Idream media
Idream media
రాష్ట్రంలో వ్యక్తిగత కక్షలతోనో, లేదా అనూహ్యంగా సాధారణ వ్యక్తుల మధ్య జరిగే దాడులను అధికార పార్టీ వైసీపీకి, ఆ పార్టీ నేతలకు ఆపాదించి రాజకీయ, కుల పరమైన ఆరోపణలు తెలుగుదేశం పార్టీ చేస్తోంది. విశాఖలో నూతన్ నాయుడు ఇంట్లో పని మనిషికి శిరోముండనం చేసిన ఘటనను టీడీపీ రాజకీయం చేసింది. ఈ ఘటనలో నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ తరలించినా ప్రభుత్వం లక్ష్యంగా టీడీపీ విమర్శలు చేసింది.
తాజాగా చిత్తూరు జిల్లాలో జడ్జి రామకృష్ణ తమ్ముడుపై ఎవరో దాడి చేస్తే.. అది మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పనే అంటూ టీడీపీ నేతలు హంగామా చేస్తున్నారు. జడ్జి రామకృష్ణకు స్థానికంగా ఉండే వారికి మధ్య జరుగుతున్న వివాదంలోనూ మంత్రి పెద్దిరెడ్డిని చంద్రబాబు అండ్ కో లాగేందుకు ప్రయత్నాలు చేసింది. అనుకూల మీడియా కూడా కథనాలు వండివార్చింది. ఈ క్రమంలో జడ్జి రామకృష్ణ తమ్ముడిపై టీడీపీ కార్యకర్త ప్రతాప్ రెడ్డి దాడి చేశారని పోలీసులు తేల్చారు.
అయితే ఈ లోపే నిజా నిజాలు తెలుసుకోకుండానే చంద్రబాబు అండ్ కో పెద్దిరెడ్డిని లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేసింది. ఆ పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య.. దళితులంటే వైసీపీకి అసహ్యం అంటూ తనదైన శైలిలో విమర్శలు చేశారు. టీడీపీ నేతలకు తోడు.. అనుకూల మీడియా ఛానెళ్లలో ప్రభుత్వమే లక్ష్యంగా డిబేట్లు పెట్టి దళితులపై ఏదో జరిగిపోతోందనేలా చిత్రీకరించాలనే ప్రయత్నాలు సాగుతున్నాయి.
వీటన్నిటికి అడ్డుకట్ట వేసేలా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చంద్రబాబుకు బహిరంగ సవాల్ విసిరారు. జడ్జి రామకృష్ణ సోదరుడు రామచంద్రపై దాడి చేసింది తన పార్టీ కార్యకర్త అని నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్ చేసి బాబు అండ్ కో నోరు మూయించారు. రెండు రోజుల నుంచి ఈ విషయంపై రాజకీయం చేస్తున్న చంద్రబాబు, టీడీపీ నేతలు మంత్రి పెద్దిరెడ్డి సవాల్‌ను చంద్రబాబు స్వీకరిస్తారా..? లేదా ఎప్పటిలాగానే మరో కొత్త అంశం దొరికే వరకూ మౌనం పాటిస్తారా..? చూడాలి.