Idream media
Idream media
తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో కొన్ని అంశాలకు సంబంధించి సారూప్యత స్పష్టంగా కనిపిస్తోంది. ప్రభుత్వ నిర్ణయాలలోను, వనరుల సద్వినియోగంలోను ఇద్దరు సీఎంలు వినూత్నంగా ఆలోచిస్తున్నారు. ఆయా శాఖల అధికారులతో చర్చించి సరికొత్త ప్రణాళికలు రచిస్తున్నారు. అటు ప్రజలకు ఉపయోగంగాను, ఇటు ప్రభుత్వానికి ఆదాయం వచ్చేలా ఆలోచనలు చేస్తున్నారు. ఉదాహరణకు ఆర్టీసీ పాత బస్సుల వినియోగంలో ఈ సారూప్యత కనిపిస్తోంది. మొబైల్ రైతు బజార్లుగా పాత ఆర్టీసీ బస్సులను మార్చాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించిన రెండు రోజులకే… మొబైల్ టాయిలెట్ల కోసం ఇక్కడి పాత బస్సులను వినియోగించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
మొబైల్ టాయిలెట్ల కోసం ఆర్టీసీ బస్సులు
ఆర్టీసీలో పాతబడిన సుమారు 400 బస్సులను మునిసిపాలిటీలకు విక్రయించి ఎంతో కొంత సొమ్ము చేసుకోవడంతో పాటు వాటిని మొబైల్ టాయిలెట్లు గా వినియోగించేలా మార్పులు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మునిసిపాలిటీల్లో ఏర్పాటు చేయనున్న మొబైల్ షీ టాయిలెట్ల కోసం వీటిని విక్రయించనుంది. ఈ మేరకు టాయిలెట్ల కు అనుగుణంగా బస్సుల బాడీలను మార్చనున్నారు. తెలంగాణ ఆర్టీసీలో 1000 బస్సుల వరకూ పాతబడిపోయాయి. వీటిలో 660 బస్సులను ఉద్యోగుల సమ్మె కాలంలో పక్కన పెట్టారు. ఇవన్నీ కొంత మేరకు కండీషన్ లో ఉన్నాయి. కొన్నింటిని ఆర్టీసీ కార్గొ సేవల కోసం కేటాయించారు. సరుకు రవాణాకు అనుగుణంగా వాటిని మార్చుతున్నారు. ఇదిలా ఉండగా జీహెచ్ఎంసీ, మునిసిపాలిటీలలో 150 వరకు మొబైల్ షీ టాయిలెట్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. వాటి కోసం ఆయా మున్సిపాల్టీలు ఎన్ని కావాలంటే అన్ని ఆర్టీసీ బస్సులను విక్రయించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. బస్సు కండీషన్ ను బట్టి ఒక్కో దానిని రూ. 4 లక్షల నుంచి 5 లక్షలకు విక్రయించనున్నారు. ఇప్పటికే ఖమ్మం మునిసిపాలిటీకి 8 బస్సులను, కోస్గి మునిసిపాలిటీకి ఒక బస్సును అమ్మారు.
ఏపీలో మొబైల్ రైతు బజార్లుగా…
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆర్టీసీలో పాతబడిన బస్సులను మొబైల్ రైతు బజార్లుగా మార్చనున్న విషయం తెలిసిందే. ఈ మేరకు మార్క్‌ఫెడ్‌తో ఆర్టీసీ ఒప్పందం కుదుర్చుకుంది. నాన్ టిక్కెట్ రెవెన్యూ కింద ఆర్టీసీ ఆదాయం ఆర్జించేందుకు ఇది ఉపకరించనుంది. మరో వైపు మొబైల్ రైతు బజార్ల ద్వారా గ్రామీణ ప్రాంతాల వారికి కూరగాయలు దొరకనున్నాయి.