iDreamPost
android-app
ios-app

పవన్ కల్యాణ్ ఉచిత సలహాలు

పవన్ కల్యాణ్ ఉచిత సలహాలు

“సంపాదించిన సొమ్ముతో ఉచిత పథకాలు పెట్టండి, అప్పులు తెచ్చి కాదు” – ట్విట్టర్లో పవన్ కల్యాణ్. 

మొన్న ఎన్నికల్లో జనసేన వాగ్ధానాలలో కొన్ని, 

రైతులకు ఎకరాకి ఎనిమిది వేల రూపాయలు, 

వయోధిక రైతులకు, చేతివృత్తుల వారికి, మత్స్యకారులకు 5000 రూపాయల నెలవారీ పెన్షన్, 

కుటుంబ పరిమాణం ప్రకారం ఉచితంగా గ్యాస్ సిలిండర్లు;

ప్రతి సంవత్సరం ఆడపడుచులకు వారి వారి పండగలకు 10,001 రూపాయల సారె, 

పాక్షిక దివ్యాంగుల కుటుంబాలకు 5000 రూపాయలు, పూర్తి దివ్యాంగుల కుటుంబాలకు 10000 రూపాయల పెన్షన్, ప్రత్యేక ఇళ్ళు, సంరక్షణ కేంద్రాల ఏర్పాటు ,

దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా తయారుచేయబడిన స్కూటర్ల ఉచిత పంపిణీ….

(ఇలాంటి సంక్షేమ పథకాలు ఇంకొన్ని)

మన దురదృష్టం కొద్దీ పవన్ కల్యాణ్ ముఖ్యమంత్రి అవ్వలేదు కానీ లేకపోతే ఈ సంక్షేమ పథకాలకు నిధుల కోసం ఎంత కష్టపడి సంపాదించే వారో ?! 

పాత తెలుగు సినిమాల్లో హీరోలు ఇంటింటికీ వెళ్లి ఉదయాన్నే పాలు పోసి, కాసేపయ్యాక పేపర్లు వేసి, ఇంకొంచెం సేపయ్యాక టిఫిన్లు పార్సెల్ ఇచ్చి, బడి వేళకు రిక్షాలో పిల్లల్ని తీసుకెళ్లి, మధ్యాహ్నం సమయానికి పెద్ద వాళ్లకు టిఫిన్ బాక్సులు చేర్చి, మధ్యలో ఖాళీగా ఉండకుండా విస్తరాకులు కుట్టి, గోడల మీద పిడకలు కొట్టి రెండు మూడు రీళ్లు చెమటోడ్చి కష్టపడి సంపాదించి నాలుగో రీల్లో కోటీశ్వరులైపోతుండేవారు. 

అలాగే పవన్ కల్యాణ్ కూడా ఫామ్ హౌస్ లో స్వయంగా వ్యవసాయం చేసి పండించిన మామిడిపళ్ళు అమ్మి, మొన్న వర్షంలో గొడుగు వేసుకుని మరీ వెళ్లిన తన గోశాలలోని ఆవుల పాలనుగత ప్రభుత్వ పాలనలో మూతపడిపోగా మిగిలిన డైరీలకు అమ్మి, సంక్రాంతి గొబ్బెమ్మల కోసం పల్లెలకు ఆ ఆవుల పేడ సప్లై చేసి, ఆన్లైన్లో పిడకలు అమ్మి సంపాదించి … రూపాయి రూపాయి కూడబెట్టి మరీ సంక్షేమ కార్యక్రమాల కోసం నిధులు తెచ్చేవాడు. అవీ సరిపోకపోతే ఒక వైపు రాష్ట్రాన్ని పరిపాలిస్తూనే మరో వైపు పార్ట్ టైం రాష్ట్ర యువతకు ‘మార్షల్ ఆర్ట్స్’ తరగతులు నిర్వహించి, ఆ బోధనా రుసుముతో రాష్ట్ర భవిష్యత్తుకు బంగారు బాటలు వేసేవాడు. 

—  S.G. RAVURI