Idream media
Idream media
తెలంగాణలో మొదలైన రాజకీయ భూ ప్రకంపనలు రోజుకో కొత్త మలుపు తిరుగుతున్నాయి. మాజీ మంత్రి ఈటల రాజేందర్ పై భూ కబ్జా ఆరోపణల వ్యవహారం చినికి చినికి గాలివానలా మారుతోంది. ప్రభుత్వం, ఈటల మధ్య కొనసాగుతున్న ఈ లొల్లి పై ఓ వైపు దుమారం రేగుతుండగా, తాజాగా కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి కొత్త వివాదాలను తెరపైకి తెచ్చారు.
ఈటల వ్యవహారం అలా ఉంటే, భూ కబ్జాలపై తాజాగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ తనయుడు కేటీఆర్, మరో మంత్రి మల్లారెడ్డి కూడా భూ కబ్జాలకు పాల్పడారంటూ కొత్త వివాదాలు తెరపైకి తెచ్చారు. దేవరయాంజల్ గ్రామం శామీర్ పేట మండలంలో సీతారామ స్వామికి గుడి మాన్యాలను 1531 ఎకరాలను ఆక్రమించుకున్నారని రేవంత్ ఆరోపిస్తున్నారు. అక్కడ మంత్రి కేటీఆర్ తో పాటు, మల్లారెడ్డి, నమస్తే తెలంగాణ ఎండీకి, కంటోన్మెంట్ బోర్డు చైర్మన్ సాదా కేశవ రెడ్డికి, తూంకుంట మున్సిపల్ వైస్ చైర్మన్ పన్నాల వీరారెడ్డి కి, అల్వాల్ సొసైటీ సింగిల్ విండో డైరెక్టర్ లతో పాటు మరి కొందరు ఆ నేతలను దేవుడి మాన్యాలను ఆక్రమించుకుని, అక్రమ నిర్మాణాలు చేపట్టారని తెలిపారు. ఈ మేరకు సేల్ డీడ్ లను మీడియా ముందు ప్రదర్శించారు. కేసీఆర్ కు చిత్తశుద్ధి ఉంటే, ఈటల రాజేందర్ ను బర్తరఫ్ చేసినట్లే కేటీఆర్ ను, మల్లారెడ్డి ని కూడా భర్తరప్ చేయాలని డిమాండ్ చేశారు.
సీఎం కేసీఆర్ అచ్చంపేట భూములకు సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకున్నారో, దేవరయాంజల్ భూములకు సంబంధించి కూడా విచారణకు ఆదేశించి చర్యలు చేపట్టాలన్నారు. ఓ నాడు అసెంబ్లీలో కేసీఆర్ మాట్లాడుతూ, అవినీతికి పాల్పడితే తన కొడుకునైనా శిక్షిస్తానని ప్రకటించారని, చిత్తశుద్ధి ఉంటే దేవుడి మాన్యాలపై నిజ నిర్ధారణ కమిటీని ఏర్పాటు చేయాలని సూచించారు. అన్ని రాజకీయ పక్షాల ముందు నిజం నిర్ధారించాలన్నారు. ప్రభువే అన్యాయం చేస్తే ప్రజలకు ఎలా చెప్పుకుంటారని ప్రశ్నిస్తున్నారు. తన నియోజకవర్గంలోని దేవుడి మాన్యాలకు సంబంధించిన సమస్య కాబట్టి ఓ ఎంపీగా భూ కబ్జాలపై ఫిర్యాదు చేస్తానన్నారు. దీనిపై బీజేపీ నేతలు బండి సంజయ్, కిషన్ రెడ్డిలు సైతం సీతారామ ఆలయానికి చెందిన భూములపై నిజాలను నిగ్గు తేల్చేందుకు నిలబడాలని సూచించారు. సీబీఐ విచారణకు ఆదేశించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలన్నారు.
Also Read : ఈటల భూ కబ్జా పర్వం సమాప్తం
నమస్తే తెలంగాణ దినపత్రిక సీఎం డీ దామోదర్ రావుకు తెలంగాణ పబ్లికేషన్స్ ప్రైవేటు లిమిటెడ్ పేరు మీద రెండు ఎకరాల 8 గుంటల స్థలం ఉందని, 437 సర్వే నెంబర్ లో కేటీఆర్ కు ఎక్కడైతే భూమి ఉందో, దామోదర్ రావుకు అక్కడే ఉందని పేర్కొన్నారు. మంత్రి మల్లారెడ్డి దేవర యాంజల్ 658 సర్వే నెంబర్ లో 7 ఎకరాలను ఆక్రమించి అద్భుతమైన ఫామ్ హౌస్ ను నిర్మించారంటూ సంబంధిత పత్రాలను మీడియాకు చూపించారు. మొత్తంమ్మీద ఈటలపై మొదలైన భూ ఆక్రమణల భాగోతం తెలంగాణలోని ముఖ్య నేతల చుట్టూ కూడా ఇప్పుడు తిరుగుతోంది. రేవంత్ ఆరోపణలపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో, ఈటల రాజేందర్ భవిష్యత్ నిర్ణయాలు ఎలా ఉండనున్నాయో తెలంగాణలో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.
ఇదిలా ఉండగా, మంత్రి వర్గం నుంచి భర్తరఫ్ తర్వాత తొలిసారి ఈటల మీడియాతో మాట్లాడుతూ, తెలంగాణ సమాజం అసహ్యించుకునే స్థితిలో తనపై ప్రచారం చేశారని మండిపడ్డారు. పార్టీ కోసం 19 ఏళ్ల పాటు చాలా కష్టపడి పని చేశానన్నారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామాకు సిద్ధమని.. హుజూరాబాద్ ప్రజలతో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటానని ఈటల తెలిపారు. చావునైనా భరిస్తా.. ఆత్మగౌరవాన్ని వదులుకోనన్నారు.
‘గతంలో పార్టీ ఆదేశిస్తే రాజీనామా చేసి మళ్లీ గెలిచా. 2008లో 16 మంది రాజీనామా చేస్తే ఏడుగురు గెలిచారు.. అందులో నేను ఒకడిని. శాసనసభాపక్ష నేతగా కేసీఆర్ నాకు అవకాశం కల్పించారు. ఉద్యమ నేతగా, మంత్రిగా పార్టీకి మచ్చ తెచ్చే ప్రయత్నం చేయలేదు. ఆనాడు కేసీఆర్ ప్రజలను, ధర్మాన్ని నమ్ముకున్నారు. ఆనాడు కేసీఆర్ ఎప్పుడూ డబ్బును నమ్ముకోలేదు. ఆనాడు కేసీఆర్ అణచివేతకు భయపడలేదు. అలాంటి కేసీఆర్ తన శక్తిని మొత్తం నాపై పెట్టారు. ఒక వైపు రెవిన్యూ, విజిలెన్స్, ఫారెస్ట్ అధికారులతో విచారణ జరిపించారు. ఇలాంటి చర్యలు కేసీఆర్ గౌరవాన్ని పెంచవు’’అంటూ ఈటల వ్యాఖ్యానించారు. ఆయన పార్టీకే కాకుండా ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేసే సూచనలు కనిపిస్తున్నాయి. అదే జరిగితే రాజకీయాల్లో మరింత కలకలం రేగుద్ది అనడంలో సందేహం లేదు.
Also Read : కేసీఆర్ టార్గెట్ గా ఈటల తూటాలు