Idream media
Idream media
జిఎన్ రావు కమిటీ నివేదిక లో మూడు రాజధానులు ఏర్పాటు చేయాలన్న సూచనపై తొలిసారిగా మాజీ మంత్రి, తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ స్పందించారు. రాజధాని రైతుల ఆందోళనకు మద్దతుగా మంగళగిరిలో కాగడాల ప్రదర్శన నిర్వహించారు. నారా లోకేశ్‌తో పాటు రైతులు, కూలీలు, వివిధ ప్రజాసంఘాల నేతలు ప్రదర్శనలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ…‘‘ ఆ నాడు ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టనని జగన్ చెప్పారు. చంద్రబాబు అందరికీ ఆమోదయోగ్యమైన రాజధానిగా అమరావతిని ప్రకటిస్తే ..జగన్ కూడా మద్దతు తెలిపారు. అధికారంలోకి రాగానే జగన్ మాట తప్పి మడం తిప్పారు. ఇవాళ అమరావతికి జరిగే అన్యాయం రేపు అన్ని జిల్లాలకు జరుగుతుంది. ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టి..పబ్బం గడపాలనే జగన్ ఎత్తుగడ. రైతుల ఆందోళనలను పాలకులు ఎగతాళి చేస్తున్నారు. వైకాపా నేతలు రైతులగోడు వినేందుకు ఎందుకు రావట్లేదు?. 29 గ్రామాల ప్రజలు ఐక్యంగా ఉంటే ఎవరూ ఏమీ చేయలేరు. తెలుగుదేశం పార్టీ పూర్తి మద్దతుగా ఉంటుంది. మూడు ముక్కలుగా రాష్ట్రాన్ని విడగొట్టి బిస్కెట్ విసిరినట్లు విసిరితే అభివృద్ధి ఎలా సాధ్యం. జీఎన్ రావు కమిటీ ఓ బోగస్ కమిటీ’’ అని లోకేశ్ విమర్శించారు.