iDreamPost
android-app
ios-app

Ap,ts medical seats-రాష్ట్రం విడిపోయి ఏడేళ్లయినా సీట్లు పంచరా?

Ap,ts medical seats-రాష్ట్రం విడిపోయి ఏడేళ్లయినా సీట్లు పంచరా?

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు విడిపోయి ఏడేళ్లు గడిచిపోయాయి. దాదాపు అన్ని శాఖల పంపకాలు పూర్తయ్యాయి. వైద్య ఆరోగ్య శాఖలో వందకు వంద శాతం పంపకాలు పూర్తయ్యాయి. ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వం చాలా నిక్కచ్చిగా ఉంటోంది. ఈ నేపథ్యంలో ఎంబీబీఎస్‌ సీట్లకు సంబంధించి ఏపీలోని విజయవాడ సిద్ధార్థ మెడికల్‌ కళాశాలలో తెలంగాణ కోటా ఇప్పటికీ పూర్తి స్థాయిలో (36 శాతం.. అంటే 54 సీట్లు) కేటాయిస్తున్నారు. మన ఏపీ పిల్లలకు తెలంగాణలో (ఆల్‌ ఇండియా కోటా తప్ప) అదనంగా ఒక్క సీటు కూడా కేటాయించడం లేదు.

రాష్ట్రం విడిపోక ముందు ఈ కళాశాలలో మూడు ప్రాంతాల వాళ్లకు (తెలంగాణ కు 36 శాతం, రాయలసీమకు 22 శాతం, ఆంధ్రకు 42 శాతం) ఉమ్మడిగా ఏపీలోని ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీ ద్వారా సీట్ల కేటాయింపు జరిగేది. నీట్‌ వచ్చాక 15 శాతం ఆల్‌ ఇండియా కోటా పోగా ఇందులో మిగిలిన సీట్లను ఇదే యూనివర్సిటీ ఇదే రేషియోలో భర్తీ చేస్తోంది. ఇప్పుడు రాష్ట్రం విడిపోయి ఏడేళ్లయినప్పటికీ తెలంగాణకు ఏ లెక్కన సీట్లు కేటాయిస్తున్నారో అర్థం కావడం లేదు.

పదేళ్ల పాటు ఇరు రాష్ట్రాలు అన్ని విషయాల్లో ఇచ్చిపుచ్చుకునే అవకాశం ఉందని అనుకున్నా, ఈ విషయాన్ని ఇరు రాష్ట్రాలు పెడచెవిన పెట్టాయి. ఇతరత్రా ఏ విషయంలోనూ ఏ శాఖ పరిధిలోనూ రెండు రాష్ట్రాలు ఈ విధానాన్ని ఒక్క శాతం కూడా పాటించడం లేదు. కేవలం మన నిర్లిప్తత వల్లే ఈ దుస్థితి నెలకొంది. ఈ పరిస్థితుల్లో తెలంగాణకు ఈ కళాశాలలో 54 ఎంబీబీఎస్‌ సీట్లు ఎందుకు ఇస్తున్నారో అర్థం కావడం లేదు. ప్రజల నుంచి, విద్యార్థుల నుంచి ఒత్తిడి లేనందునే ఏపీ ప్రభుత్వం కూడా పట్టించుకోలేదని సంబంధిత అధికారులు చెబుతున్నారు.

తమ పిల్లలను ఎంబీబీస్‌ చదివించాలనేది చాలా మంది సామాన్య ప్రజల కల. ఇందుకోసం రూపాయి రూపాయి కూడబెట్టి కష్టార్జితంతో కార్పొరేట్‌ కళాశాలల్లో చదివిస్తున్నారు. చాలా మంది ఈ కలను సాకారం చేసుకోవడానికి రెండు మూడు లాంగ్‌ టర్మ్‌లకు కూడా వెళుతున్నారు. ఇలాంటి పరిస్థితిలో ఒక్క మార్కు తేడాతో ఎంతో మంది సీట్లు కోల్పోవడాన్ని మనం కళ్లెదుటే చూస్తున్నాం. అలాంటప్పుడు 54 సీట్లు ఆ రాష్ట్రానికి అప్పనంగా ఎందుకు కేటాయించాలి?

వాస్తవానికి తెలంగాణ మన కంటే చిన్న రాష్ట్రం అయినప్పటికీ, మనకంటే ఎక్కువగా మెడికల్‌ కాలేజీలు ఉన్నాయి. మొత్తంగా మనకంటే ఎక్కువ సీట్లు ఉన్నాయి. దీంతో అక్కడి విద్యార్థులకు మనకంటే 40–50 మార్కులు తక్కువగా వచ్చినప్పటికీ మెడిసిన్‌ సీట్లు వస్తున్నాయి.

ఈ పరిస్థితుల్లో మనకు అన్యాయం జరుగుతున్న విషయం ఏపీలోని విద్యార్థి సంఘాలకు పట్టదా? అసలు విద్యార్థి సంఘాలు బతికే ఉన్నాయా? ప్రతిపక్షాలు మాట్లాడవా? మీడియా పట్టించుకోదా? తల్లిదండ్రులు ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేయరా? తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల నుంచి ఒత్తిడి వస్తే తప్ప ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వాలు స్పందించవనే విషయం తెలియదా?

ఈ రోజు లక్షలాది మంది తల్లిదండ్రులు తమ పిల్లలను డాక్టర్లుగా చూడాలనుకుంటున్నారు. వీరందరితో పాటు అన్యాయం పట్ల స్పందించే గుణం వారందరూ ఈ విషయంపై తమ గళం విప్పాలి. ఈ అన్యాయం పట్ల మన సమాజంలో విస్తృత చర్చ జరిగేలా ఎవరంతకు వారు వారి పరిధిలో ఉపక్రమించాలి.