iDreamPost
iDreamPost
గత శుక్రవారం చేపల మార్కెట్ ని తలపించేలా ఒకేసారి మూకుమ్మడిగా దాడి చేసిన చిన్న సినిమాలు ఏవీ కమర్షియల్ పరంగా చెప్పుకోదగ్గ ఫలితాలు సాధించలేకపోయాయి. డిఫరెంట్ కాన్సెప్ట్ తో ముఖచిత్రం, పంచతంత్రం లాంటివి ప్రత్యేకంగా అనిపించినా వాతావరణ పరిస్థితుల వల్ల జనం పెద్దగా థియేటర్లకు రాలేకపోయారు. ఇప్పుడు డిసెంబర్ 16 రానుంది. అవతార్ 2కు భయపడి చెప్పుకోదగ్గ రిలీజులేవి ప్లాన్ చేయలేదు. శాసనసభ అనే మల్టీ లాంగ్వేజ్ మూవీ ఒకటి వస్తోంది కానీ దాని మీద ఏమంత చెప్పుకోదగ్గ బజ్ లేదు. కెజిఎఫ్ కు సంగీతమందించిన రవి బస్రూర్ ఫోటోని ప్రమోషన్లలో వాడుతున్నారంటేనే హైప్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు
ఒకవేళ ట్రైలర్లు గట్రా ఏమైనా ఆసక్తిని పెంచితే ఓపెనింగ్స్ ని ఆశించవచ్చు. పసివాడి ప్రాణం అనే మరో చిన్న చిత్రం బరిలో ఉంది. చిరంజీవి బ్లాక్ బస్టర్ టైటిల్ అయితే పెట్టుకున్నారు కానీ పోస్టర్ చూస్తే మాత్రం ఏదో టీవీ కంటెంట్ లా అనిపిస్తోంది. తమిళ హీరో అరుణ్ విజయ్ నటించిన సినంని ఇక్కడ ఆక్రోశం పేరుతో డబ్ చేశారు. ఆ మధ్య ఏనుగుతో సోలో హీరోగా టాలీవుడ్ లో అడుగు పెట్టాడు కానీ దాన్నెవరూ పట్టించుకోలేదు. ఇదైనా మెరుగ్గా ఆడుతుందేమో చూడాలి. సుందరాంగుడు అనే మరో చిత్రం కూడా పోటీ పడుతోంది. ఇవన్నీ ఎలా ఉన్నా అందరి కళ్ళు మాత్రం అవతార్ 2 మీదే ఉన్నాయి. మూడు గంటల సరికొత్త ప్రపంచం కోసం ఎదురు చూస్తున్నాయి
డిస్ట్రిబ్యూషన్ కు సంబంధించిన రేట్ల గురించి ఇంకా అంగీకారం కుదరకపోవడంతో తెలుగు రాష్ట్రాల్లో చాలా చోట్ల అడ్వాన్స్ బుకింగ్స్ పూర్తి స్థాయిలో ఓపెన్ చేయలేదు. మూడు రోజులు మాత్రమే టైం ఉంది కాబట్టి ఆలోగా పరిష్కారం అయిపోతుంది కానీ వీలైనంత త్వరగా క్లోజ్ చేయడం బెటర్. త్రీడిలో ఈ విజువల్ గ్రాండియర్ ని అనుభూతి చెందేందుకు అభిమానులు తహతహలాడుతున్నారు. ప్రధాన కేంద్రాల్లో ఎనభై శాతం స్క్రీన్లలో అవతార్ 2నే వేయబోతున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. హిట్ టాక్ వచ్చిందా కలెక్షన్ల ఊచకోత ఖాయం. తిరిగి ఆపై వారం స్ట్రెయిట్ సినిమాలొచ్చేదాకా దీనిదే ఆధిపత్యం అవుతుంది. చూడాలి మరి ఎలా ఉంటుందో