iDreamPost
iDreamPost
ప్రతియేటా ఈ సీజన్‌లో ఉల్లి ధరలు పెరిగిపోతుంటాయి. అయితే గత రెండుమూడేళ్ళుగా ఈ తీరు ఎక్కువగానే కొనసాగుతోందనే మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఇందుకు ప్రధాన కారణంగా వాతావరణమేనని తేల్చేస్తున్నారు. స్థానికంగా పంట దిగుబడులు సక్రమంగా అందితే ఈ స్థాయిలో ధరల పెరుగుదల ఉండదని వివరిస్తున్నారు. భారీ వర్షాల కారణంగా పండిన పంట మార్కెట్‌కు వచ్చేలోపే కుళ్ళిపోయిందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఉల్లి ధరలు భారీగా పెరుగుతున్నాయని వివరిస్తున్నారు.
అయితే ప్రస్తుతం పండుగల సీజన్ ప్రారంభమైంది. త్వరలోనే ఉభయ తెగులురాష్ట్రాల్లోనూ కార్తీక మాసం సందడి కూడా ఉంటుంది. ఈ కాలంలో ప్రజలు శాఖాహారం వైపు మొగ్గుచూపుతారు. ఈ లెక్కన ఉల్లితోపాటు, కూరగాయల ధరలు కూడా ఆకాశాన్నంటే అవకాశాలు మెండుగా ఉన్నాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. కార్తీకమాసం ఉల్లి వాడకం కొంత మేర తగ్గినప్పటికీ శాఖాహారంవైపు ప్రజలు మారడంతో ఇప్పుడున్న ధరల డిమాండే కొనసాగేందుకు ఎక్కువ అవకాశాలుంటాయంటున్నారు.
దేశంలో ధరల నియంత్రణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నడుంబిగించాయి. గత నెలలో కేంద్ర ప్రభుత్వం ఉల్లి ఎగుమతులపై ఆంక్షలు పెట్టడంతో పాటు, దిగుమతులకు ద్వారాలు తెరించింది. హోల్‌సేల్ వ్యాపారులు తమ దగ్గర స్టాక్ నిల్వ చేయకుండా కూడా చర్యలు తీసుకుంది. హోల్‌సేలర్స్ 25 టన్నులు, రిటైల్లు రెండు టన్నులు మాత్రమే నిల్వచేసుకునే విధంగా నిబంధనలు ప్రకటించారు. ఉల్లిని పండించే దేశాల నుంచి దిగుమతులకు అవకాశం ఇచ్చింది. అలాగే ఏపీ ప్రభుత్వం కేజీ రూ. 40లకు రైతు బజార్ల ద్వారా ప్రజలకు అందిస్తోంది. తద్వారా బహిరంగ మార్కెట్‌లో రోజురోజుకూ పెరిగిపోతున్న ధరలను నియంత్రించేందుకు చర్యలు చేపడుతున్నారు.
సాగు విధానంలో మార్పులతో..
ఉల్లిని సాగుచేసే విధానాల్లో వచ్చిన మార్పుల కారణంగా కూడా సరుకు త్వరగా పాడైపోతోందన్న అంచనాలున్నాయి. త్వరతిగతిన దిగుబడుల కోసం వినియోగిస్తున్న కొన్ని రకాల రసాయనిక ఎరువుల కారణంగా ఉల్లి నిల్వ ఉండే సమయం తగ్గిపోతోందని సంబంధిత రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు. గతంలో ఎక్కువ రోజులు ఉండే ఉల్లిపాయలు ఇప్పుడు త్వరగా పాడైపోవడానికి ఇది కూడా ఒక కారణంగా చెబుతున్నారు. ప్రస్తుతం పంట కొరత రావడానికి గల కారణాల్లో ఇది కూడా ఒకటంటున్నారు.
సుమారు నాలుగు నెలల పంట సమయం ఉండే ఉల్లి అక్టోబరు, డిసెంబరు, మార్చి నెలల్లో దిగుబడులు వస్తాయి. అయితే ఎక్కువ పంట విత్తన దశలోనే భారీ వర్షాలకు దెబ్బతింది. ఈ లోపు నిల్వ ఉంచిన సరుకు కూడా పాడైపోవడంతో కొరతకు కారణంగా అంచనా వేస్తున్నారు. ఒక పక్క పంట విస్తీర్ణం పెరుగుతున్నప్పటికీ విపరీత వాతావరణ పరిస్థితులు, నిల్వ సామర్ధ్యం తగ్గిపోవడం తదితర కారణాలతో ప్రస్తుతం ఉల్లికి డిమాండ్ పెరిగింది. అదే రీతిలో ధరలు కూడా పెరుగుతున్నాయి. దిగుమతుల ద్వారా ధరలను అదుపు చేసేందుకు ఎంత ప్రయత్నించినప్పటికీ స్థానిక పంట దిగుబడి వస్తే తప్ప బహిరంగ మార్కెట్‌లో ఉల్లి ధరలు క్రిందికి వచ్చే అవకాశాలు ఉండవని నిపుణులు చెబుతున్నారు.
ఇదిలా ఉండగా కూరగాయల మార్కెట్‌లో ప్రస్తుతం అత్యధిక ధరలు ఒక్క ఉల్లికే పరిమితం కాలేదు, చిక్కుళ్ళు, బంగళాదుంప, బీర, ఆనప, సొర తదితర కూరగాయలు ధరలు కూడా అధికంగా ఉంటున్నాయి. రానున్న రోజుల్లో కూరగాయలకు డిమాడ్ పెరిగే నేపథ్యంలో వీటి ధరలు ఇంకా అధికం అవుతాయన్న అంచనాలు ఉన్నాయి.