iDreamPost
android-app
ios-app

లోన్ యాప్ ల భ‌ర‌తం ప‌డుతున్నారు, 233 అకౌంట్లు అటాచ్ చేసిన ఈడీ.. మరో 105 కోట్లు జప్తు

లోన్ యాప్ ల భ‌ర‌తం ప‌డుతున్నారు, 233 అకౌంట్లు అటాచ్ చేసిన ఈడీ.. మరో 105 కోట్లు జప్తు

లోన్ యాప్ కేసులో ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (Enforcement Directorate) అధికారులు 12 రుణ సంస్థలకు చెందిన 105.32 కోట్ల బ్యాంకు బ్యాలెన్సులను అటాచ్ చేశారు. ఇండిట్రేడ్ ఫిన్ కార్ప్ లిమిటెడ్, అగ్లో ఫిన్ ట్రేడ్ ప్రైవేట్ లిమిటెడ్ లాంటి నాన్ బ్యాంకింగ్ రుణ సంస్థలు (NBFCs), వాటితో కలిసి పని చేసిన ఫిన్ టెక్ కంపెనీలకు చెందిన 233 బ్యాంకు అకౌంట్లను సీజ్ చేశారు. గతంలో నాలుగు NBFCల బ్యాంకు ఖాతాలను అటాచ్ చేసి 158.97 కోట్ల రూపాయలు జప్తు చేశారు. దీంతో ఇప్పటివరకు ఈ కేసులో జప్తు చేసిన మొత్తం 264.3 కోట్ల రూపాయలుగా నమోదైంది.

ఇదీ ఫిన్ టెక్ కంపెనీల చీటింగ్ చిట్టా!

చైనా నుంచి వస్తున్న పెట్టుబడుల సాయంతో ఎన్నో ఫిన్ టెక్ కంపెనీలు పర్సనల్ లోన్స్ ఇప్పిస్తామంటూ NBFCలతో ఒప్పందాలు కుదుర్చుకున్నాయని ED దర్యాప్తులో తేలింది. రుణ సంస్థలకు టెక్నికల్ సాయం మాత్రమే అందజేస్తున్నామని ఈ కంపెనీలు చెప్పుకొచ్చాయి. నిజానికి ఈ కంపెనీలే డిజిటల్ లోన్ యాప్స్ క్రియేట్ చేసి కస్టమర్లకు లోన్లు ఇచ్చాయి. మొత్తం లోన్ వ్యవహారమంతా వీటి కనుసన్నల్లోనే జరిగింది. లెండింగ్ లైసెన్స్ కోసమే అవి దివాలా తీసిన రుణ సంస్థలను వాడుకున్నాయి. సోషల్ మీడియా నుంచి డేటా తీసుకుని లోన్లు ఇస్తామంటూ ఈ కంపెనీలు క్లయింట్లను సంప్రదించేవి. 7 నుంచి 30 రోజుల్లోపు చెల్లించే విధంగా అధిక వడ్డీ రేట్లపై అతి తక్కువ వ్యవధిలో లోన్లు ఇచ్చేవి. లోన్ యాప్ డౌన్ లోడ్ చేసుకుని ఆధార్ నంబర్, ఫోన్ నంబర్ ఎంటర్ చేయగానే రుణాలు మంజూరై పోయేవి. డెడ్ లైన్ లోపు లోన్లు తిరిగి చెల్లించకపోతే భారీగా లేట్ ఫీ వసూలు కట్టాల్సి వచ్చేది. ఇలా ఈ కంపెనీలు మొత్తం 4, 430 కోట్ల రూపాయలను రుణాలుగా ఇచ్చి 819 కోట్లు లాభం ఆర్జించినట్లు ఈడీ అధికారులు తేల్చారు. ఈ లాభం మొత్తాన్నే క్రిమినల్ ప్రొసీడ్స్ గా నమోదు చేసుకున్నారు.

లాభాల్లో ఎవరికెంత?

లాభాల్లో అధిక భాగం లోన్ యాప్స్ కి పోతే, లైసెన్స్ వాడుకోనిచ్చినందుకు రుణ సంస్థలకు ఎంతోకొంత కమిషన్ దక్కేది. ఫిన్ టెక్ కంపెనీలు చైనాకు చెందిన ఇన్వెస్టర్లు చెప్పినట్లే వడ్డీ రేట్లు, ప్రాసెసింగ్ ఫీ, ఇతర రుసుములు ఫిక్స్ చేసేవి.

అవసరానికి లోన్లు తీసుకుని తిరిగి కట్టలేక, రికవరీ ఏజెంట్ల వేధింపులు భరించలేక చాలా మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లో నమోదైన కేసుల ఆధారంగా ఈడీ అధికారులు రంగంలోకి దిగి మనీ లాండరింగ్ కేసు (money laundering case) నమోదు చేసి ఈ మేరకు దర్యాప్తు చేస్తున్నారు.