Idream media
Idream media
ఆంధ్రప్రదేశ్‌లో మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణ తర్వాత నూతన మంత్రుల్లో కొంతమంది ఈ రోజు మంగళవారం తమ శాఖల బాధ్యతలు చేపట్టారు. సచివాలయంలోని వారి వారి ఛాంబర్లలో ప్రత్యేకపూజలు చేసి వారి స్థానాల్లో ఆశీనులయ్యారు. విద్యుత్, గనులు, అటవీ శాఖల మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బీసీ సంక్షేమం, సమాచార, ప్రసార, సినిమాటోగ్రఫి శాఖల మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, రవాణాశాఖ మంత్రి పినిపే విశ్వరూప్‌లు బాధ్యతలు చేపట్టారు.
ఇదీ పెద్దిరెడ్డి రాజకీయ నేపథ్యం..
పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రాజకీయ జీవితం విద్యార్థి దశ నుంచే ప్రారంభమైంది. 1974లో ఎస్వీయూ విద్యార్థి సంఘం అధ్యక్షుడుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 1985లో కాంగ్రెస్ పీలేరు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయారు. 1989లో పీలేరు నుంచి కాంగ్రెస్ తరపున ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1994లో ఓటమిపాలైన ఆయన పీలేరు నుంచి 1999, 2004 సంవత్సరాల్లో, పుంగనూరు నుంచి 2009లో విజయం సాధించారు. వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా 2014, 2019 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుపొందారు.
1995-2004 మధ్య తొమ్మిదేళ్లు చిత్తూరు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్నారు. 2009 నుంచి 2010 వరకు వైఎస్సార్, రోశయ్య మంత్రివర్గాల్లో అటవీశాఖ మంత్రిగా పనిచేశారు. 2012 నవంబర్‌లో రాజీనామా చేశారు. ఆ తర్వాతి ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ తరపున పుంగనూరు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2019లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మంత్రివర్గంలో రాష్ట్ర మంత్రిగా పనిచేశారు. తిరిగి రెండోసారి మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.
చెల్లుబోయిన రాజకీయ పయనం సాగిందిలా..
చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ 2001లో రాజోలు జెడ్పీటీసీ సభ్యుడిగా గెలుపొందారు. 2006లో తూర్పు గోదావరి జిల్లా జెడ్పీ చైర్మన్‌గా ఎన్నికయ్యారు. 2008–12లో తూర్పుగోదావరి డీసీసీ అధ్యక్షుడిగా, ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సభ్యుడిగా పనిచేశారు.2013లో వైఎస్సార్‌సీపీ కాకినాడ రూరల్ కో ఆర్డినేటర్‌గా నియమితులయ్యారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో కాకినాడ రూరల్‌లో ఓడిపోయారు. 2019లో రామచంద్రపురం నియోజకవర్గం నుంచి వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా గెలుపొందారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మంత్రివర్గంలో 2020 జూలై 24న మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణలో రెండోసారి అవకాశం దక్కించుకున్నారు.
మంత్రి విశ్వరూప్ రాజకీయ నేపథ్యం..
1987లో కాంగ్రెస్ నాయకుడిగా పినిపే విశ్వరూప్ రాజకీయాల్లోకి ప్రవేశించారు. 1998 ఉప ఎన్నికల్లో, 1999 సాధారణ ఎన్నికల్లో ముమ్మిడివరం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయారు. 2004లో అమలాపురం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2009లో ఎమ్మెల్యేగా ఎన్నికై మంత్రిగా పనిచేశారు. 2019లో వైఎస్సార్‌పీసీ తరపున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. తొలి కేబినెట్‌లో ఉన్న విశ్వరూప్‌ను రెండోసారి కూడా కేబినెట్‌లోకి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీసుకున్నారు.