వెంకన్నకే వనరుల లోటా ? తిరుమలకు కూడా కరోనా ఎఫెక్ట్…

ఈ కరోనా వైరస్ ఎవ్వరినీ వదలటం లేదు. మనమంటే మామూలు మనుషులం కాబట్టి మనమీద కరోనా తన ప్రతాపాన్ని చూపిస్తోంది. మరి ఏడుకొండలపై తిరుమలలో వెలసిన వడ్డీకాసుల వాడు వెంకటేశునికి ఏమైంది ? తిరుమల శ్రీవారికి కూడా వనరుల కొరత వచ్చేసినట్లు తిరుమల తిరుపతి ట్రస్టు బోర్డు ఛైర్మన్ ఎస్వీ సుబ్బారెడ్డి చెప్పారు. గడచిన 45 రోజులుగా తిరుమలలో భక్తులకు శ్రీవారి దర్శన భాగ్యాన్ని నిలిపేయటమే కారణమట.

కరోనా వైరస్ దెబ్బకు యావత్ ప్రపంచం లాక్ డౌన్ అయిపోవటంలో భాగంగానే తిరుమల కూడా లాక్ డౌన్లో ఉండిపోయింది. దాంతో భక్తులు వచ్చే అవకాశం లేదు కాబట్టి ఆదాయాలు కూడా నిల్. మొన్నటి వరకు అంటే లాక్ డౌన్ ముందు వరకూ తిరుమల శ్రీవారి ఆలయానికి ప్రతినెల సగటున 250 కోట్ల రూపాయల ఆదాయం వచ్చేది. ఇందులో 100 కోట్ల రూపాయలు హుండీ ఆదాయం, 75 కోట్ల రూపాయలు ప్రసాదాల అమ్మకం ద్వారా వస్తుంటే మిగిలింది కాటేజీల అద్దెలు, తలనీలాల సమర్పణ, ఆర్జితసేవల టిక్కెట్ల అమ్మకం తదితరాల రూపంలో వచ్చేది.

అదే సమయంలో ఉద్యోగుల జీతబత్యాలకు నెలకు 150 కోట్ల రూపాయలు ఖర్చయ్యేది. 45 రోజులుగా భక్తులు రావటం లేదు కాబట్టి వచ్చే ఆదాయాలు పడిపోయింది. అయితే ఉద్యోగులకు ఇవ్వాల్సిన జీతాలైతే తప్పదు కదా ? అందుకనే మధ్యేమార్గంగా ఉద్యోగులకు సగం జీతాలే చెల్లిస్తోంది. చరిత్రను చూస్తే గత వంద సంవత్సరాల్లో తిరుమలలో దర్శనాలను నిలిపేసిన ఘటనే లేదు. ఎప్పుడో గ్రహణం వచ్చినపుడో లేకపోతే ఇంకేదైనా ప్రత్యేకమైన హోమాలు చేసేటపుడు మాత్రమే దర్శనాలను నిలిపేస్తారంతే.

కేంద్రప్రభుత్వం ఎంత తొందరగా లాక్ డౌన్ ఎత్తేస్తుందా అని టిటిడి ఎదురుచూస్తోందని సుబ్బారెడ్డి చెప్పాడు. లాక్ డౌన్ ఎత్తేయకపోతే తిరుమల శ్రీవారి ఆదాయానికి పూర్తిగా గండిపడుతుందట. అప్పుడు బ్యాంకుల్లో ఉన్న ఫిక్సుడు డిపాజిట్లను లేకపోతే వాటిపై నెలకు వస్తున్న వడ్డీని తీసి ఖర్చులు పెట్టాల్సుంటుంది. మొత్తానికి వడ్డీకాసుల వాడికే ఆదాయానికే కరోనా వైరస్ ఎసరుపెట్టేసింది.

Show comments