీ కరోనా తర్వాత జీవనంలో ఇప్పుడు తప్పకుండా చేతులు కడుక్కోవడం పై దృష్టి పెట్టక తప్పని పరిస్థితి. అలాగే ఇప్పుడు, భవిష్యత్ లో కరోనా మహమ్మరుల నివారణ చర్యల్లో భాగంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. మాస్కులు ధరించడం, సమూహాల్లోకి వెళ్లకపోవడం, అనవసరంగా ఏ వస్తువులు తాకకుండా ఉండటం, సబ్బు నీళ్ళు తో చేతులు శుభ్రం చేసుకోవడం వంటి వాటిని కూడా భవిష్యత్తులో ఆచరించక తప్పని పరిస్థితి.
వీటిపై అవగాహన పెంచుకోకు పోతే మనకు మనం గానే వాటి బారిన పడే అవకాశాలు పెంచుకున్న వాళ్లమవుతాం అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆయా అంశాలపై విస్తృత ప్రచారం ద్వారా మాత్రమే ప్రజలకు అర్థమయ్యే విధంగా చేయడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ ప్రజల బాధ్యత కూడా ఎంతో ఉంటుంది. చెడు వ్యసనాలు ఉంటే అతడు లేదా అతడి కుటుంబం మాత్రమే నష్టపోతుంది. కానీ ఈ సామాజిక అలవాట్లకు మాత్రం అలవర్చుకోకపోతే మొత్తం సమాజానికి నష్టం ఏర్పడుతుంది.
ప్రభుత్వాలు, వైద్యులు చేస్తున్న సూచనలు పట్ల ఏమాత్రం నిర్లక్ష్యం వహించకుండా ఉండాల్సిన బాధ్యత మనపై ఉంది. సినిమాలో ముఖేష్ యాడ్ చూస్తూ దమ్ము కొట్టే మాదిరిగా కాకుండా కరోనాను అడ్డుకోవడంలో వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరు తప్పనిసరిగా స్వీయ నియంత్రణ, శుభ్రత పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.