iDreamPost
android-app
ios-app

మన్యం జిల్లా.. పార్వతీపురానికి కొత్త కళ

  • Published Jan 26, 2022 | 11:59 AM Updated Updated Jan 26, 2022 | 11:59 AM
మన్యం జిల్లా.. పార్వతీపురానికి కొత్త కళ

రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన జిల్లాల పునర్విభజనలో పార్వతీపురానికి బోనస్ లభించింది. ఈ పట్టణం కేంద్రంగా విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లోని ఏజెన్సీ ప్రాంతాలను కలిపి ప్రత్యేక జిల్లాగా నోటిఫై చేయడం విశేషం. ప్రభుత్వం మొదట ప్రకటించిన ప్రకారం పార్లమెంటు నియోజకవర్గం యూనిట్ గా జిల్లాల విభజన జరగాల్సి ఉంది. ఆ లెక్కన ప్రస్తుతం నాలుగు జిల్లాల్లో విస్తరించి ఉన్న అరకు పార్లమెంటు స్థానం జిల్లాగా ఏర్పడేది. ఈ ప్రాంతాలన్నీ అందులో భాగం అయ్యేవి. కానీ భౌగోళికంగా అరకు నియోజకవర్గం విస్తీర్ణం పెద్దది కావడంతో దాన్ని విడదీసి రెండు జిల్లాలు చేయాలని నిర్ణయించారు. దాంతో పార్వతీపురం పంట పండింది. ఈ పట్టణం కేంద్రంగా మన్యం జిల్లా ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.

అన్నీ పాత శ్రీకాకుళం జిల్లా ప్రాంతాలే..

కొత్తగా ప్రకటించిన పార్వతీపురం జిల్లాలో చేర్చిన ప్రాంతాలన్నీ ఒకప్పటి ,ఇప్పటి శ్రీకాకుళం జిల్లాలో ఉన్నవే కావడం విశేషం. గతంలో ఉమ్మడి ఏపీలో విజయనగరం జిల్లా లేదు. విశాఖ జిల్లాలోని కొన్ని, శ్రీకాకుళం జిల్లాలోని కొన్ని ప్రాంతాలను విడదీసి వాటితో 1979 జూన్ ఒకటో తేదీన ఉమ్మడి ఏపీలో 23వ జిల్లాగా విజయనగరం అవతరించింది. ఆనాడు శ్రీకాకుళం జిల్లా నుంచి తీసుకొచ్చిన ప్రాంతాల్లోని పార్వతీపురం, కురుపాం, సాలూరు ప్రాంతాలనే ఇప్పుడు విజయనగరం నుంచి మళ్లీ విడదీశారు. ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లాలో ఉన్న పాలకొండ నియోజకవర్గాన్ని వాటితో కలిపి కొత్తగా మన్యం జిల్లా ఏర్పాటు చేస్తున్నారు. కొత్త జిల్లాలో నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలు, రెండు రెవిన్యూ డివిజన్లు, 16 మండలాలు ఉంటాయి.

గిరిజన రాజులకు ప్రసిద్ధి

పార్వతీపురం, పాలకొండ మన్యం ప్రాంతాలు గిరిజన రాజుల ఆధిపత్యంలో ఉండేవి. వారిని కొండ దొరలని అంటారు. పాలకొండ సమీపంలోని వండువ దొర కు ఆ ప్రాంతంలో ఎంతో పట్టుండేది. విశ్వసరాయి నరసింహారావు దొర ఒకప్పటి కొత్తూరు ఎమ్మెల్యేగా కూడా పనిచేశారు. ప్రస్తుతం ఆయన కుమార్తె విశ్వసరాయి కళావతి పాలకొండ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. అలాగే కురుపాం నియోజకవర్గంలో వైరిచర్ల, శత్రుచర్ల రాజవంశీకులు వివిధ పార్టీల తరఫున ప్రజాప్రనిధులుగా పనిచేశారు.

కురుపాం రాజులైన వైరిచర్ల కిశోర్ చంద్రదేవ్ కాంగ్రెస్ ఎస్, కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల్లో కొనసాగి ఐదుసార్లు ఎంపీగా, ఒకసారి రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారు. యూపీఏ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. ఆయన సోదరుడు వైరిచర్ల ప్రదీప్ చంద్ర దేవ్ కూడా ఎమ్మెల్యేగా చేశారు. ఇక చినమేరంగి జమీందారీ వంశీకులైన శత్రుచర్ల విజయరామరాజు కాంగ్రెసులో మూడుసార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. వైఎస్సార్ కేబినెట్లో మంత్రిగా కూడా పని చేశారు. ఆయన సోదరుడు చంద్రశేఖర్ రాజు, మేనల్లుడు జనార్దన్ తాట్రాజు కూడా ఎమ్మెల్యేలుగా చేశారు. పూర్తిగా వెనుకబడిన, కొండలు అడవులతో నిండిన ఈ ప్రాంతాలు కొత్త జిల్లా ఏర్పాటుతో అభివృద్ధి చెందుతాయి. 

జనాభాపరంగా రెండో చిన్న జిల్లా

మొత్తం 3,935 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఏర్పాటవుతున్న ఈ జిల్లా జనాభాపరంగా రాష్ట్రంలో రెండో చిన్న జిల్లా. నాలుగు నియోజకవర్గాల్లో కలిపి మొత్తం 9.72 లక్షల జనాభా ఉంటారు. పార్వతీపురం, పాలకొండ రెవెన్యూ డివిజన్ కేంద్రాలుగా ఉంటాయి. పాలకొండ డివిజన్లో వీరఘట్టం, సీతంపేట, భామిని, పాలకొండ, జియ్యమ్మవలస, గరుగుబిల్లి మండలాలు ఉంటాయి. పార్వతీపురం డివిజన్లో కొమరాడ, గుమ్మలక్ష్మీపురం, కురుపాం, పార్వతీపురం, సీతానగరం, బలిజిపేట, మక్కువ, సాలూరు, పాచిపెంట, మెంటాడ మండలాలు చేరనున్నాయి.

రెండు ఐటీడీఏలు కొనసాగుతాయా?

ప్రస్తుతం విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో ఉన్న రెండు ఐటీడీఏలు పార్వతీపురం జిల్లా ఏర్పడితే అందులోకే వెళ్లిపోతాయి. పార్వతీపురం కేంద్రంగా ఒకటి, సీతంపేట కేంద్రంగా మరొకటి పని చేస్తున్నాయి. ఈ రెండూ కొత్త జిల్లాలో చేరితే శ్రీకాకుళం జిల్లాలో మిగిలిన పాతపట్నం, మెలియపుట్టి, మందస, కొత్తూరు, ఎల్.ఎన్. పేట, నందిగాం తదితర మండలాల్లోని గిరిజన ప్రాంతాలకు వేరే ఐటీడీఏ ఏర్పాటు చేస్తారా లేక ఆ రెండింటిలో ఒకదాన్ని తరలిస్తారా అన్నది తొందరలోనే తేలనుంది.

Jojobet GirişBetcioivermectin tabletpusulabetpusulabetMadridbetmeritbetCasibom GirişmeritbetpokerklasTophillbetmarsbahis girişJojobet GirişcasibomCasibom GirişMarsbahis GirişHoliganbetbetebetHoliganbetMarsbahis Giriş