ముసుగు మీడియా నియంత్రణలో యంత్రాంగం

మీడియా ముసుగులో ఓ వర్గం ప్రయోజనాల కోసం అర్థసత్యాలు , అసత్యాలు ప్రచారం చేస్తున్న వారిని కట్టడి చేసే పని ప్రారంభమయ్యింది. అందుకు తగ్గట్టుగా వివిధ సంస్థల వ్యవహారాలపై ఆరా తీస్తున్నారు. కరోనా సమయంలో కూడా కనికరం లేకుండా ప్రజలను పక్కదారి పట్టించే పనిలో ఉన్న వారిని కట్టడి చేసే ప్రయత్నాలు సాగుతున్నాయి. తాజాగా కర్నూలు జిల్లా నంద్యాలలో ఓ YouTube చానెల్ విలేకరితో పాటు అతని అనుచరులను అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. అయితే పోలీసులు చట్టపరమైన చర్యలకు పూనుకోగానే టీడీపీ రంగంలో దిగడం ఆశ్చర్యం కలిగిస్తోంది.

నాలుగు రోజుల క్రితం టీవీ5 మూర్తి మీద చర్యలు తీసుకుంటున్నారంటూ టీడీపీ సోషల్ మీడియా విభాగం పోస్టులు పెట్టింది. వుయ్ సపోర్ట్ మూర్తి అంటూ హ్యాష్ ట్యాగ్ తో ఆ పార్టీ కార్యకర్తలంతా క్యాంపెయిన్ కూడా చేశారు. ప్రభుత్వం నుంచి తనకు ఎటువంటి సమాచారం లేదని, కనీసం కేసు కూడా నమోదు కాలేదని మూర్తి చెబుతుండగా, అతన్ని అరెస్ట్ చేస్తున్నారంటూ టీడీపీ ముందస్తుగా ఎందుకు ఇలాంటి క్యాంపెయిన్ చేసిందనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

ఓ విలేకరి నిజంగా తప్పుడు వార్తలు ప్రసారం చేస్తే చర్యలు తీసుకునే అధికారం ఉంది, సుప్రీంకోర్ట్ ఆదేశాలు కూడా ఇటీవలే వెలువడ్డాయి. కరోనా విషయంలో అధికారిక సమాచారం మాత్రమే ప్రసారం చేయాల్సి ఉంది. దానికి భిన్నంగా సాగుతున్న వారిపై చర్యలు అనివార్యంగా కనిపిస్తోంది. అలాంటి సమయంలో ఓ విలేకరి స్వయంగా తన మీద కేసు లేదని చెబుతుండగా, టీడీపీ ఎందుకు ఇలాంటి ప్రచారం చేసిందనే అనుమానాలు బలపడుతున్నాయి.

వాటికి కొనసాగింపు అన్నట్టుగా ఈసారి నేరుగా చంద్రబాబు రంగంలో దిగారు. ఆయన స్వయంగా ట్విట్టర్ లో ఓ పోస్ట్ చేశారు. ఏకంగా నలుగురు మీడియా ప్రతినిధులను కిడ్నాప్ చేశారంటూ కామెంట్ చేశారు. వారు చేసిన నేరమల్లా ప్రభుత్వ వైఫల్యాలను వెలుగులోకి తీసుకురావడమేనంటూ వ్యాఖ్యానించారు. పోలీసులు కిడ్నాప్ చేశారని అనడం ఓ మాజీ ముఖ్యమంత్రిగా ఆయనకు భావ్యమా కాదా అన్నది పక్కన పెడితే, పోలీసులు ఏదయినా కేసు విచారణ కోసం అదుపులోకి తీసుకుంటే దానిని కిడ్పాన్ అనడం ఏమిటోననే ప్రశ్నలు ఉదయిస్తున్నాయి.

అదే సమయంలో ఆ మీడియా ప్రతినిధుల పై కక్షగట్టి, అధికార దుర్వినియోగం చేస్తూ వేధిస్తున్నారంటూ మండిపడ్డారు. మైరా టీవీ అధినేత ఆచూకీ కోసం… వారి బంధువులు, మీడియాతో ఏమాత్రం సంబంధం లేని వెంకట కృష్ణ, విద్యార్ధి సవితా వరేణ్య, వారి డ్రైవర్ శ్రీనివాసరావులను పోలీసులతో కిడ్నాప్ చేయిస్తారా? ఏమిటీ అరాచకం? దీన్ని తెలుగుదేశం ఖండిస్తోంది. ప్రభుత్వం వెంటనే వారిని వారి కుటుంబాలకు అప్పగించాలి. ఈ విషయమై తెలుగుదేశం పార్టీ న్యాయపోరాటానికి సిద్ధం అవుతుంది. అవసరమైతే మానవహక్కుల సంఘాన్ని సైతం ఆశ్రయిస్తాం. ప్రజా హక్కులను హరిస్తామంటే చూస్తూ ఊరుకునేది లేదు. అంటూ చంద్రబాబు ఓ ప్రకటన కూడా విడుదల చేశారు.

దాంతో ఈ పరిణామాలు ఆసక్తిగా మారుతున్నాయి. ఓవైపు టీవీ5, మరోవైపు మరో డిజిటల్ చానెల్ లో ఏపీ ప్రభుత్వ అధికారి వాయిస్ అంటూ నర్సారావుపేటకు చెందిన అంజి అనే విలేకరి వ్యవహారం బయటపడగా, తాజాగా మైరా మీడియా సంస్థ మీద కూడా కేసు నమోదయినట్టు చంద్రబాబు చెబుతుండడం ఆసక్తిగా మారింది. ఈ విషయంలో పోలీసులు అధికారయుతంగా ఎటువంటి సమాచారం వెల్లడించలేదు. దాంతో ఏం జరుగుతుందనేది చర్చనీయాంశం అవుతోంది.

Show comments