కరోనాపై మీడియాకు మోడీ సూచనలు

కరోనా పై మీడియా ప్రతినిధులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ

కరోనా పై యుద్ధం ఒక జీవితకాల యుద్ధం అని తెలిపారు. క్లిష్ట పరిస్థితుల్లో విధులు నిర్వహిస్తున్న మీడియా ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలియజేయడంతో పాటు ఇంటర్వ్యూలు ఒక మీటర్‌ దూరంలో ఉండి చేయమని సూచనలు చేశారు .

ఇప్పటివరకూ మన దేశంలో కరోనా వైరస్ కారణంగా ఏడుగురు మరణించారని , ఈ రోజు మధ్యాహ్నానికి 415 మందికి కరోనా పాజిటివ్ సోకినట్లు నిర్ధారణ అయ్యింది అని తెలిపారు .
కోవిడ్-19 తాత్కాలిక సమస్య కాదని జీవిత కాల సవాల్ అని సరికొత్త, స్మృజనాత్మక ఆలోచనలతో పరిష్కార మార్గానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు .

ఇది ఒక సుదీర్ఘ యుద్ధమని కరోనా మహమ్మారి ఎంత ప్రమాదమో అర్థం చేసుకొని ప్రజలకు అవగాహన కలిగిస్తున్నందుకు కృతజ్ఞతలు తెలుపుతూనే ప్రజల్లో నిరాశవాదం , భయాందోళనలని సానుకూల భావజాల ప్రసారంతో తరిమికొట్టాలని విజ్ఞప్తి చేశారు . శాస్త్రీయ నివేదికల్ని , అధికారిక సమాచారాన్ని మాత్రమే ప్రసారం చేయాలని కీలక నిర్ణయాలు , తాజా అప్డేట్స్ ప్రసారం చేయాలని , కరోనా పై అవగాహన ఉన్న నిపుణులతోనే ముఖాముఖి కార్యక్రమాలు చేయాలని , అసత్యాలు వ్యాపించకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరారు .

సామాజిక దూరం ( సోషల్ డిస్టన్స్ ) పాటించడం గురించి సులభతరమైన భాషలో ప్రజల్లో అవగాహన కలిగించాలని , మీడియా కూడా రిపోర్టర్స్ కి ప్రత్యేక మైకులు ఇవ్వాలని , మీరు కూడా ఒక మీటర్ దూరంలో ఉండి మాత్రమే ఇంటర్వ్యూస్ చేయాలని సూచించారు , అంతే కాకుండా కరోనా వైరస్ నోట్ల మార్పిడి ద్వారా కూడా వ్యాపించే ప్రమాదముందని ఈ విషయాన్ని కూడా సరళంగా వివరించాలని , డిజిటల్ చెల్లింపుల దిశగా ప్రోత్సాహించాలని సూచించారు . ఒక సుదీర్ఘ యుద్ధం మన ముందుంది. ప్రజలకు అర్థమయ్యే సులభ భాషలో సామాజిక దూరం (సోషల్‌ డిస్టెన్స్‌) ఎంత ముఖ్యమో మీడియా తెలియజేయాలి. కీలక నిర్ణయాలు, తాజా విషయాలను వివరించాలి అని కోరారు .

ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ప్రధాని తరచూ జాతినుద్దేశించి ప్రసంగించాలని మీడియా ప్రతినిధులు మోదీని కోరారు . మీడియా ప్రతినిధుల్ని పరీక్షించేందుకు ప్రత్యేక వైద్య బృందాన్ని ఏర్పాటు చేసి 24 గంటలూ అందుబాటులో ఉంచాలని మీడియా ప్రతినిధులు కోరారు . ప్రసార భారతి నుండి రోజుకు రెండు సార్లు పూర్తి వివరాలు అందిస్తే తాము సవివరంగా ప్రసారం చేయగలమని కోరారు .

విలువైన సూచనలు చేసిన మీడియా వారికి కృతజ్ఞతలు తెలుపుతూ శాస్త్రీయ రిపోర్టింగ్‌ ద్వారా వైరస్‌ వ్యాప్తికి అడ్డుకట్ట వేయాలని , అన్ని విధాలా సహకరించాలని మరోసారి కోరారు . ఈ సమావేశంలో కేంద్ర సమాచార, ప్రసార శాఖా మంత్రి ప్రకాశ్‌ జావడేకర్‌, ఐబీ, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖల కార్యదర్శులు పాల్గొన్నారు.

Show comments