Idream media
Idream media
కరోనా వైరస్ కారణంగా విధించిన లాక్ డౌన్ తో నెల రోజులుగా మూసివేసిన దుకాణదారులకు కేంద్ర ప్రభుత్వం ఊరటనిచ్చే నిర్ణయం తీసుకుంది. రెడ్ జోన్లు, హాట్ స్పాట్ లు, కం టైన్మెంట్ ప్రాంతాలు మినహా ఇతర ప్రాంతాలలో వివిధ రకాల దుకాణాలు తెరిచేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతులు జారీ చేసింది. ఈ మేరకు తాజాగా నూతన మార్గదర్శకాలు జారీ చేసింది. గ్రామాలు, పట్టణాలు నగరాల్లోని నివాస ప్రాంతాలలోని దుకాణాలను మాత్రమే తెరిచేందుకు అవకాశం కల్పించింది. పట్టణాలు, నగరాల్లోని మాల్స్, షాపింగ్ కాంప్లెక్స్ పై నిషేధం కొనసాగుతుందని స్పష్టం చేసింది.
ఈ నెల 20వ తేదీన పలు రంగాలకు లాక్ డౌన్ నుంచి మినహాయింపు ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ తర్వాత అటవీ ఉత్పత్తులకు, తాజాగా రెండు రోజుల క్రితం బుక్ స్టాల్స్, స్టేషనరీ, ఎలక్ట్రికల్స్ దుకాణాలకు లాక్ డౌన్ నుంచి మినహాయింపు ఇచ్చిన విషయం తెలిసిందే. తాజాగా అన్ని రకాల దుకాణాలకు కూడా మినహాయింపు ఇవ్వడం తో వ్యాపారులకు ఊరట లభించింది.
కరోనా వైరస్ కట్టడి కోసం గత నెల 24వ తేదీ అర్ధరాత్రి నుంచి దేశం మొత్తం లాక్ డౌన్ విధించిన విషయం తెలిసిందే. ఈ నెల 14వ తేదీ వరకు కొనసాగుతుందని కేంద్ర ముందుగా ప్రకటించినా.. ఆలోపు వైరస్ నియంత్రణలోకి రాకపోవడంతో మే 3వ తేదీ వరకు పొడిగించిన విషయం తెలిసిందే. మరో వారం రోజుల్లో పొడిగించిన గడువు ముగిసి పోతుంది. ఈ నేపధ్యంలో ఈ నెల 27వ తేదీన ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో లాక్ డౌన్ అమలు, వైరస్ కట్టడి పై చర్చించనున్నారు.
ప్రస్తుతం దేశంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో మే 3న ముగిసే లాక్ డౌన్ మరికొన్ని రోజులపాటు కొనసాగుతుందా..? లేదా దశలవారీగా ఎత్తి వేస్తారా..? అనేదానిపై దేశమంతా సర్వత్రా ఆసక్తిగా ఎదురుచూస్తోంది. అయితే రోజులు గడిచేకొద్దీ లాక్ డౌన్ నుంచి పలు రంగాలు, దుకాణాలకు మినహాయింపులు ఇస్తున్న నేపథ్యంలో లాక్ డౌన్ వైరస్ ప్రభావిత ప్రాంతాల్లో మాత్రం కొనసాగించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. వైరస్ ప్రభావం లేని ప్రాంతాలకు మరిన్నీ మినహాయింపు ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.