డబ్బింగ్ సినిమా అయినా జాగ్రత్త పడాల్సిందే

Love Today OTT లవ్ టుడే హిట్టు సినిమా. తమిళంలో బాగా ఆడింది. యూత్ ఎగబడి చూశారు. ఒరిజినల్ వెర్షన్ నుంచే వంద కోట్ల గ్రాస్ వచ్చేలా ఉంది. ఇంకేం తెలుగు డబ్బింగ్ కూడా అదే స్థాయిలో ఆడుతుందనే అంచనాతో దిల్ రాజు రిలీజ్ చేశారు. మొన్న 25 నుంచి థియేటర్లలో ఆడుతోంది. ఊహించినట్టే టాక్ బాగానే వచ్చింది. మొదటి మూడు రోజులు మంచి ఫిగర్లు నమోదయ్యాయి. కట్ చేస్తే నిన్నటి నుంచి డ్రాప్ కాస్త ఎక్కువగానే ఉంది. మాములుగా ఇలాంటి చిత్రాలకు మార్నింగ్, మ్యాట్నీలు కాలేజీ స్టూడెంట్స్, కుర్రకారుతో ఫుల్ అవుతాయి. కానీ ప్రధాన కేంద్రాలు మినహాయించి మిగిలిన చోట్ల డల్ అయిపోయింది. సగం ఆక్యుపెన్సీనే నిండుతున్నాయని రిపోర్ట్

వీటికి కారణాలు విశ్లేషిస్తే కొన్ని వాస్తవాలు అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. లవ్ టుడేని ముందు ప్లాన్ చేసుకున్న తేదీ డిసెంబర్ 18. కానీ మసూద కోసం పోస్ట్ పోన్ చేశారు. తీరా చూస్తే విదేశీ ఓటిటిలో వచ్చిన తమిళ హెచ్డి ప్రింట్ ఆన్ లైన్ లోకి వచ్చేసింది. ఇంకేముంది నెట్ వాడకం, పైరసీ అలవాటున్న వాళ్ళు శుభ్రంగా డౌన్లోడ్ చేసుకుని చూసేసారు. అక్కడితో అయిపోలేదు. ఇక్కడ రిలీజయ్యాక పైరసీ వీరులు థియేటర్ తెలుగు ఆడియో తీసుకుని జోడించి మళ్ళీ వదిలారు. దీంతో ఇది కాస్తా కలెక్షన్ల మీద నేరుగా ప్రభావం చూపించేసింది. ఇవన్నీ గమనించే నెట్ ఫ్లిక్స్ డిసెంబర్ 2 నుంచి లవ్ టుడే తమిళంని స్ట్రీమింగ్ చేస్తామని అఫీషియల్ గా ప్రకటించింది.

ఇదంతా టెక్నాలజీ విపరీతంగా పెరిగిన ఆన్ లైన్ ప్రపంచం వల్ల కలిగిన ఎఫెక్ట్. లవ్ టుడేకి అదే జరుగుతోంది. పైగా దీనికి ప్రమోషన్లు ఆశించిన స్థాయిలో జరగలేదు. ఎలాగూ ప్రూవ్ అయిన సినిమా కాబట్టి ప్రత్యేకంగా పబ్లిసిటీ అక్కర్లేదనుకున్నారో ఏమో కానీ ఫైనల్ గా నాలుగైదు మెట్లు కిందే ఉండిపోనుంది. ఇప్పుడున్న ట్రెండ్ లో వేరే భాషలో ఒక మూవీ హిట్టయిందా వెంటనే హక్కులు కొనేసుకుని వీలైనంత త్వరగా డబ్బింగో రీమేకో చేసుకోవాలి. లేదంటే ఓటిటికి అలవాటైన జనం ముందే చూసేసే ప్రమాదం ఉంది. లవ్ టుడేని ఈ స్థాయిలో తీర్చిదిద్దిన ప్రదీప్ రంగనాథన్ కి ఇప్పుడు టాలీవుడ్ లోనూ ఆఫర్లు వస్తున్నాయి. ఆల్రెడీ ఒకటి ఓకే చేశారట

Show comments