గ్రామ స్వరాజ్యానికి ఏడాది

ఏడు దశాబ్ధాలపైబడిన భారతదేశ స్వాతంత్య్రంలో మహాత్మా గాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం ఆంధ్రప్రదేశ్‌లో సాకారమైంది. సరిగ్గా ఏడాది కిందట ఆ మహాత్ముడి జయంతి రోజునే ఆంధ్రప్రదేశ్‌లో గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ ప్రారంభమైంది. రాజకీయ ఉద్ధండులు, దశాబ్ధాల పరిపాలన, రాజకీయ అనుభవం ఉన్న వారు చేయలేని పనిని వైఎస్‌ జగన్‌ అనే యువకుడు చేసి చూపించాడు. దేశం మొత్తం ఏపీ వైపు చూసేలా వినూత్నమైన విధానాన్ని ప్రవేశపెట్టారు. ప్రభుత్వ పాలనను గ్రామాల చెంతకు చేర్చారు.

ముందు చూపు ఉన్నవాడే సరైన నాయకుడవుతారంటారు. ఇలాంటి నాయకుడే సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి అని ఆయన పాలనను బట్టి తెలుస్తోంది. తాను ముఖ్యమంత్రి అయితే ప్రజలకు ఏమి చేయాలన్న దానిపై స్పష్టత. ఏమి చేస్తాననే విషయం ముందుగానే ప్రజల ముందు పెట్టారు. నవరత్నాలు, గ్రామ సచివాలయాలు.. ఇలా ప్రతి అంశాన్ని సీఎం జగన్‌మోహన్‌ రెడ్డి ఎన్నికలకు ముందే ప్రజలకు వివరించారు. తన ప్రజా సంకల్ప పాదయాత్రలో గ్రామ సచివాలయ వ్యవస్థ ఏర్పాటు, దాని పనితీరు, అక్కడ ఉద్యోగులు.. ఇలా ప్రతి అంశంపై ప్రజలకు క్షుణ్నంగా వివరించారు. అధికారంలోకి వచ్చాక చెప్పిన మాటలను ఆచరించి చూపారు.

సీఎంగా బాధ్యతలు చేపట్టిన మొదటి ఏడాదే గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థకు సీఎం వైఎస్‌ జగన్‌ శ్రీకారం చుట్టారు. 2019 మే 30వ తేదీన సీఎంగా బాధ్యలు స్వీకరించిన తర్వాత రెండున్నర నెలలకే స్వాతంత్య్రదినోత్సవం రోజున వాలంటీర్‌ వ్యవస్థను ప్రారంభించారు. గ్రామాల్లో ప్రతి 50 కుటుంబాలకు ఒకరు, పట్టణాల్లో ప్రతి 100 కుటుంబాలకు ఒకరు చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 2.70 లక్షల మంది వాలంటీర్లను నియమించారు. ప్రభుత్వ పథకాలను వీరి ద్వారా ప్రజలకు అందిస్తున్నారు. ఆ తర్వాత మరో నెలనర్నకే గ్రామ, వార్డు సచివాలయాలు ప్రారంభించారు. మొత్తం 15,003 గ్రామ, వార్డు సచివాలయాలను ఒకే సారి ప్రారంభించారు. ఇందులో 1,25, 803 మంది ఉద్యోగులను శాశ్వత ప్రాతిపదికన నియమించారు. మరో 15 వేల మందిని నియమించేందుకు ప్రస్తుతం పరీక్షలు నిర్వహిస్తున్నారు. మొత్తం మీద గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందడమే కాకుండా 4.20 లక్షల మందికి ఉద్యోగాలు లభించాయి.

560కి పైగా సేవలను సచివాలయాల ద్వారా గ్రామాల్లోనే అందిస్తున్నారు. రేషన్‌కార్డు, పింఛన్, భూ సమస్య.. ఇలా ఏదైనా సరే నిర్ణీత సమయంలో మంజూరయ్యేలా సీఎం జగన్‌ దిశానిర్ధేశం చేశారు. వార్డు సచివాలయాల్లో ఆరుగురు, గ్రామ సచివాలయాల్లో పది నుంచి 12 మంది ఉద్యోగులు వివిధ విభాగాలకు సంబంధించిన సేవలను ప్రజలకు అందిస్తున్నారు. గ్రామ సచివాలయానికి అదనంగా రైతుల, పాడి రైతులకు సేవలందించేందుకు వైఎస్సార్‌ రైతు భరోసా కేంద్రాలను కూడా ప్రారంభించారు. ప్రస్తుతం గ్రామ, వార్డు సచివాలయాలకు, రైతు భరోసా కేంద్రాలకు శాశ్వత భవనాలను నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్‌ నాటికి వైఎస్సార్‌ విలేజ్‌ క్లినిక్‌ పేరిట ఆస్పత్రిని కూడా ఏర్పాటు చేయనున్నారు. దీంతోపాటు గోదాములు, శీతలగిడ్డంగులు కూడా గ్రామ సచివాలయ ప్రాంగణంలోనే ప్రభుత్వం నిర్మిస్తోంది. వచ్చే ఏడాది ఇదే సమయానికి ప్రతి గ్రామంలో సచివాలయం, రైతు భరోసా కేంద్రం, విలేజ్‌ క్లినిక్‌లకు భవనాలు, గోదాము, శీతల గిడ్డంగులు అందుబాటులోకి రానున్నాయి.

Show comments