iDreamPost
iDreamPost
అందరికీ గుర్తుండే ఉంటుంది. నోటిపికేషన్ వచ్చింది. నామినేషన్ల ప్రక్రియ కూడా పూర్తయ్యింది. కొన్ని ఏకగ్రీవాలు కాగా, ఎన్నికల ప్రచారాలు కూడా ప్రారంభమయ్యాయి. రేపో మాపో ఎన్నికల వ్యవహారం ముగిసిపోతుందనే అంచనాలు ప్రజలున్నారు. సరిగ్గా 12 రోజుల్లోనే ప్రక్రియ మొత్తం పూర్తయ్యేందుకు యంత్రాంగం సిద్దమయ్యింది. కానీ హఠాత్తుగా ఎన్నికల సంఘం అధికారిగా ఉన్న నిమ్మగడ్డ రమేష్ కుమార్ మనసు మార్చుకున్నారు. తన ఆలోచనలకు అనుగుణంగా నిర్ణయం తీసుకున్నారు. కనీసం ప్రభుత్వానికి సమాచారం కూడా ఇవ్వకుండా స్థానిక సమరం వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. ఇదంతా మార్చి 15 నాడు జరిగింది. ఈరోజుకి ఏపీలో కరోనా బాధితులు కేవలం ఇద్దరు.
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో కరోనా యాక్టివ్ కేసులు సుమారు 37వేలు. అనేక మంది వివిధ ఆసుపత్రల్లో చికిత్స పొందుతున్నారు. అప్పట్లో కరోనా కారణంగా ఎన్నికలు వాయిదా వేసిన నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఇప్పుడు మళ్లీ మనసు మార్చుకుంటున్నారు. తాము ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉన్నామని చెబుతున్నారు. ఎన్నికల నిర్వహణకు నిధులు ఇప్పించాలని ప్రభుత్వాన్ని గాకుండా ఏకంగా హైకోర్ట్ ని ఆశ్రయించారు. సహజంగా ఏదయినా సమస్య వచ్చినప్పుడు తొలుత ప్రభుత్వంతో మాట్లాడి పరిష్కరించుకోవడం ఓ పద్ధతి. కానీ తమకు ఏది కావాల్సి వచ్చినా హైకోర్ట్ ని ఆశ్రయించడం ఏపీలో మొదలయిన ఆనవాయితీ.
అంటే మార్చిలో కేసులు లేనప్పుడు ఎన్నికలు నిర్వహించడం కష్టం అని ప్రకటించిన ఎన్నికల అధికారి ఇప్పుడు ఎన్నికల కోసం ఆతృత పడుతున్న తీరు ఆసక్తిగా కనిపిస్తోంది. నాడు ఎన్నికలను వాయిదా వేయడాన్ని సమర్థించిన వాళ్లే ఇప్పుడు ఎన్నికలను ఎందుకు జరపరని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం మాత్రం అప్పుడే ఎన్నికలు జరిపి ఉంటే కరోనా విపత్తు వేళ ప్రజా ప్రతినిదుల పాత్ర పెరిగి ఉండేదని, స్థానిక ఎన్నికలు మరింత సమర్థవంతంగా చొరవ చూపడానికి ధోహదపడేదని చెప్పింది. దానికి హైకోర్ట్ అంగీకరించకపోవడంతో సుప్రీంకోర్ట్ కి వెళ్లింది. ఎన్నికల సంఘం ప్రభుత్వంతో సంప్రదించకుండా నేరుగా నిర్ణయం ప్రకటించడాన్ని తప్పుబడుతూనే, వాయిదాని సమర్ధించడంతో సైలెంట్ గా ఉంది.
అప్పుడు నై నై అన్న వాళ్లే ఇప్పుడు సై సై అనడం విచిత్రంగా కనిపిస్తోంది. కానీ రాజకీయ ప్రయోజనాలు తప్ప రాష్ట్ర ప్రజలు, వారి పరిస్థితులు ఎన్నికల సంఘం బాధ్యులకి పట్టడం లేదని అర్థమవుతోంది. తాజా కోర్టు కేసులో కూడా ప్రభుత్వం తరుపున మాట్లాడిన న్యాయవాది సదరు పిటీషన్ ను తీవ్రంగా తప్పుబట్టారు. రెండు గంటల్లోగా నిధులు అందిస్తామని ఇలాంటి పిటీషన్లు విచారించకుండా కొట్టివేయాలని కోరారు. దానిని బట్టి ఎన్నికల సంఘం ద్వారా రాజకీయాలు నడుపుతున్న తీరు మరోసారి బట్టబయలు అవుతోంది. బాబు అండ్ కో రాజ్యాంగ వ్యవస్థలను పూర్తిగా దుర్వినియోగం చేస్తున్నట్టు ప్రజలకు అర్థమవుతోంది.