మైక్రోసాఫ్ట్ కార్ప్ ఎక్జిక్యూటివ్ చైర్మన్, సీఈఓ సత్య నాదెళ్ల కుమారుడు జైన్ నాదెళ్ల కన్నుమూశారు. 26 సంవత్సరాల జైన్ నాదెళ్ల సెరిబ్రల్ పాల్సీ అనే అరుదైన వ్యాధితో జన్మించారు. జైన్ మరణించినట్లు మైక్రోసాఫ్ట్ కంపెనీ ఉద్యోగులకు ఇమెయిల్ ద్వారా తెలియజేసింది. అంతేకాక ఈ ఇమెయిల్లో సత్య నాదెళ్ల కుటుంబం కోసం ప్రార్థించాలని కూడా ఉద్యోగులను కోరారు.
2014లో సీఈఓగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుండి, సత్య నాదెళ్ల వికలాంగ వినియోగదారులకు మెరుగైన సేవలందించేలా కంపెనీ ఉత్పత్తుల రూపకల్పనపై దృష్టి సారించారు. సత్య నాదెళ్ల- అనుపమ దంపతులకు ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
అసలు ఏమిటీ సెరిబ్రల్ పాల్సీ?
ఈ సెరిబ్రల్ పాల్సీ చిన్న పిల్లలకు శాపంగా మారే ఒక రుగ్మత. కొన్ని కేసుల్లో ఇది ప్రాణాంతకం కాకపోవచ్చు కానీ చికిత్స లేని ఓ ఆరోగ్య స్థితి. దీన్ని వ్యాధి అని కూడా అనలేం. ఎందుకంటే మెదడులో ఒక భాగం పనిచేయకపోవడం వల్ల ఈ పరిస్థితి వస్తుంది. ప్రతి వెయ్యి మంది పిల్లల్లో అయిదు మందిలో ఈ సెరిబ్రల్ పాల్సీ కనిపిస్తోందని చెప్పవచ్చు. మెదడులో సెరెబ్రమ్ అనే భాగం దెబ్బతినడం వల్ల ఈ సెరిబ్రల్ పాల్సీ కలుగుతుంది. దీన్ని మెదడు పక్షవాతం అని కూడా అంటుంటారు వైద్యులు. దీనికి ఎలాంటి చికిత్స లేదు సరికదా ఎందుకు ఈ పరిస్థితి వస్తుందని చెప్పడానికి కూడా సరైన ప్రామాణికం లేదు.