iDreamPost
iDreamPost
సంక్షేమం నేరాలను అరికట్టడానికి సరైన విధానమని అంతర్జాతీయంగా చాలా మంది చెబుతున్నారు. అమెరికాలోనూ, రెండేళ్ల క్రితం 18 దేశాల్లోనూ నిర్వహించిన అధ్యయనం నేరాలకు, సంక్షేమానికి మధ్య గట్టి బంధముందని, ప్రభుత్వం చురుగ్గా సాయం చేస్తే నేరాలు కట్టడి అవుతాయని తేలింది. సంక్షేమ పథకాలను నిరంతరాయంగా కొనసాగిస్తే, వాళ్లలో పనిచేసే శక్తితగ్గడం కన్నా, నేరాలకు పాల్పడే అవకాశాలు ఎక్కువగా తగ్గుతాయన్నది నివేదిక సారాంశం. ఒక్క మాటలో సంక్షేమం మీద ఖర్చుచేస్తే క్రైమ్స్ తగ్గుతాయి. సమాజం బాగుంటుంది.
అమెరికాలో సప్లిమెంటల్ సెక్యూరిటీ ఇన్ కమ్(Supplemental Security Income -SSI) 1972 నుంచి అమలవుతున్న సంక్షేమకార్యక్రమం. ఈ పథకంలో, వికలాంగులైన పిల్లలకు, పెద్దవాళ్లకూ డబ్బునిస్తారు. పిల్లలకైతే వాళ్లకున్న వైకల్యం, వాళ్ల పేరెంట్స్ ఆదాయం మీద ఆధారపడి ఉంటుంది. 18 ఏళ్లుదాటిన తర్వాతకూడా, వాళ్లకు తగిన ఆదాయం లేకపోతే, నగదు ఇస్తూనే ఉన్నారు. కాని 1996 తర్వాత వాళ్ల ఆరోగ్యపరిస్థితిని సమీక్షించారు. ఆమేరకు పథకంలో మార్పులు చేశారు.
దానివల్ల, అప్పటిదాకా నగదును అందుకున్న వాళ్లలో 40శాతం మంది అనర్హులైయ్యారు. వాళ్లలో అలజడి. ఆ డబ్బును ఎలా సంపాదించాలి? ఎస్ఎస్ఐ డేటాను క్రిమినల్ జస్టిస్ అడ్మినిస్ట్రేటీవ్ రికార్డ్స్ సిస్టమ్ తో పోల్చిచూశారు. నగదును అందుకోని వాళ్లలో 60శాతం మేర, జైలుకెళ్లే నేరాలు నమోదైయ్యాయి. అందులో ఎక్కువ డబ్బు సంబంధించిన నేరాలే. రెండు దశాబ్ధాలకాలంలో నేరాల రేటు 20శాతం మేర పెరిగింది. ఆదాయంలేదు, ప్రభుత్వ సంక్షేమ పథకం అందడంలేదు. అందుకే దొంగతనం, దోపిడీ, ఫోర్జరీ, ఆడవాళ్లయితే వ్యభిచారం వంటి నేరాలు పెరిగాయి.
పేద కుటుంబాలకు ప్రభుత్వం నుంచి సాయం లేకపోతే, ఎలాగైన సంపాదించలన్న తీవ్రమైన కోరిక పెరుగుతుంది. అందువల్ల దొంగతనాలు పెరుగుతాయి. డబ్బు కోసం ఏదైనా చేయడానికి సిద్ధమవుతారని పరిశోధకులు అంటున్నారు. చికాగో యూనివర్సిటీకి చెందిన మనాసి దేశపాండే(Manasi Deshpande University of Chicago , మిచిగన్ యూనివర్సిటీ పరిధోకులు మైఖేల్ జి.ముల్లర్-స్మిత్ (Michael G. Mueller-Smith, University of Michigan )నేరానికి, సంక్షేమానికి మధ్యనున్న సంబంధం గురించి అధ్యయనం చేశారు.
సంక్షేమం పెరిగితే?
అలాగని అందరూ నేరాలకు పాల్పడ్డారని కాదు. పోయిన ఆదాయాన్ని సమకూర్చుకోవడానికి, కొందరు ఎక్కువగా పనిచేశారు. కాని మరికొందరు మాత్రం క్రిమినల్స్ అయ్యారు. మొత్తం లేక్కలువేస్తే, ప్రభుత్వ పథకం అమలు వల్ల అయ్యే ఖర్చుకన్నా, జైళ్లు, పోలీస్ స్టేషన్లు, కేసులు, కోర్టులకైయ్యకే ఖర్చు ఎక్కువ అని తేలింది.
పేదలకు, సామాన్యులకు ప్రభుత్వం ఆర్ధిక సాయం చేయకపోతే, నేరప్రవృత్తిని పెంచినవాళ్లే అవుతారు. సంక్షేమం మీద అయ్యే ఖర్చుకన్నా, శాంతి భద్రతల మీద పెట్టే ఖర్చు చాలా ఎక్కువ అవుతుంది. సమాజంలోనూ అలజడి పెరుగుతుంది. ఇది మరింత చేటు చేస్తుంది.
సంక్షేమానికి నేరాలకు మధ్య సంబంధముందని తేల్చిన అధ్యయనం ఇది ఒక్కటేకాదు. 2008లో 12 అమెరికా నగరాల మీద చేసిన పరిశోధనకూడా ఇదే సాక్ష్యమిచ్చింది. ఈ నగరాల్లో కనీసం 10శాతం మంది ప్రభుత్వ సాయం మీదనే ఆధారపడ్డారు. వాళ్లకు సంక్షేమకార్యక్రమాలను ఆపినా, వాళ్లను ఆ జాబితా నుంచి తొలగించినా, ఆ తర్వాత క్రైమ్ రేటు పెరుగుతోంది.
అంతర్జాతీ అనుభవాలు ఏం చెబుతున్నాయి?
18 దేశాల్లో 2020లో నిర్వహించిన అధ్యయనం ప్రకారం, సంక్షేమ దేశాల్లో నేరాలు తక్కువగా ఉన్నాయి. వాళ్లకు నగదు బదిలీ పథకం గొప్పగా ఉపయోగపడుతోంది. కుటుంబ తగాదాలు కూడా తక్కువగా నమోదువుతున్నాయి. అసలు నేరానికి కారణం ఏంటి? ఆదాయం లేకపోవడమేకదా. అందువల్ల నేరాలను తగ్గించాలంటే సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయాలి.