Idream media
Idream media
చిన్నప్పుడు జానపద సినిమాలని చూసి చూసి మాంత్రికున్ని అయిపోదామని నిర్ణయించుకున్నాను. పుడతానే ఐఐటీ కోచింగ్‌కు పంపేరోజులు కాదు. కాబట్టి ఎవడి కెరీర్ ఏమిటో మీసాలు, గడ్డాలు పెరిగినా అర్థమయ్యేది కాదు.
మాంత్రికుడు కావాలంటే బేసిక్ క్వాలిఫికేషన్ పొడుగాటి గడ్డం పెరగాలి. అది పెరిగే వయస్సు కాదు కాబట్టి పెట్టుడు గడ్డం వాడదామనుకున్నా. అయితే అది సులభంగా దొరకదు. సంజీవరెడ్డి అనే పెద్దాయన హార్మోనియం వాయిస్తూ అందరికీ డ్రామా పద్యాలు నేర్పేవాడు. ఆయన దగ్గర రకరకాల గడ్డాలున్నాయని తెలుసుకుని వీలు చూసి కొట్టేద్దామని నిర్ణయానికి వచ్చాను.
ఇక మాంత్రికులంటే వాళ్లకు డ్రెస్‌కోడ్ ఉంటుంది. మనలా అంగీలు, నిక్కర్లు వేసుకోరు. పొడుగాటి గౌన్, ఆడాళ్ల నైటీలాంటిది పైనుంచి కిందకి దిగేసుకుంటారు. SVR , ముక్కామల, రాజనాల అందరూ ఇదే రకం. బ్లాక్ అండ్ వైట్‌లో ఆ గౌన్ నల్లగా కనిపించేది. దాన్ని ఉతకాలంటే కూడా మామూలు విషయం కాదు. చాకలోళ్ల బానలో రెండు రోజులు ఉడకబెట్టినా కూడా కష్టమే.
ఆ డ్రెస్‌ని ఎక్కడో ఒకచోట కుట్టించుకోవచ్చు. నబీ అనే ఆస్థాన టైలర్ ఉండేవాడు. సంక్రాంతికి బట్టలు ఇస్తే ఉగాదికి డెలివరీ ఇచ్చేవాడు. వాడి ధర్మానా ఏ పండగకి టైంకి కొత్త బట్టలు వేసుకుంది లేదు. తల స్నానం చేసి, వాడి దగ్గరికి వెళితే, మన చొక్కా అప్పుడు మిషన్ మీద కనిపించేది. టిక్‌టిక్‌మని సౌండ్ చేస్తూ చక్రం తిరుగుతూ ఉంటే వాడి వేళ్లు సూదికి తగలకుండా సుతారంగా కదిలేవి. చివరికి గుండీలు లేని చొక్కా ఇస్తే పిన్నీసుల సాయంతో వేసుకునేవాన్ని. వాన్ని నమ్మి కుట్టిస్తే నేను ముసలి మాంత్రికున్నే అయినా, గౌను దక్కదు.
సరే గడ్డం , గౌను ఎలాగో సాధించవచ్చు. కానీ మంత్రశక్తులు ఎలా? దానికో గురువు కావాలి. స్కూల్లో అయ్యవార్లు ఉన్నారు కానీ వాళ్లెవరూ గురువులు కాదు. రెండు రెళ్లు నాలుగు అని చెప్పినా బెత్తంతో ఉతికి పారేసేవాళ్లు. ఆ రోజుల్లో వాళ్లకు సరిగా జీతాలు వచ్చేవి కావు. అందుకని భత్యం లేక బెత్తాన్ని వాడేవాళ్లు.
అసలు నేను మంత్రాలు నేర్చుకోవాలని అనుకున్నదే శంకరయ్య అయ్యవార్ని చిలకగా మార్చాలని. వాడి దుంపతెగ బెత్తంతో పిర్రల మీద కొట్టేవాడు. ప్రత్యేకంగా పంజరంలో పెట్టాలనుకున్నా.
దాంతో సాధువులు, సన్నాసులు కనపడితే మంత్రాలు నేర్పిస్తారా అని అడిగేవాన్ని. పది పైసలు ఇవ్వు అనేవాళ్లు. ఇస్తే దాంతో బీడీలు కొనుక్కుని మాయమయ్యేవాళ్లు. ఇలా నా ఆశల మీద నిప్పులు పోశారు.
చివరికి మంత్రశక్తులు దక్కలేదు. మాంత్రికుడికి బదులు జర్నలిస్టుగా కెరీర్ ప్రారంభించాను. తిమ్మిని బమ్మి, బమ్మిని తిమ్మి అని రాయడం నేర్చుకున్నాను. ఒకరకంగా సక్సెస్ అయ్యినట్టే!