Idream media
Idream media
నివర్ తీవ్ర తుపాను తమిళనాడు, పుదుచ్చెరిలతోపాటు ఆంధ్రప్రదేశ్‌ను నిలువునా ముంచింది. ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాలు మినహా మిగతా పది జిల్లాపై నివర్ ప్రభావం చూపింది. పది జిల్లాల్లోనూ పంట నష్టం సంభవించింది. ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కర్నూలు, వైఎస్సార్ కడప జిల్లాల్లో ఎడతెరిపిలేని భారీ వర్షాలకు ఒంగోలు, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, కర్నూలు, కడప నగరాల్లోని పలు లోతట్టు ప్రాంతాల్లో వరద నీరు చేరింది. అక్టోబర్‌లో కురిసిన వర్షాలకు చెరువులు, కుంటలు నిడుకోవడం, వాగులు, వంకలు పొంగిపొర్లడంతో రహదారులు కొట్టుకుపోతున్నాయి.
రాయలసీమలో పలు జాతీయ, రాష్ట్ర రహదారులు కోతకు గురయ్యాయి. రేణిగుంట – కడప జాతీయ రహదారి కోతకు గురైంది. తిరుపతి – మదనపల్లె, కుప్పుం – పలమనేరు, పుంగనూరు – ముళబాగల్, పుంగనూరు – బెంగుళూరు రహదారుల్లో చెట్టు నెలకొరిగాయి. పలు చోట్ల వర్షపు నీరు రహదారులపై ప్రవహిస్తోంది. తిరుమల మాడ వీధుల్లో మోకాలు లోతు నీరు నిలిచిపోయింది. కపిలితీర్థం నిండుకోవడంతో చుట్టుపక్కల కాలనీలు వరద తాకిడికి గురయ్యాయి.
కుండపోత వర్షం..
నివర్ తుపానుతో ప్రకాశం, నెల్లూరు, సీమ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో కుండపోత వర్షం పడింది. నెల్లూరు జిల్లా వెంకటగిరిలో అత్యధికంగా 30.4 సెంటీ మీటర్ల వర్షం కురిసింది. పొదలకూరులో 27.3 సెంటీమీటర్లు, విడవలూరులో 23.5, చిల్లకూరులో 22.3, నెల్లూరు సిటిలో 20.9, చిత్తూరు జిల్లా ఏర్పేడులో 19.3, ప్రకాశం జిల్లా కొత్తపట్నంలో 18.6, కడప జిల్లా రాయచోటిలో 15.6 సెంటీమీటర్ల వర్షం పడింది.
అన్నదాతపై నివర్ పిడుగు..
అక్టోబర్‌లో కురిసిన వర్షాలతో ఖరీఫ్ పంటలు దెబ్బతిని కోలుకోలేని స్థితిలో ఉన్న రైతన్నను తాజా నివర్ తుపాను నడ్డివిరిచింది. ఉభయగోదావరి జిల్లాల నుంచి రాయలసీమ వరకూ నివర్ ప్రభావంతో పంటలు దెబ్బతిన్నాయ. వరి, మినుము, పత్తి, మిరప, శెనగ, వేరు శెనగ, పొగాకు, కంది, ఉద్యానవన పంటలు భారీగా దెబ్బతిన్నాయి. వరి ఓదెలు నీట మునిగియాయి. వెన్నుకు వచ్చిన వరి చేలు నేలకొరిగాయి. పత్తి, మిరప, పొగాకు చేలు ఉరకెత్తుతున్నాయి. కంది పూత రాలిపోయింది. మినుము, శెనగ పంటలు నీట మునిగాయి. దాదాపు వెయి కోట్ల రూపాయల మేర పంట నష్టం వాటిల్లించదని అధికారులు ప్రాథమికంగా నిర్థారించారు. ఈ మొత్తం భారీగా ఉండే అవకాశం ఉంది.
సీఎం భరోసా..
వర్షం తగ్గిన వెంటనే పంట నష్టంపై అంచనాలు వేయాలని సీఎం వైఎస్ జగన్ ఇప్పటికే అధికారులను ఆదేశించారు. పంట నష్టపోయిన రైతులను వెంటనే ఆదుకుంటామని సీఎం జగన్ భరోసా ఇచ్చారు. వలంటీర్లు, ప్రతి గ్రామ సచివాలయంలో వ్యవసాయ సహాకుడు, వీఆర్‌వో ఉండడంతో పంట నష్టం వివరాలను వేగంగా సేకరించే అవకాశం ఉంది. ప్రతి రైతుకు సాయం చేస్తామని సీఎం వైఎస్ జగన్ హమీ ఇచ్చారు.