‘పుర’పోరులో తటస్థులే కీలకం

నగర పాలక సంస్థల ఎన్నికలకు కోర్టు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చేసింది. దీంతో పాత నోటిషికేషన్‌ ప్రకారమే ఎన్నికలు నిర్వహించుకునేందుకు అనుమతులు లభించినట్లయింది. ఈ నేపథ్యంలో రాజకీయ పార్టీలు పట్టణాలవైపు దృష్టి సారించాయి. నిన్న మొన్నటి వరకు పల్లెల్లో తమ సత్తాను పరీక్షించుకున్న ప్రధాన రాజకీయ పక్షాలు ఇప్పుడు పట్టణాల బాట పట్టాయి.

ఎన్నికల వ్యూహాలు, ఓటరు నాడి, పోలింగ్‌ తదితర విషయాల్లో పల్లెలు, పట్టణాలకు స్పష్టమైన తేడాయే ఉంటుంది. ఏ పార్టీ ఓటు బ్యాంకు, ఆ పార్టీకి ఉండగా తటస్థ ఓటర్లే కీలకం అవుతారు. గెలుపును తటస్థ ఓటర్లే నిర్ణయిస్తారని రాజకీయ పరిశీలకులు స్పష్టం చేస్తుంటారు. మార్చి పదవ తేదీన 12 కార్పొరేషన్లకు, 75 మున్సిపాల్టీలకు ఎన్నికలు జరగన్నాయి. పార్టీ గుర్తులపైనే ఈ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటాయనడంలో సందేహం లేదు. నేరుగా ఆయా పార్టీల బలాబలాలు తేలే ఈ ఎన్నికలు అన్ని పార్టీలకు కీలకమేనని చెప్పాలి. గెలుపు మాదేనంటే.. కాదు మాదే.. అంటూ ఏ పార్టీకి ఆ పార్టీ ఢంకా బజాయించే అవకాశాన్ని మున్సిపల్‌ ఎన్నికలు ఆయా పార్టీలకు ఇవ్వకపోవచ్చు.

రాష్ట్ర విభజన తరువాత జరిగిన 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పట్టణ ప్రాంతాల్లో తెలుగుదేశం పార్టీవైపే ఓటర్లు మొగ్గు చూపారు. అయితే ఆ తరువాత పరిణామాల నేపథ్యంలో 2019లో వైఎస్సార్‌సీపీకి ఏకపక్షంగా అక్కడి ఓటర్ల మద్దతు లభించింది. పలు కీలక నగరాల్లో ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు మెజార్టీ సంఖ్యలోనే గెలుపొందారు. కొన్ని చోట్ల ఓటమి ఎదురైనప్పటికీ భారీగానే ఓట్లశాతం ఆ పార్టీ పొందగలిగింది. టీడీపీకీ కంచుకోటలుగా ఉన్న చోట్ల కూడా వైఎస్సార్‌సీపీ అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకోగలిగింది.

ప్రస్తుతం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు పల్లెల్లో వైఎస్సార్‌సీపీ హవాను చాటిచెప్పాయి. అదే ఒరవడి పట్టణాల్లో కూడా కన్పిస్తుందని అధికార పార్టీ నాయకులు చెబుతున్నారు. మరోవైపు పల్లెల్లో అనుసరించిన వ్యూహాన్నే పట్టణాల్లో కూడా అమలు చేసేందుకు ప్రధాన ప్రతిపక్షాలు సిద్ధమవుతున్నాయి. టీడీపీ,జనసేన, బీజేపీలు అప్రకటిత పొత్తులతోనే పోటీలో ఉంటాయని పరిశీలకుల అంచనా వేస్తున్నారు. ఈ తరహా పొత్తు పల్లెల్లో వికటించిన నేపథ్యంలోనే ఈ మూడు పార్టీలకు అత్యంత ఘోరమైన ఫలితాలే ఎదురయ్యాయి. పలు గ్రామ పంచాయతీల్లో వార్డు సభ్యులను సైతం పూర్తిస్థాయిలో నిలబెట్టలేదు కూడా. అయితే ప్రభుత్వంపై వ్యతిరేకత అన్న ప్రచారం పల్లెల్లో పనిచేయకపోగా, పట్టణాల్లోనైనా పనిచేస్తుందన్న ఆశతోనే ప్రతిపక్ష పార్టీలు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నాయి. వారి ప్రయత్నాలు ఏ మేరకు ఫలిస్తాయో ఈ నెల 14వ తేదీన తేలుతుంది.

Show comments