లాక్ డౌన్ రివ్యూ 20 – ఫోటో తెచ్చిన తంటా

ఇటీవలి కాలంలో మలయాళంలో కాన్సెప్ట్ బేస్డ్ సినిమాలు ఎక్కువగా వస్తున్నాయి. ఎలాంటి కమర్షియల్ అంశాలు, స్టార్ క్యాస్టింగ్ లేకపోయినా సహజమైన టేకింగ్ తో అక్కడి దర్శకులు ప్రేక్షకులను ఆకట్టుకుంటూ మంచి విజయాలు నమోదు చేస్తున్నారు. అలాంటిదే వికృతి కూడా. గత ఏడాది అక్టోబర్లో వచ్చిన ఈ మూవీలో ఇప్పుడు ప్రపంచమంతా మునిగితేలుతున్న సోషల్ మీడియాని కాన్సెప్ట్ గా తీసుకున్నారు. నెట్ ఫ్లిక్స్ ద్వారా అందుబాటులోకి వచ్చిన ఈ వికృతి ఎలా ఉందో రివ్యూలో చూసేయండి

కథ

ఎల్దో(సూరజ్)మూగవాడు. భార్య కూడా అంతే. ఓ స్కూల్ లో అటెండర్ గా పని చేస్తూ ఇద్దరు పిల్లలతో సంతోషంగా జీవిస్తూ ఉంటాడు.ఒకరోజు ఎల్దో మెట్రో ట్రైన్ లో ప్రయాణం చేస్తూ పనుల బడలిక వల్ల అక్కడే ఖాళీగా ఉన్న సీట్లపై పడుకుంటాడు. అక్కడే ఉన్న సమీర్(సౌభిన్ షాహిర్)దీన్ని ఫోటో తీసి ఎల్దోని తాగుబోతుగా పేర్కొని ఫేస్ బుక్, వాట్సాప్ లో పోస్ట్ చేస్తాడు. దీంతో ఎల్దో ఉద్యోగం పోతుంది. అవమానాల పాలవుతాడు. పిక్ ఎవరు తీశారో అంతు చిక్కదు.

ఈలోగా ఎల్దో తప్పేమీ లేదని తెలుసుకుని అతనికి మద్దతుగా పోలీసు కేసులు నమోదవుతాయి. దుబాయ్ నుంచి పెళ్లి కోసం సెలవులకు వచ్చిన సమీర్ లో క్రేజ్ కోసం చేసిన ఈ తప్పు వల్ల భయం మొదలవుతుంది. ఈలోగా ఎల్దో ఓ యాక్సిడెంట్ లో గాయపడతాడు. ఇది కూడా సమీర్ ఖాతలోనే వేస్తుంది సమాజం. ఆ తర్వాత ఈ కథ ఎలాంటి మలుపులు తీసుకుంది, ఎల్దో-సమీర్ లు ఎక్కడ కలుసుకున్నారు లాంటి ప్రశ్నలకు సమాధానమే వికృతి

నటీనటులు

ఎల్దోగా నటించిన సూరజ్ వెంజరమోడు మూగవాడిగా తన నటనతో వికృతిని నిలబెట్టాడు. కేవలం హావభావాలతో సినిమా మొత్తాన్ని తన భుజాల మీద నడిపించే బాధ్యతను సంపూర్ణంగా నెరవేర్చాడు. ఒక్క ఫోటోతో తన జీవితం తలకిందులు కావడంతో ఇంటా బయటా అవమానంతో చితికిపోయే పాత్రలో జీవించాడు. దీనికి కారణమైన లేట్ ఏజ్ బ్యాచిలర్ సమీర్ గా చేసిన సౌరభ్ షామీర్ కూడా న్యాచురల్ యాక్టింగ్ తో ఆకట్టుకున్నాడు. ఎల్దో భార్యగా సురభి లక్ష్మీ, సమీర్ ప్రియురాలిగా విన్సీ ఆలోషియస్ తదితరులు ఎక్కడా బ్యాలన్స్ తప్పకుండా మంచి ఫీల్ ఇవ్వడంలో తమ వంతు పాత్ర పోషించారు. చిన్న సినిమానే అయినప్పటికీ ఇందులో యాక్టర్స్ ఎక్కువగా ఉన్నారు. అందరికి మంచి స్పేస్ దక్కడంలో దర్శకుడు జాగ్రత్త తీసుకున్నాడు

డైరెక్టర్ అండ్ టీమ్

దర్శకుడు ఎంసీ జోసెఫ్ తీసుకున్న కథ స్క్రీన్ మీద చూశాక చాలా చిన్నది అనిపిస్తుంది. ఒక గంట నిడివికి మాత్రమే సరిపోయే మెటీరియల్ తో రెండు గంటల పాటు ఎంగేజ్ చేసేందుకు గట్టి ప్రయత్నమే చేశాడు. దానికి నటీనటుల పెర్ఫార్మన్సులతో పాటు అన్ని విభాగాల సహకారం చక్కగా అందటంతో అవుట్ ఫుట్ నీట్ గా వచ్చింది. ఏదిబడితే దాన్ని అనుమతులు తీసుకోకుండా ఎవరిని బడితే వారిని ఇష్టం వచ్చినట్టు ఫోటోలు తీసి లైకులు కోసం సోషల్ మీడియాలో పోస్ట్ చేసే వాళ్ళకు పాఠం నేర్పించే విధంగా సాగింది వికృతి.

నిజానిజాలు తెలుసుకునే అవకాశాలు తక్కువగా ఉండే ఈ ఆన్ లైన్ ప్రపంచంలో తొందపాటుతో చేసే పనులు జీవితాలను ఎలా తలకిందులు చేస్తాయో ఎల్దో, సమీర్ పాత్రల ద్వారా సహజంగా చూపించారు. కాకపోతే నిడివి కోసం ఎల్దో ఫ్యామిలి సెటప్ ని ఎక్కువసేపు చూపించడం వల్ల కథ చాలాసేపు ముందుకు కదలదు. ఒకే చోట తచ్చాడుతూ ఉంటుంది. సమీర్ ఫోటో తీసుకున్నాకే వేగమందుకుంటుంది. అయితే గొప్పగా చెప్పకునే ఎలాంటి థ్రిల్స్ కానీ, మలుపులు లేకుండా ఫ్లాట్ గా వెళ్లిపోవడం ఒక్కటే వికృతిలో చిన్న లోపం. అది కనెక్ట్ అయితే చివరిదాకా బోర్ కొట్టకుండా సాగుతుంది.

బిజిబల్ మనియల్ సంగీతం ఆహ్లాదకరంగా సాగింది. పాటలు అవసరం లేదనిపించినా వినసొంపైన మెలోడీస్ తో ఆకట్టుకున్నారు. అల్బీ ఛాయాగ్రహణం కోచి నగర సౌందర్యాన్ని చూపిస్తూనే రెండు కుటుంబాల మధ్య మనం తిరిగాడుతున్న ఫీలింగ్ వచ్చేలా బాగా చూపించారు. అయూబ్ ఖాన్ ఎడిటింగ్ ఇంకొంత ల్యాగ్ ని తగ్గించి ఉంటే బాగుండేది. బడ్జెట్ సినిమా కాబట్టి ప్రత్యేకంగా చెప్పుకోవడానికి ఏమి లేదు

చివరి మాట

ఎవరి ప్రైవసీ అయినా సరే దాని మీద ఇతరులకు ఎలాంటి హక్కులు ఉండవు. దాన్ని దృష్టిలో ఉంచుకోకుండా చేతిలో సెల్ ఫోన్ ఉంటే చాలు ఎవరినైనా ఫోటోలు. తీయొచ్చు అనుకుంటే అది ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందో చూపించిన సినిమా వికృతి. కమర్షియల్ చక్రబంధంలో ఇరుక్కోకుండా కొత్త పంధా వైపు వెళ్తున్న మలయాళం సినిమాలను రెగ్యులర్ గా చూసేవాళ్ళకు వికృతి నచ్చుతుంది. కేవలం వినోదం కోసమే చూస్తాం లేదా కామెడీ ఉంటేనే నచ్చుతుంది అనుకునేవాళ్లకు వికృతి అంతగా రుచించకపోవచ్చు. కాకపోతే ఎవరూ చూసినా మరీ తీవ్రంగా అయితే ఖచ్చితంగా నిరాశపరచదు.

Show comments