లాక్ డౌన్ రివ్యూ 52 – కపే రణసింగం

ఏడాదికి ఒకసారి చందా కట్టి సంవత్సరం పొడవునా వినోదాన్ని అందుకునే ప్రేక్షకులకు కొత్త దారి చూపిస్తూ జీ ప్లెక్స్ ఇటీవలే విడుదల చేసిన స్టార్ హీరో సినిమా కపే రణసింగం. 199 రూపాయల టికెట్ ధరతో నలభై ఎనిమిది గంటల్లో చూడటం పూర్తి చేసేలా ఇచ్చిన ఆప్షన్ మీద మొదట్లో సందేహాలు వ్యక్తమైనప్పటికీ పేరున్న క్యాస్టింగ్ ఉండటంతో రెస్పాన్స్ బాగానే ఉంది. మరి సొమ్ములు పెట్టి ఆన్ లైన్ లో చూసిన ఆడియన్స్ ని రణసింగం మెప్పించాడా లేదా రివ్యూలో చూద్దాం

కథ

ఓ చిన్న పల్లెటూరిలో ఉండే రణసింగం(విజయ్ సేతుపతి)కి విప్లవ భావాలు ఎక్కువ. ఊరిలో ఏ సమస్య వచ్చినా జనం కోసం పోరాడేందుకు ముందు వరుసలో ఉంటాడు. ఈ స్ఫూర్తి నచ్చిన అరియనాచి(ఐశ్వర్య రాజేష్) ఇతన్ని ప్రేమించి పెళ్లి చేసుకుంటుంది. ఓ బిడ్డకు జన్మనిచ్చాక ఉద్యోగరిత్యా రణసింగం కొంతకాలం దుబాయ్ వెళ్తాడు. కొద్దిరోజులయ్యాక రణసింగం చనిపోయినట్టు సమాచారం వస్తుంది. అయితే అక్కడి పరిశ్రమలో జరిగిన గొడవ వల్లే రణసింగం ప్రాణాలు కోల్పోయాడని అతని స్నేహితుడు అరియనాచికి ఫోన్ చేసి చెబుతాడు. శవంని ఇండియాకు రప్పించేందుకు చేసే ప్రయత్నాలు ఫలించవు. ఎనిమిది నెలలు గడిచినా ఫలితం శూన్యం. దీంతో అరియనాచి తాడో పేడో తేల్చుకునేందుకు చెన్నై వెళ్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందన్నదే అసలు స్టోరీ

నటీనటులు

ఇందులో హీరో విజయ్ సేతుపతి అన్నట్టుగా ప్రొజెక్ట్ చేశారు కానీ ఇతని పాత్ర చాలా చిన్నది. అది కూడా ఎక్కువ సేపు ఫ్లాష్ బ్యాక్ ప్రేమ కథలో కనిపిస్తాడు తప్ప సుమారు రెండు గంటలకు పైగా అతని జాడే ఉండదు., కథ ప్రకారం చనిపోతాడు కాబట్టి అంతకన్నా స్కోప్ దొరకలేదు. ఉన్నంతలో తన ఉనికిని చాటుకునేలా చేశాడు. అసలైన షో స్టీలర్ మాత్రం ఐశ్వర్య రాజేషే. అద్భుతమైన నటనతో సినిమాను నిలబెట్టింది. కథ మొత్తం తను చేసే పోరాటం మీదే ఆధారపడి ఉంటుంది కాబట్టి దానికి తగ్గట్టుగానే అరియనాచిగా పరకాయ ప్రవేశం చేసింది. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో అవార్డు విన్నింగ్ పెర్ఫార్మన్స్ అని చెప్పొచ్చు. ఇది ఇంకే రెగ్యులర్ హీరోయిన్ తో చేయించినా ఇంత ఇంపాక్ట్ ఖచ్చితంగా ఉండేది కాదు. సినిమా అయ్యాక విజయ్ సేతుపతి కంటే ఐశ్వర్యనే గుర్తుండిపోతుంది. కలెక్టర్ గా చేసిన రంగరాజ్ పాండే రోల్ కు తగ్గట్టు హుందాగా చేశాడు. ఇక మిగిలిన తారాగణం అందరూ చాలా సహజంగా చేయడంతో ఆ పల్లెటూరి సహజ వాతావరణంలో మనమూ తిరుగుతున్న ఫీలింగ్ కలుగుతుంది

డైరెక్టర్ అండ్ టీమ్

దర్శకుడు విరుమాండీ తీసుకున్న థీమ్ నిజంగా ఇవాళ్టి ప్రభుత్వాలు చాలా సీరియస్ గా ఆలోచించాల్సిన అంశం. ఉపాధి కోసం విదేశాలకు వెళ్లి అక్కడే ఇరుక్కుపోయి కనీసం మృతదేహం కూడా త్వరగా తెప్పించుకోలేని దుస్థితి ఎన్ని గవర్నమెంటులు వచ్చినా మారడం లేదు. అంత గొప్ప సెలబ్రిటీ శ్రీదేవి పార్థీవ శరీరాన్ని ఇక్కడికి తీసుకురావడానికి బోనీ కపూర్ చాలా ఇబ్బందులు పడాల్సి వచ్చింది. పలుకుబడి ఉంది కాబట్టి ఫైనల్ గా సాధించాడు. కానీ మరి సామాన్యుల మాటేమిటి. వాళ్ళ గోడు ఎవరు పట్టించుకుంటారు. అందులోనూ వెనుకుబడిన వర్గాలకు చెందినవారిని చిన్నచూపు చూసే బ్యూరోక్రసీ సిస్టమ్ లో దీన్ని ప్రక్షాళన చేసేదెవరు. ఈ ప్రశ్నలను వివిధ సంఘటనల రూపంలో విరుమాండీ నేరుగా ప్రశ్నిస్తాడు. ఇలాంటి దారుణమైన పరిస్థితికి కారణం ఎవరో సూటిగా గుచ్చుకునేలా వివరిస్తాడు.

కానీ ఈ సబ్జెక్టుకి మూడు గంటల నిడివి చాలా ఎక్కువ. విజయ్ సేతుపతి ఒప్పుకున్నాడు కాబట్టి అతన్ని మార్కెటింగ్ చేసుకోవడం కోసం ఐశ్వర్య రాజేష్ తో నడిపిన లవ్ ట్రాక్ చాలా సేపు సాగదీశారు. అతను చనిపోయాడని సినిమా మొదలైన కాసేపటికే చెప్పేసినప్పుడు త్వరగా అసలు పాయింట్ కు వచ్చేయాలి. అలా కాకుండా విరుమాండీ డిటైల్డ్ గా చూపాలని చేసిన ప్రయత్నం ఒకదశలో బోర్ కొట్టిస్తుంది. ఒకసారి ఎమోషన్ రిజిస్టర్ అయ్యాక దాన్ని పదే పదే చెప్పే ప్రయత్నం చేయకూడదు. కానీ విరుమాండీ మాత్రం ఇది మర్చిపోయి చాలా సేపు కథనం ముందుకు వెళ్లకుండా నడిపించారు. కనీసం నలభై నిమిషాలకు పైగా తగ్గించే అవకాశాన్ని వదిలిపెట్టారు. ఇక ప్రీ క్లైమాక్స్ లో సినిమాటిక్ లిబర్టీ తీసుకుని అరియనాచి సమస్యకు పరిష్కారం చూపించడం లాజిక్స్ కి దూరంగా ఉండటమే కాదు అప్పటిదాకా మైంటైన్ చేసిన ఇంప్రెషన్ ని తగ్గించేసింది. ఆ ఎపిసోడ్ మొత్తం కృత్రిమంగానే అనిపిస్తుంది. కాకపోతే క్లైమాక్స్ మాత్రం హార్ట్ టచింగ్ గా తీశాడు విరుమాండీ. చివర్లో ఇచ్చిన ట్విస్ట్ షాక్ కు గురి చేస్తుంది. తమిళ ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని తీసింది కాబట్టి మన కోణంలో చూస్తే అంత సంతృప్తి అనిపించదు

గిబ్రాన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది. సాహో, రాక్షసుడు లాంటి థ్రిల్లర్స్ కి అదిరిపోయే బీజీఎమ్ ఇచ్చిన ఇతను విలేజ్ బ్యాక్ డ్రాప్ లో సాగే ఈ కథకు తగ్గ మూడ్ ని క్యారీ చేస్తూ చాలా మంచి సంగీతం అందించాడు. ఏకాంబరం ఛాయాగ్రహణం కూడా పర్ఫెక్ట్ గా కుదిరింది. కలర్ టోన్ ని వాడిన విధానం చాలా న్యాచురల్ లుక్ వచ్చేలా చేసింది. ఓటిటి కాబట్టి కట్ చేయడం ఎందుకు అనుకున్నారో ఏమో శివనందీశ్వరన్ ఎడిటింగ్ మాత్రం సోసోగా ఉంది. ల్యాగ్ ఎక్కువయ్యింది. కెజెఆర్ ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. భారీ బడ్జెట్ లేకపోయినా క్వాలిటీ విషయంలో రాజీ పడలేదు

కంక్లూజన్

కపే రణసింగం రెగ్యులర్ కమర్షియల్ సినిమా కాదు. అలాంటి ఎంటర్ టైన్మెంట్ కోరుకుని చూస్తే మాత్రం ఇది ఖచ్చితంగా నిరాశపరుస్తుంది. ప్రవాస భారతీయులను దశాబ్దాలుగా వేధిస్తున్న ఓ తీవ్రమైన సమస్యను ఆలోచింపజేసేలా హత్తుకునేలా చిత్రీకరించిన తీరు కోసం ఓసారి చూడొచ్చు. కాకపోతే ఇందులో విజయ్ సేతుపతి హీరో కాబట్టి అతని పాత్రను ఎక్కువ ఊహించుకోకుండా తక్కువ అంచనాలు పెట్టుకుని చూస్తే ఓసారి మెప్పిస్తుంది. ఫైనల్ గా ఐశ్వర్య రాజేష్ పెరఫార్మన్స్ మాత్రం ఖర్చుపెట్టిన డబ్బుకు, సమయానికి న్యాయం చేకూరుస్తుంది. గొప్పగా చెప్పుకునే అవకాశాన్ని విరుమాండీ అతిశయోక్తులకు పోయి పోగొట్టుకుని కపే రణసింగంని యావరేజ్ గా మిగిల్చాడు

Show comments