Idream media
Idream media
‘ రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయి. మా అచ్చెం నాయుడును అరెస్ట్ చేశారు. అధికార ప్రతినిధిపై దాడి జరిగింది. దేవాలయాలపై దాడులు, దేవుళ్ల విగ్రహాలు,ధ్వంసం జరుగుతున్నాయి. ప్రభుత్వ బలవంతంగా మత మార్పిడులు చేయిస్తోంది..’ ఇదీ టీడీపీ నేతలు వైసీపీ ప్రభుత్వంపై కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు చేసిన ఫిర్యాదు. తమ ఫిర్యాదుపై విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలంటూ కూడా టీడీపీ ఎంపీలు కోరారు. అమిత్‌షా ఏమన్నారో కూడా టీడీపీ ఎంపీలే సెలవిచ్చారు. టీడీపీ నేతలు ఈ తరహాలో వ్యవహరించడం వెనుక ఉన్న లక్ష్యం ఏమిటో ప్రజలకు సులువుగానే అర్థమవుతోంది. వివక్షకు తావులేని విప్లవాత్మక పాలన, సంక్షేమ పథకాలు అందజేత. ఎన్నికల హామీల అమలు, శాశ్వత అభివృద్ధి దిశగా నిర్ణయాలతో దూసుకువెళుతున్న వైసీపీ ప్రభుత్వంపై.. విమర్శలు చేసేందుకు ప్రతిపక్ష టీడీపీకి ఎలాంటి అవకాశం లభించడం లేదు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వంపై విమర్శలు, రాష్ట్రంలో అలజడి సృష్టించేందుకు టీడీపీనే సమస్యలను సృష్టిస్తోందనే అభిప్రాయం ఇప్పటి వరకు జరిగిన పరిణామాల ద్వారా స్పష్టంగా తెలుస్తోంది.
పట్టాభిపై దాడి జరిగితే.. పోలీసులకు ఫిర్యాదు చేయాలి. పోలీసులు నిందితులను పట్టుకోలేకపోయినా, తగిన విధంగా స్పందించకపోయినా.. ఆ తర్వాత టీడీపీ నేతలు విమర్శలు చేయాలి. తదుపరి రాష్ట్ర గవర్నర్‌కు కలసి ఫిర్యాదు చేయాలి. కానీ టీడీపీ నేతలు దాడి జరిగిన మరుసటి రోజే కేంద్ర హోం మంత్రికి ఫిర్యాదు చేయడం గమనార్హం. ఇక టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెం నాయుడు అరెస్ట్‌కు కారణాలు ఏమిటో అందరికీ తెలిసిన విషయమే. దేవాలయాలపై దాడులు, దేవతామూర్తుల విగ్రహాల ధ్వంసం వెనున ఎవరున్నారు..? ప్రస్తుత పరిస్థితి ఏమిటి..? మత మార్పిడులలో వాస్తవం ఏమిటినేది జగద్వితమే. ఈ అంశాలను పట్టుకుని టీడీపీ నేతలు హోం మంత్రి అమిత్ షాను కలవడం వెనుక లక్ష్యం బీజేపీ నేతలను ప్రసన్నం చేసుకోవడం, అంతిమంగా బీజేపీకి చేరువవడమేననేది స్పష్టంగా అర్థమవుతోంది. ఫిర్యాదు చేసినంత మాత్రాన నిజానిజాలు ఏమిటో తెలుసుకోకుండానే.. కేంద్ర ప్రభుత్వం తదుపరి చర్యలు తీసుకుంటుందా..? అనుకూల మీడియాలో ఉచిత ప్రచారం తప్పా ఒరిగేదేమీ లేదని.. అమిత్ షా కాన్వాయ్‌పై 2019లో తిరుపతిలో రాళ్ల దాడి చేసిన టీడీపీకి తెలియంది కాదు.
రాజకీయం తప్పా.. రాష్ట్ర ప్రయోజనాలు తమకు అనవసరమని టీడీపీ నేతలు మరోసారి నిరూపించుకున్నారు. ఈ నెల 1వ తేదీన ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ఏపీకి కేంద్రం మరోసారి మొండిచేయి చూపింది. పోలవరం, ప్రత్యేక హోదా, రైల్వే జోన్‌తో సహా.. టీడీపీ గొప్ప ప్రాధాన్యత ఇస్తున్న అమరావతికి నిధుల కేటాయింపు లేదు. ఈ అంశాలపై స్పందించిన వైసీపీ.. ఏపీకి కేంద్రం తీవ్ర అన్యాయం చేసిందని వ్యాఖ్యానించింది. టీడీపీ నేతలు మాత్రం వైసీపీపై విమర్శలు చేశారు. కేంద్రంపై విమర్శలు కాకపోయినా.. కనీసం మా రాష్ట్ర ప్రయోజనాలు కాపాడండంటూ హోం శాఖ, ఆర్థిఖ శాఖ మంత్రులకు కనీస ఒక వినతి పత్రం ఇవ్వలేదు. కానీ తమ నేతలపై దాడులు జరిగాయని, అరెస్ట్‌లు చేశారని మాత్రం ఫిర్యాదులు చేస్తున్న టీడీపీ నేతలు.. తమ లక్ష్యమేమిటో చెప్పకనే చెబుతున్నారు.